CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రాష్ట్రంలోకి ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు.గతేడాది కంటే రెండ్రోజులు ఆలస్యంగా రాక

Share it:



  •  104% మేర వర్షపాతం నమోదుకు అవకాశం
  •  అయినా మరో రెండ్రోజులు ఎండలు


మన్యం టీవీ వెబ్ డెస్క్:


రాష్ట్రంలో ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు ఊరటనిచ్చేలా వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది.

తెలంగాణలోకి రేపు మంగళవారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు అంచనా వేసింది.గతేడాదితో పోలిస్తే రుతుపవనాల రాకకు రెండ్రోజులు ఆలస్యమైనట్లు పేర్కొంది.ఈ నెల 10వ తేదీ కల్లా రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపింది. వాస్తవానికి మే 29న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించగా ఆ తర్వాత వాటి కదలిక మందగించడంతో వ్యాప్తి ఆలస్యమైంది.ప్రస్తుతం రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ వివరించింది.


 *సాధారణం కంటే కాస్త ఎక్కువ వానలు.* 


ఈ ఏడాది రాష్ట్రంలో వర్షాలు సంతృప్తికరంగా ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే కాస్త ఎక్కువ వానలు కురుస్తాయని చెబుతున్నారు. తెలంగాణలో సాధారణ వర్షపాతం 72.05 సెంటీమీటర్లు కాగా.గతేడాది వానాకాలంలో 100.97 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 6 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవగా 21 జిల్లాల్లో అధిక వర్షపాతం,మరో 6 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.సాధారణ వర్షపాతంతో పోలిస్తే రాష్ట్రంలో ఈసారి మొత్తంమీద 104 శాతం మేర వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రుతుపవనాల కదలికలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అంచనాల్లో మార్పులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.


 *పెరిగిన ఉక్కపోత..*


కేరళలోకి నైరుతి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించినప్పటికీ తొలి మూడు రోజులు మందకొడిగా కదలడంతో వాతావరణం చల్లబడలేదు.సాధారణంగా సీజన్‌కు ముందుగా కురిసే వర్షాలతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకొని చల్లబడుతుంది.కానీ ఈసారి నైరుతి సీజన్‌కు ముందు ఉష్ణోగ్రతలు పెరిగాయి. నడివేసవిలో నమోదైనట్లుగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. అసని తుపానుతో మే నెల మూడో వారంలో వాతావరణం చల్లబడినట్లు కనిపించినా ఆ తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగాయి.దీని ప్రభావంతో వాతావరణంలో ఉక్కపోత పెరిగింది.దీనికి వడగాడ్పులు తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తాజాగా మరో రెండ్రోజులు కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. రుతుపవనాలు పూర్తిగా వ్యాప్తి చెందే వరకు ఉష్ణోగ్రతలు సాధారణానికి కాస్త అటుఇటుగానే నమోదు కానున్నాయి.ఆదివారం నల్లగొండలో 43.8 డిగ్రీ సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రత నమోదవగా మెదక్‌లో 25 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది.

Share it:

TS

Post A Comment: