CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అమలుకు నోచుకోని అటవీ హక్కుల చట్టం.

Share it:దమ్మపేట జులై 08 ( మన్యం మనుగడ ) : అటవి హక్కుల చట్టం-2006 అనుసరించి ప్రతి ఆదివాసీ కుటుంబానికి పది ఎకరాల అటవీ భూమిని కేటాయించి,పట్టా ఇస్తామని యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అటవీ హక్కుల చట్టం చేసి 16 సంవత్సరాలు అవుతున్నా దాని పరిమితుల్లో కూడా అడవి బిడ్డలకు భూమి దక్కకపోవడంతో ఆ చట్టం అమలు పట్ల అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రిటిష్ పాలకుల నుంచి నేటి దేశీయ పాలకులు వరకు చేసిన అటవీ చట్టాలను సమీక్షించాల్సిన అవసరం ఉన్నది. బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్య్రం పొందాక కూడ దేశీయ పాలకులు అన్ని వ్యవస్థలలోనూ వారి విధానాలనే కొనసాగిస్తున్నారు. అటవీ హక్కుల చట్టం సైతం అలాంటిదే. 1855 భారత గవర్నర్ గా ఉన్న డల్హౌసీ మొదటిసారి అడవి బిడ్డలకు వ్యతిరేకంగా అటవీ విధానాన్ని ప్రకటించి, అటవీ సంపదలన్నీ ప్రభుత్వ ఆస్తులని అధికారికంగా ప్రకటించాడు. 1864లో అటవీ ఎన్ స్పెక్టర్ జనరల్ నియామకంతో తరతరాలుగా అడవిపై ఆదివాసీల హక్కు స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వ పెత్తనం ప్రారంభమయింది. 1865లో మొట్టమొదటి అటవిచట్టం చేయడం ద్వారా అడవులను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు పూనుకుంది. అడవుల మీద గిరిజన గ్రామాలకు ఉన్న సంప్రదాయ హక్కులపై ఆంక్షలు విధిస్తూ చట్టంలో మార్పులు చేసి అధికారాన్ని మరింత విస్తృతపరచుకుంది. స్వాతంత్ర్య అనంతరం కూడా దేశీయ పాలకులు బ్రిటిష్ పాలకుల అటవీ చట్టాలను అమలు చేస్తున్నారు. 1952లో ప్రకటించిన అటవీ విధానమే అందుకు నిదర్శనం ఈ విధానం ద్వారా రిజర్వు, రక్షిత, గ్రామ అడవులుగా అటవీ ప్రాంతాన్ని విభజించారు. దాని ఫలితంగా అడవి పై ఆదివాసీల హక్కు చాలా పరిమితమైపోయింది. 1980లో కేంద్రప్రభుత్వం మరో గిరిజన వ్యతిరేక చట్టం రూపొందించి అమలు చేసింది. దానిననుసరించి ఆదివాసులను అడవి నుంచి కాలీ చేయించే చర్యలు చేపట్టింది. 1973లో టైగర్ జోన్ ప్రాజెక్ట్ పేరుతో అటవీప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీలను అక్కడి నుంచి వెళ్లకొట్టేందుకు పూనుకుంది. 1980 నుంచి అటవీ హక్కుల చట్టంలో అనేక మార్పులు చేర్పులు చేసింది. 1996లో సుప్రీంకోర్టు తీర్పుతో యాజమాన్యం, గుర్తింపు, వర్గీకరణతో సంబంధం లేకుండా ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన అన్ని ప్రాంతాలకు చట్టాన్ని వర్తింపచేయడం వల్ల ఆదివాసీల హక్కులకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. బ్రిటిష్ వారు మరియు దేశీయ పాలకులు రూపోందించిన చట్టాలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరిగాయి. వాటిలో 1830లో బిహార్, బెంగాల్ లో తిరుగుబాటు 1855-56లో సంతాల్ తిరుగుబాటు 1802-03 లో రంప తిరుగుబాటు, 1922-24లో అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో జరిగిన మన్యం తిరుగుబాటు కొమురం భీం నాయకత్వంలో 1940లో గోండుల తిరుగుబాటు, 1967 నక్సల్బరీ గిరిజన్ రైతాంగ్ పోరాటం, 1065-70 సంవత్సరాల్లో శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటం చెప్పుకోదగినవి. ఆదివాసీ సమాజంలో పోరాటాలు ఫలితంగా బ్రిటిష్ పాలకుల దేశీయ పాలకులు అడవి బిడ్డల కోసం కొన్ని చట్టాలు చేయక తప్పలేదు. 1917లో భూ బదలాయింపు క్రమబద్ధీకరణ అమలులోకి వచ్చింది. దీని ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు మాత్రమే భూములు కలిగి ఉండవచ్చు. ఆ ప్రాంతంలో చాలా కాలంగా నివశించిన వారిని కూడా గిరిజనులగా గుర్తించడానికి చట్టంలో అవకాశం కల్పించడం ద్వారా గిరిజనేతరుల భూములకు కూడా రక్షణ ఏర్పడింది. అవిధంగా గిరిజనుల భూములు అన్యాక్రాంతం కావడానికి చట్టం అవకాశం కల్పించింది. హైదరాబాద్ రాష్ట్రంలో ట్రైబల్ ఏరియాస్ రెగ్యులేషన్ 1359 ఫసలీ (కరస్పాండింగ్ టు 1949) అనే చట్టాన్ని అమలులోకి తెచ్చారు. ఆ చట్టం గిరిజనేతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారికి ప్రాంతాలలో భూములు ఉండడాన్ని నిషేదించింది. శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటం ఫలితంగా 1970లో1/70 చట్టం వచ్చింది. ఈ చట్టం ప్రకారం గిరిజన ప్రాంతాలలో భూములు అమ్మగూడదు కొనగూడదు. అయితే ఆ చట్టంలో అనేక మార్పులు చేయడం వల్ల గిరిజనులకు తీవ్ర మైన అన్యాయం జరిగింది... క్రమక్రమంగా ఈ చట్టాన్ని కూడా పాలకులు నీర్విర్యం చేస్తున్నారు. ఆటవీ భూములపై గిరిజనుల హక్కుల గురించి కోర్టులు పరస్పర విరుద్ధమైన తీర్పులు ఇచ్చాయి. ఒకే న్యాయమూర్తి గిరిజనులకు అనుకూలంగా వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వడం జరిగింది. చట్టంలోని లొసుగుల వల్ల గిరిజనులకు చెందాల్సిన వేలకొద్దీ ఎకరాల భూములు గిరిజనేతరులు కబ్జా చేశారు. అడవి బిడ్డలును అడవి నుంచి వెళ్లగొట్టేందుకు పాలకులు ఎన్ని చట్టాలు చేసినా, తీవ్ర నిర్బంధం ప్రయోగించినా అడవిపైన తమ హక్కు కోసం ఆదివాసీలు పోరాటం కొనసాగుతూ ఉండటంతో తామే భూములు పంచుతామని యూపీఏ ప్రభుత్వం 2005 లో అటవీ హక్కుల బిల్లును రూపొందించింది. 1980కి పూర్వం గిరిజనుల ఆక్రమణలో ఉన్న భూములనే క్రమబద్ధీకరి స్తామని బిల్లులో స్పష్టం చేయడంతో గిరిజనులు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఫలితంగా 2005 కు పూర్వం గిరిజనుల ఆధీనంలో ఉన్న భూములను క్రమబద్ధీకరిస్తామని చెప్పి 2006 డిసెంబర్లో బిల్లును లోక్ సభ, రాజ్యసభలో ఆమోదించి చట్టంగా ప్రకటించారు. 2008 జనవరి నుంచి దానిని జమ్మూ కాశ్మీర్ మినహా దేశమంతటా అమలు జరుపుతున్నట్లు ప్రకటించారు. ఈ చట్టం ద్వారా పరిమిత అటవీ ప్రాంతానికే గిరిజనులను పరిమితం చేయడం అనేది పాలకుల విధానమయింది. ఈ చట్టాన్ని అనుసరించి గిరిజన కుటుంబానికి 10 ఎకరాల అటవీ భూమిని కేటాయించి పట్టా ఇస్తామని యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. మునుపటి చట్టాల మాదిరిగానే దీన్ని ప్రారంభం నుంచే పాలకులు నీరుగార్చే విధానాలు అనుసరిస్తూ చట్టంలో అనేక లొసుగులకు వీలు కల్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2009 నాటికల్లా గిరిజనులకు భూపట్టాలు ఇస్తామని ఆనాటి ముఖ్యమంత్రి స్వయంగా ప్రక టించాడు. అదే క్రమంలో పంపిణీ భూముల మొత్తాన్ని 25 లక్షల ఎకరాల నుంచి 12లక్షల ఎకరాలకు కుదించారు. చాలా రాష్ట్రాల్లో అటవీభూములు గుర్తింపే జరగలేదు. చట్టం ఆచరణ రూపం దాల్చి 16 సంవత్సరాలైనా అటవీభూముల పంపిణీ నత్తనడకన కూడా సాగడంలేదు. పాలకుల తీరుపట్ల గిరిజనుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ భూములను పంపిణీ చేస్తామని చెబుతూ వారి ఉద్యమాలను దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నాయి. పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసీలపై ప్రభుత్వం ఫారెస్ట్, రేవేన్యూ, పోలీసు యంత్రాంగంతో అక్రమ కేసుల్లో ఇరికించి తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. పాలకులు తమకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న విధానాలను ఇప్పటికైనా గమనించి అడవిపైన, అటవీ సంపదలపైన తమదే హక్కని, అటవీ హక్కుల చట్టం ప్రకారం పది ఎకరాల భూములకు పట్టాలు వేంటనే ఇవ్వాలని అలాగే ఆదివాసీలు తమ హక్కులు, చట్టాల కోసం ఐక్యంగా ఉద్యమించి తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి....వంకా వరాలబాబు,

పరిశోధక విద్యార్థి, ఎం.ఫిల్,

మద్రాసు యూనివర్సిటీ.

Share it:

TS

Post A Comment: