CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసీలకు హక్కులు దక్కెనా..?!!.గూడేం ప్రజల గుండెల్లో “ద్రౌపతి ముర్ము” నిలిచేనా...!?

Share it:


దమ్మపేట ఆగస్టు 02 ( మన్యం మనుగడ ) : భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం మొత్తం "ఆజాది కా అమృత్ మహోత్సవ్" సంబరాలు చేసుకుంటుంది. కానీ ఐదవ షెడ్యూల్ ప్రాంతంలోని ఆదివాసీ సమాజం మాత్రం రాజ్యాంగబద్ధంగా తమకు దక్కవలసిన తమ హక్కుల కోసం వాటి పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉన్నారు... ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశ 15వ రాష్ట్రపతి గా ఆదివాసి సమాజం నుండి ద్రౌపది ముర్ము ఎన్నకోబడి బాధ్యతలు స్వీకరించినందున తమ హక్కులను రక్షించుకునేందుకు పన్నెండు కోట్ల ఆదివాసీల భవిష్యత్ తరాలకు ఓ భరోసా లభించినట్లయింది.. కానీ ద్రౌపతి ముర్ము ఇప్పుడు ఐదవ షెడ్యూల్ ప్రాంతంలోని ఆదివాసీల రాజ్యాంగబద్ధమైన, చట్టపరమైన హక్కుల పరిరక్షణ కోసం ఎటువంటి వైఖరిని అవలంబిస్తారు అనేది మొదటి ప్రశ్న..? ఈ పాలకులు ఆదివాసి రాష్ట్రపతి అనే ముద్ర వేసి ఆదివాసీల హక్కులను నిర్వర్యం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆదివాసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి . “అటవీ హక్కులు చట్టం-2006” స్థానంలో ఐదవ షెడ్యూల్ లోని భూమిని వినియోగించేందుకు గిరిజనుల అంగీకారాన్ని, గ్రామసభల అనుమతి( పెసా) నుండి తొలగించి… “అటవీ పరిరక్షణ నిబంధనవళి-2022” కు కేంద్రం ఆమోద ముద్ర వేసి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఇది చాలా ప్రమాదకరమైనది. అడవి మొత్తం కార్పోరేట్ సంస్థల కబంద హస్తాలలో చిక్కి పెను విధ్వంసానికి గురవుతుంది.

ఐదవ షెడ్యూల్ ప్రాంతంలోని గ్రామసభలకు అధికారం ఇచ్చేలా 1996 సంవత్సరంలో పార్లమెంటులో పెసా చట్టం ఆమోదం పొందిన తర్వాత ఆదివాసి సమాజం “స్వయం పాలన” , “మా ఊర్లో - మారాజ్యం” వచ్చిందని పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ ఎంతో ఆనందంగా సంబరాలు జరుపుకున్నారు . కానీ నేడు భారతదేశ రాష్ట్రపతి గా ఆదివాసి మహిళ ద్రౌపతి ముర్ము ఎన్నికైనప్పటికీ ఆదివాసీ సమాజం నుండి మిశ్రమ స్పందన వస్తుంది...

ద్రౌపతి ముర్ము రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒడిశా ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆమె జార్ఖండ్ గవర్నర్ గా పనిచేశారు అయినప్పటికీ ఆమె సొంత గ్రామంలో కరెంటు సదుపాయం కల్పించలేకపోయారు. అలాంటిది ఇప్పుడు పన్నెండు కోట్ల మంది ఆదివాసీలకు ఎలాంటి భరోసా ఇస్తారనే చర్చ జరుగుతోంది.. అయినప్పటికీ ఆదివాసీ సమాజంలో ఆశలు చిగురిస్తున్నాయి ఆమె ఇప్పుడు దేశానికి ప్రథమ పౌరురాలు కాబట్టి ఐదవ షెడ్యూల్ ప్రాంతంలోని రాజ్యాంగబద్ధమైన, చట్టపరమైన హక్కులు పరిరక్షణ మరియు ఆదివాసీ సమాజం యొక్క అభివృద్ధికి సంబంధించిన బాధ్యతలు ఆమె పైనే ఉన్నాయి..

 భారతదేశంలో తామే మొదటి నివాసులమని తామే అసలైన దేశ వారసులమని ఆదివాసీ సమాజం అంటుంది. త్వరలో జరగబోయే జనగణనలో కూడా ఏ మతంతో సంబంధం లేకుండా తమకు ప్రత్యేకంగా “ఆదివాసి” అనే క్రమ సంఖ్య ఏర్పాటు చెయ్యాలని ఆదివాసీలు ఉద్యమాలు చేస్తున్న తరుణంలో... ఆదివాసీలను ఈ దేశ ములవాసుగా గుర్తించడానికి పాలకులు ఒప్పుకోవడం లేదు.. అందుకే షెడ్యూల్ తెగలు అనే పదాన్ని తీసివేసి “ఆదివాసీ” అనే పదాన్ని చేర్చాడానికి రాష్ట్రపతి ప్రత్యేక చోరవ చూపించాలని ఆదివాసీలు కోరుతున్నారు..

ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసిలు తమ భూముల కోసం, తన ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరుల రక్షణ కోసం చాలా కాలం నుండి ఉద్యమాలు చేస్తున్నారు కానీ అభివృద్ధి పేరుతో, ప్రాజెక్టులు పేరిట, టైగర్ జోన్ ల పేరుతో అక్కడ చట్టపరంగా, చట్టవిరుద్ధంగా ఇప్పటికీ పచ్చని ప్రకృతి విధ్వంసంతో పాటు ఆదివాసీల జీవన విధ్వంసం జరుగుతూనే ఉంది. ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న సహజ వనరులును, ఖనిజ సంపదను పెట్టుబడిదారీ వ్యవస్థకు, కార్పోరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడానికి ఇదే సరైన సమయమని భావించి పాలకులు ఆదివాసీ సమాజం నుండి రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్ము ను ఎంపిక చేయడం జరిగిందని ఆదివాసి సమాజం అనుకుంటుంది.. ఇప్పటికైనా ఐదవ షెడ్యూల్ భూభాగంలో ఆదివాసుల భూముల భూ పరాయికరణ ఆగుతుందా…? ఆదివాసీలపై జరుగుతున్న దాడులు ఆగుతాయా…? అభివృద్ధి పేరిట ఆ ప్రాంతంలో జరిగే దోపిడి, ప్రకృతి విధ్వంసంతో పాటు ఆదివాసీల జీవన విధ్వంసం ఆగుతుందా…? అనే చర్చ ఆదివాసీ సంఘాలలో విస్తృతంగా జరుగుతోంది...

భారత రాజ్యాంగంలో ఐదవ షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్ ప్రాంతాలను కలిగి ఉన్న రాష్ట్రాల గవర్నర్లకు షెడ్యూల్ ప్రాంతాల పరిరక్షణ కోసం ప్రత్యేక అధికారాలు ఇవ్వబడినవి. కానీ నేడు గవర్నర్ వ్యవస్థను రాజ్ భవన్ కు మాత్రమే పరిమితం అయ్యేలా చేసి పాలకులు గవర్నర్ ను తమ చేతిలో రబ్బరు స్టాంపు గా ఉపయెగిస్తున్నారు. ఈ విధానంలో మార్పు తెచ్చేందుకు రాష్ట్రపతి కృషి చేయాలని కోరుతున్నారు.

 ఆర్టికల్ 19 (5) ప్రకారం ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసిల అభివృద్ధి కోసం, రక్షణ కోసం నిర్ణయాలు తీసుకునే అధికారం ఆదివాసీలకు మాత్రమే ఉండేలా చూడాలి. జనాభా ప్రాతిపదికన గిరిజనేతరులకు కూడా షెడ్యూల్ ప్రాంతాలలో హక్కులు కల్పించడం అనేది ఆదివాసీలకు తీవ్ర అన్యాయం చేసినట్లే అవుతుంది.. ఆదివాసీలు ప్రకృతి ఆరాదికులు. పకృతి సంరక్షకులు కూడా... వారి జీవన విధానామంత అడివితోనే పెనవేసుకుని ఉంటుంది. ఆదివాసీల నివసించే ఐదవ షెడ్యూల్ ప్రాంతంలోనే పచ్చని ప్రకృతి మనకు కనిపిస్తుంది. నేడు ఆదివాసిల సంస్కృతి-సంప్రదాయాలు అంతరించిపోయే దశలో ఉన్నాయి. నేడు అనేక మతాలు ఐదవ షెడ్యూల్ ప్రాంతంలోకి పోటీ పడుతు చోచ్చుకు వస్తున్నాయి. వాటిని ఎదుర్కోని ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు సజీవంగా నిలిపేందుకు , ఆదివాసీల భవిష్యత్ తరాలు ఉన్నత శిఖరాలకు చేరుకోవాడానికి నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు రాష్ట్రపతి ప్రత్యేక దృష్టి సారించాలి..

ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా, ఆదివాసి ఆడపడుచు గా ఐదవ షెడ్యూల్ ప్రాంతంలోని ఆదివాసీ సమాజం యొక్క రాజ్యాంగబద్ధమైన హక్కుల పరిరక్షణ కోసం “ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం” నాడు ఆదివాసి సమాజానికి స్పష్టమైన హామీ ఇచ్చి ఆదివాసీల అభివృద్ధి కోసం నడుంబిగించాలి.. రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పదవి విరమణ వరకు ద్రౌపతి ముర్మును ఆదివాసి సమాజం నిశితంగా గమనిస్తుంటుంది. అదేమిటంటే ఆమె తన వ్యక్తిగత ప్రతిష్టత కోసం పాలకుల చేతిలో కీలుబొమ్మలా పనిచేస్తుందా…? లేదా… ఐదవ షెడ్యూల్ ప్రాంతంలోని ఆదివాసి సమాజంకు దక్కవలసిన రాజ్యాంగబద్ధమైన, చట్టపరమైన హక్కుల పరిరక్షణకు కృషి చేస్తారా..? అని…

 రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్ము తన అధికారాలన్నీ ఉపయోగించి ఐదవ షెడ్యూల్ ప్రాంతంలోని ఆదివాసీలకు దక్కవలసిన రాజ్యాంగబద్ధమైన, చట్టపరమైన హక్కుల కోసం మరియు ఆదివాసిల కోసం, ఆదివాసీ భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం కృషి చేస్తే చిరకాలం ఆదివాసీల గుండెల్లో “ఆరాధ్యురాలి” గా నిలుస్తారు ...



వంకా వరాలబాబు, ఎం.ఫిల్

                                                  పరిశోధక విద్యార్థి

                                           మద్రాసు యూనివర్సిటీ

                                                         9948898639

Share it:

TS

Post A Comment: