CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

విరామం లేని కబ్జా..!-37 ఎకరాల నుండి 17 ఎకరాలకు దొంతికుంట చెరువు కుదింపు..

Share it:

 



  • -కబ్జాదారుల కబంధ హస్తాల్లో దొంతికుంట చెరువు
  • -చట్టాలను ఉల్లంగించి అక్రమ భూ కొనుగోళ్లు,రిజిస్ట్రేషన్లు, లేఅవుట్లు
  •  -నివారించాలంటున్న ప్రజలు


*మన్యం మనుగడ, అశ్వారావుపేట:* అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కాదేదీ కవితకు అనర్హం అన్నాడు ఆనాడు శ్రీ శ్రీ. చెరువులు, కుంటలు, స్మశానవాటికలు, గ్రామకంఠం, ప్రభుత్వ స్థలాలు కాదేదీ కబ్జాకు అనర్హం అని నిరూపిస్తున్నారు ఈనాడు మన ప్రబుద్దులు. రాజకీయ పలుకుబడి, అర్ధబలం అంగబలం, మీడియా బలం ఉంటే చాలు ఎటువంటి భూమినైనా కబ్జా చేసి పడేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్ళకు తలోగ్గలేక అధికారులు కూడా చేతులెత్తేస్తున్న పరిస్థితి దాపురించింది. అశ్వారావుపేట మేజర్ గ్రామపంచాయతి పరిధిలోని దొంతికుంట చేరువులో పట్టపగలు చెరువుని ట్రాక్టర్లతో మట్టి పోస్తూ పూడుస్తున్నా ఏ శాఖ అధికారులు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కళ్ళ ముందు ఇంతా జరుగుతున్నా చోద్యం చూస్తూ అన్నీ నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయి అన్నట్లు యదేచ్ఛగా వారి పనులు వారు చేసుకుంటూ పోతున్నారు. 

ఏళ్ళనాటి చరిత్ర కలిగి ప్రజలకు మంచినీళ్ళు అందించిన చెరువు ఇప్పుడు వెలవెల బోతోంది, అప్పటి ప్రభుత్వ లెక్కల ప్రకారం దొంతికుంట చెరువు 37 ఎకరాల 3 కుంటలుగా ఉండేదని,1998 నాటికి 27 ఎకరాలు రెవెన్యూ లెక్కల్లో ఉన్నప్పటికి, ఇరిగేషన్ శాఖ లెక్కల్లో మాత్రం తేడాలు ఉండడంతో అదే అదునుగా భావించి గుడిని గుడిలో లింగాన్ని మింగే ప్రభుద్ధులు చేరువునే మింగేసే ప్రయత్నాలు చేసారని, అదేవిధంగా నేటికి చెరువుని ప్రస్తుతానికి 17 ఎకరాల 3 కుంటలకు చేరువుని కుదించినట్లు తెలుస్తుంది. దొంతి కుంట చెరువుకు మధ్యలో అడ్డంగా గోడను నిర్మిస్తుంటే, మరికొందరు తామేమి తక్కువ కాదన్నట్లు చెరువుని పూడుస్తూ కొత్త వెంచరుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబందిత అధికారులు మాత్రం మారు మాట్లాడకుండా ఉండడం ఏంటని పలువురు సంబంధిత శాఖలపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అశ్వారావుపేట లో కొందరు అసైన్మెంట్ భూములను కొనుగోలు చేసి రెవెన్యూ అధికారుల అండదండలతోటి రిజిస్ట్రేషన్ భూములుగా మార్చి రియల్ ఎస్టేట్ దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. మరొకవైపు ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా భూములు కొనుగోళ్లు చేసి అమాయక గిరిజనులను వారి అవసరాలను అడ్డంపెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నారని తెలుస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం నిబంధనలు కఠినంగా అమలుచేస్తే ఇటువంటి సంఘటనలు జరక్కుండా అడ్డుకట్ట వేయవచ్చని, అశ్వారావుపేట మండలం లో భూకబ్జా, అక్రమ కొనుగోళ్లు, అక్రమ రిజిస్ట్రేషన్ పై తగు విచారణ జరిపిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లా స్థాయి అధికారులు స్పందించి కనుమరుగవుతున్న కబ్జాకోరాల్లో చిక్కుకున్న దొంతికుంట చెరువు అసలు లెక్కలు తేల్చాలని అశ్వారావుపేట లో బడా బాబులకు కట్టబెట్టిన ప్రభుత్వ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విధంగా ప్రభుత్వం దృష్టిపెట్టాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు. ఈ విషయమై సంబంధిత శాఖ అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు.

Share it:

TS

Post A Comment: