CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అడవికి అందం-కొమ్ము నృత్యం, రేలా పాట.

Share it:

 మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట మార్చి ( 20 ) ఆదివారం ;- ప్రకృతితో మమేకమై జీవనం కొనసాగించే స్వచ్ఛమైన మనస్సు గల ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు ఎంతో ప్రత్యేకమైనవి. ఆదివాసీల సంస్కృతిలోని పండుగలు, పాటలు, నృత్యలు (పుట్టుక, పెళ్లి, చావు, ఆట, పాట) అవన్నీ ప్రకృతితోనే మమేకమై ఉంటాయి.

ఆదివాసీలు భారతీయ సంస్కృతికి బీజాలు. ఆధునిక యుగానికి, ఆదిమ కాలానికి వారధులుగా భావిస్తారు. గిరిజన తెగల్లో నుంచి పుట్టుకొచ్చిన జానపద కళారూపాలు చాలానే ఉన్నాయి. అలాంటి అనేకానేక కళల్లో ‘కొమ్ము కోయ నృత్యం ప్రత్యేకమైనది. ఈ నృత్య ప్రదర్శనలో తలపై కిరీటంలా ధరించే కొమ్ముల తలపాగా వలన ఈ నృత్యం మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ తలపాగా తయారు చేయడానికి మొదటిగా తల చుట్టుకొలతకు సరిపడా బుట్టను తయారు చేసి దానికి అడవి దున్న కొమ్ములు( పెర్మాకోర్క్) మరియు నెమలీకల(పింఛం) కలబోతతో రంగుల వస్త్రాలను చుట్టి చుడముచ్చటగా తయారు చేస్తారు. ఆదివాసీ తెగల్లో కోయ తెగవారు మాత్రమే చేసే కొమ్ము కోయ నృత్యం అత్యంత పురాతన కళారూపంగా ప్రసిద్ధి చెందింది. అడవి దున్న కొమ్ములతో చేసిన తలపాగా దానికి నెమలి పింఛాలు అలంకరించి దానిని తలపైన కిరీటంలా ధరించి మెడలో పెద్ద డోలు వేసుకొని దానిని లయబద్ధంగా వాయిస్తూ చేసే ఈ నృత్య రూపకాన్ని *కొమ్ముడోలు* అని కూడా పిలుస్తారు. తొలకరి సందర్భంగా ఆదివాసీ ప్రాంతాల్లో భూమిపండుగ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సరైన సమయంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని తమ దైవాన్ని అనగా ప్రకృతిని పూజిస్తూ ఈ నృత్యం చేస్తారు. అదే విధంగా కాలానుగుణంగా వచ్చే అనేక ఆదివాసీ పండుగలలో, పెళ్లి వేడుకలో, శూభకార్యలలో ఈ నృత్యాలు వారి జీవితంలో భాగమైపోయాయి. కోయల పుట్టుక నుంచి మరణం వరకు జరిగే అనేకానేక కార్యక్రమాల్లో మంచి విందు భోజనంతో పాటు 'కొమ్ము నృత్యం కూడా తప్పని సరిగా ఉంటుంది. అప్పుడే కార్యక్రమానికి నిండుదనం వస్తుంది. కొమ్ము నృత్యరూపకం అనేక ప్రత్యేకతల సమాహారం. ఈ నృత్య ప్రదర్శనకు కొన్ని ప్రత్యేక పద్ధతులు ఉంటాయి. స్త్రీ పురుషులు లయబద్ధంగా అడుగులు వేస్తూ చేసే ప్రదర్శన అయినప్పటికీ పురుషుల నృత్య పద్ధతి స్త్రీల నృత్య పద్ధతికి కొంత వ్యత్యాసం ఉంటుంది. పురుషులు ప్రత్యేకమైన వస్త్రధారణతో డోలు వాయిస్తూ అడుగులో అడుగులు వేసుకుంటూ నృత్యం చేస్తారు. ఈ ప్రదర్శనను పెర్మకోర్ అని కూడా పిలుస్తారు. మహిళలు అకుపచ్చ చీరలు ధరించి, తలకు రిబ్బన్, కాళ్ళకు గజ్జెలు కట్టుకొని, కొప్పులో పూలు పెట్టుకొని ఒకరిచేతులు ఒకరు పట్టుకొని రేలా పాటలు పాడుతూ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. దీనిని *'రేలా నృత్యం'* అని పిలుస్తారు.


 ఈ *పెర్మాకోర్* లో 10 నుంచి 15 మంది పురుషులు డోళ్లు వాయిస్తూ లయ బద్ధంగా అడుగులు కదిలిస్తూ వలయాకారంగా తిరుగుతారు. అప్పుడప్పుడూ వలయం మధ్య లోంచి దూసుకువచ్చి కేకలు వేస్తూ ఒకరి కొమ్ములను మరొకరు డీ కొడతారు అది చూపరులను చాలా భయాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా ఎవరైనా వీక్షకులు డబ్బులు నేలపై వేస్తే వాటిని చేతితో తీసుకోకుండా తలపై కీరీటంలా ధరించిన కోమ్ములతో పైకి తీసుకోవడం చూపరులను ఈ నృత్యం మరింత ఆకట్టుకునేలా చేస్తుంది. స్త్రీలు పాడే రేలా పాటలు గేయ సహితంగాను ఉత్సాహన్ని కలిగించేలా ఉంటాయి. సందర్భోచిత గేయాలతో రేల పాటలతో నృత్యం సాగుతుంది. బృందంలో ఒకరు పాడితే మిగతావారు అనుకరిస్తారు. 


ఈ కొమ్ము నృత్యం, రేలా పాటలు ప్రదర్శించేవారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని

ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుత తరం వారు డిజేల మోజులో పడి ఈ నృత్యకళను నేర్చుకోడానికి అంతగా ఇష్టపడక పోవడంతో కొమ్ము కోయ నృత్యం కనుమరుగయ్యే స్థితికి చేరింది. పరిస్థితి ఇలానే కొనసాగితే ఈ ఆదివాసీ నృత్యకళ క్రమంగా అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా ఆదివాసీ ఔత్సాహిక యువత తమ సంస్కృతి, సంప్రదాయాలకు చిరునామాలాంటి ఈ నృత్యకళలను సజీవంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత తమ భుజస్కంధాలపై వేసుకోవాలి.


వంకా వరాలబాబు,

పరిశోధక విద్యార్థి, ఎం.ఫిల్,

మద్రాసు యూనివర్సిటీ,

9948898639.

Share it:

TS

Post A Comment: