CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు లెక్క తేల్చాలి

Share it:

 



అద్దెకరం.. ఎకరం చేసుకొనేవారికి న్యాయం..

అర్హులైన గిరిజనులకు పట్టాలు అందజేస్తాం

వందల ఎకరాలు దోచుకునేవారిని తరిమేస్తాం..

పోడు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంటాం

నరుక్కుంటూపోతే అడవిలో చెట్లు మిగలవు..

పోడుభూములపై త్వరలో విస్తృత సమావేశం

అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌


పోడు భూముల సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, అయితే ప్రస్తుతం ఎంత విస్తీర్ణంలో పోడు సాగు చేస్తున్నారో తెలియాల్సి ఉన్నదని సీఎం కేసీఆర్‌ చెప్పారు.


ఇందుకోసం పోడుభూములు సాగుచేసుకుంటున్న వారినుంచి దరఖాస్తులు తీసుకుంటామని తెలిపారు. అంతకంటేముందు వారు ఇకపై ఇంచు మందం కూడా ముందుకు జరగబోమని హామీ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. హామీపత్రం ఇచ్చాక కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మంగళవారం అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటైన మొదట్లో రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉండేవని, ఒక్కోరంగాన్ని ఎంచుకుని, కఠిన నిర్ణయాలు తీసుకుంటూ నేడు ఈ స్థాయికి చేరుకున్నామని వివరించారు.


నరుక్కుంటూపోతే అడవి మిగలదు

నరుక్కుంటూపోతే అడవంతా ఖాళీ అయిపోతుందని, చివరకు ఒక్క చెట్టు కూడా మిగలదని సీఎం కేసీఆర్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయంలో పోడు రైతులతోపాటు ప్రజాప్రతినిధుల నుంచి భవిష్యత్‌లో అడవుల సంరక్షణ, అటవీ సంపదను కాపాడుకునే బాధ్యతను తీసుకుంటామని ప్రతిజ్ఞ తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో దాదాపు ఆరేడు లక్షల ఎకరాల్లో పోడు నడుస్తున్నదని అంచనాలు ఉన్నాయన్నారు. వాస్తవానికి 'అడవి ఉంటేనే మేము బతుకుతం' అనే భావన గిరిజనుల్లో ఉంటుందని, అందుకే వాళ్లు అడవిని కాపాడుతారని పేర్కొన్నారు. అద్దెకరమో.. ఎకరమో దున్నుకునే వారికి న్యాయంచేయాలని స్పష్టంచేశారు. వాళ్లను అడ్డం పెట్టుకొని వందల ఎకరాలను దోచుకునే దొంగలను తరిమేయాలని చెప్పారు. గిరిజనుల చేతుల్లో ఉన్న దాదాపు ఐదు లక్షల ఎకరాలకు పట్టాలు ఇవ్వవచ్చని, దీనికి కార్యాచరణను తక్షణం మొదలు పెడుతామని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు దరఖాస్తులు తీసుకోవాలని, అర్హులందరికీ పట్టాలు ఇద్దామని చెప్పారు. గిరిజనేతరుల భూములకు మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని అడగాల్సి ఉన్నదని పేర్కొన్నారు.


కఠిన నిర్ణయాలతో వ్యవసాయం స్థిరీకరణ

వర్షంపడక, ప్రాజెక్టులు లేక 50-60 ఎకరాల భూమి ఉన్న రైతులు కూడా హైదరాబాద్‌లో కూలి పనులకు వచ్చేవారని కేసీఆర్‌ గుర్తుచేశారు. వ్యవసాయాన్ని స్థిరీకరించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకున్నామని, ఫలితంగా నేడు దేశంలో నంబర్‌ 1 స్థానానికి చేరుకున్నామని చెప్పారు.


రైతులు ఎప్పుడూ అప్పుల్లోనే ఉండాలా?

'వ్యవసాయ రుణపరపతి తగ్గిపోయిందని ఒక పత్రిక రాసింది. అంటే తెలంగాణ రైతులు ఎప్పుడూ అప్పుల్లోనే ఉండాలా?' అని సీఎం అసహనం వ్యక్తంచేశారు. రైతులు బ్యాంకుల కాడికి తక్కువ పోతున్నరని చెప్పారు. ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో నాలుగెకరాలు వస్తదనే పరిస్థితి తారుమారైందని.. నల్లగొండ జిల్లా రైతులు ఎకరం అమ్మి ప్రకాశం జిల్లా లో అరెకరాలు కొంటున్నారని చెప్పారు. మన రాష్ట్రంలో రూ.20 లక్షలకు ఎకరం భూమి ఎక్కడా లేదని, ఉన్నకాడ 50 లక్షలు ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో అద్భుతంగా పచ్చదనం కనిపిస్తున్నదని చెప్పారు. ప్రాజెక్టుల్లోకి నీళ్లు రావడం, పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేయడం, భూగర్భ జలాలు పెరుగడం, మిషన్‌ కాకతీయ వల్ల ఇది సాధ్యమైందన్నారు. 'గతంలో వానలు పడితే దేవుడు మా పార్టీలో ఉన్నడని చెప్పేవాళ్లు. మేం అట్లా చెప్పం. దేవుడు కరుణిస్తున్నడు. ప్రకృతి కరుణిస్తున్నది.. పచ్చదనం పెరుగుతున్నది. భూమ్మీద నీటి విస్తరణ పెరుగుతుండటంతో ఎకలాజికల్‌ బ్యాలెన్స్‌ అవుతున్నది.


మంచి వర్షాలు కురుస్తున్నాయి. తద్వారా అద్భుతమైన పంటలు పండుతున్నయ్‌' అని సీఎం చెప్పారు. 24 గంటల ఉచిత కరెంట్‌తో రైతుల్లో ధీమా వచ్చిందని..1.29 కోట్ల ఎకరాల భూమి సాగవుతున్నదని చెప్పారు. యాసంగిలో మళ్లీ 60-65 లక్షల ఎకరాలు తయారుగ ఉన్నదన్నారు. 'గతంలో మన మైనర్‌ ఇరిగేషన్‌ వ్యవస్థ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ఒక్క సంవత్సరం మంచి వర్షాలు పడితే చెరువులు టపాకాయలు పేలినట్టు పేలుతుండే. ఏడెనిమిది వేల చెరువులు తెగిపోయిన చరిత్ర. ఇయ్యాల ఇంత భయంకరమైన వర్షం పడుతున్నా ఒక్క చెరువు తెగలేదు. మిషన్‌ కాకతీయతో నిలువ సామర్థ్యం పెరిగి సుభిక్షంగా ఉన్నాయి. వాటి పుణ్యాన భూగర్భ జలాలు పెరిగాయి. ఆ చెరువులను ప్రాజెక్టులకు అనుసంధానం చేయిస్తున్నారు' అని వివరించారు.


అందరినీ ఆదుకున్నం

అన్ని కులాల్లో 75 ఏండ్లలో జరగని అభివృద్ధిని చేసి చూపించామని కేసీఆర్‌ తెలిపారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థ పరిపుష్ఠానికి అన్నిరకాల కులవృత్తులను ఆదుకున్నామన్నారు. దేశం మొత్తంలో కరోనా ఆర్థిక దుస్థితిలోనూ లాయర్లకు రూ.25 కోట్లు, ప్రైవేటు టీచర్లకు 25 కిలోల బియ్యం, రూ.2వేలు ఇచ్చి ఆదుకున్నామన్నారు. కరోనా ప్రభావం అన్నిరంగాలపై పడటం వల్ల ఆదాయం తగ్గిందని, దీనివల్ల నిధుల కోత తప్పలేదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నదని, మైనార్టీ సంక్షేమానికి కేటాయించిన నిధులు కూడా విడుదల చేస్తామని చెప్పారు. ముస్లింల ఆర్థిక, సామాజిక పరిస్థితులపై కమిటీలు ఇచ్చిన నివేదికలతో ఏకీభవిస్తామన్నారు. ఇతర సామాజిక వర్గాల్లోనూ పేదలు ఉన్నారని, దశలవారీగా దళితబంధు వంటి పథకాన్ని భవిష్యత్తులో బీసీలకు, మైనార్టీలకు, ఓసీలలో పేదలుంటే వారికి కూడా ఇస్తామని, సహనంతో వేచి ఉండాలన్నారు. ఈ వర్గాల్లో సంపన్నులుంటే వారికీ ఇస్తారా? అని అడుగుతున్నారని, ఈ పథకం కావాలా? వద్దా? అనేది ఆర్థిక పరిస్థితిని బట్టివారే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. హుజూరాబాద్‌లో సోటాల మోహన్‌, నర్సింహారావు దళితబంధు వద్దు.. అర్హులైన ఇతరులకు ఇవ్వాలని కోరారని తెలిపారు.


గొప్పగా బతుకుతమనే ధైర్యం రావాలి

రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఆత్మహత్యలు చేసుకొనే మానసిక దౌర్బల్యం పోగొట్టి, మేము కూడా గొప్పగా బతుకుతం అనే ధైర్యం తీసుకురావాలని నిర్ణయించుకున్నట్టు సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఈ క్రమంలోనే '200 ఉన్న పింఛన్‌ను వెయ్యికి.. అక్కడినుంచి రెండువేలకు తీసుకొని పోయాం. మూడొందలున్న వికలాంగుల పింఛన్‌ను రూ.3 వేలకు తీస్కుపోయినం. చేనేత కార్మికుల కోసం ఉపశమన చర్యలు చేపట్టినం. రేషన్‌ బియ్యాన్ని మనిషికి 4 నుంచి 6 కిలోలు చేసినం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికీ ఇస్తున్నం. ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి రూపంలో సహాయం ఇస్తున్నం' అని వివరించారు.

Share it:

Post A Comment: