CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అడవి నుండి అమ్మ(ల)కు లేఖ

Share it:

 


మల్లోజుల వేణుగోపాల్

కేంద్రకమిటీ సభ్యుడు, సీపీఐ (మావోయిస్టు)

మన్యం మనుగడ డెస్క్:

పత్రికా సంపాదకులకు వందనాలు. మీరు పోలీసుల స్టేట్ మెంటును ప్రచురించి విషయాన్ని వెలుగులోకి తెచ్చినందుకు ధన్యవాదాలు. నేను లొంగిపోవాలనీ మా అమ్మతో రామగుండం సీఎస్ సత్యనారాయణ గారు చేసిన ప్రతిపాదనను నేను నిర్ద్వందంగా ఖండిస్తున్నాను. నా ఈ ఖండన స్టేట్ మెంటును దయచేసి తప్పక ప్రచురిస్తారనీ మనవి. తద్వార నా ఆరోగ్య విషయం కూడ మా అమ్మకు తెలుస్తుంది.


అమ్మా ఎలా ఉన్నావమ్మా? 95యేళ్ల వయస్సులో ముఖానికి మాస్క్ తో వీడియోలో నిన్ను చూసి మా అమ్మ ఆరోగ్యంగా ఉందనీ నా మనసు చాలా తేలికైంది. నీకు ఎడమ వైపు కాషాయ వస్త్రంతో ఒకరు, నీ ఎదురుగా ఖాకీ దుస్తుల్లో పోలీసాయన మధ్యలో ఎరుపు చీరలో ఉన్న నిన్ను పదే పదే చూడాలనిపించేలా ఉన్నావమ్మా. ఆ వీడియో నా దగ్గర భద్రంగా పెట్టుకున్నాను. నీ గురించి రాసిన విలేకర్లకు, టీవీ వాళ్లకు ప్రత్యేక వందనాలు. నిన్ను ఈ సందర్భంగా ముందుకు తెచ్చిన రామగుండం సీ.ఎస్. సత్యనారాయణ గారికి ముందు థాంక్స్ చెప్పాలి.


సరే, అయన నా వయసు కూడ చెపుతూ బాపు గురించి పరిచయం చేస్తూ నేను లొంగిపోతే నాకు మెరుగైన క‌రోనా వైద్యం చేయిస్తామంటూ మాట్లాడడంపై తరువాత రాస్తాను. ఇప్పటికైతే నేను పర్ఫెక్ట్ గా ఆరోగ్యంగా ఉన్నాను. నో కొరోనా నథింగ్. నేనే కాదు నీ కోడళ్లు సహ నీకు తెలిసిన మా కామ్రేడ్స్ సత్యనారాయణ రెడ్డి, రాంచంద్రరెడ్డి, మల్లా రాజిరెడ్డి, తిరుపతి మిగితా ఎవరికీ ఇప్పటికింకా కొరోనా సోకలేదు. అంతా బాగున్నారు. ఇదే మాట మా పార్టీ అధికార ప్రతినిధి అభయ్ జూన్ మధ్యలో ఒక ప్రకటనలో తెలిపాడు. అప్పటి వరకు మా ప్రియ యువ సహచరుడు, కేంద్ర కమిటీ సభ్యుడు యాప నారాయణ, మా జనతన సర్కార్ స్కూల్లో ఉపాధ్యాయిని కామ్రేడ్ సిద్ధబోయిన సారక్క (భారతక్క) కొరోనాతో అమరులు కాలేదు. వారు చిరస్మరణీయులు. వారికి విప్లవ జోహార్లు. మరి 15 మందికి కొరోనా పాజిటివ్ తేలినట్లు డాక్టర్లు పరీక్షించి చెప్పారు. వారు ఐసోలేషన్లో ఉండి చికిత్స పొంది బాగయ్యారు.


అమ్మా, జూలై 1 జాతీయ వైద్యుల దినం పాటించారు. ఈ సందర్భంగా మనం భారత ప్రజలను కొరోనా మహమ్మారీ నుండి కాపాడడానికి అహర్నిషలు శాయశక్తులా కృషి చేస్తూ ఆ కొరోనా మహమ్మారీతోనే దేశంలో మే మధ్య నాటికి ʹభారతీయ వైద్యుల ఫెడరేషన్ ప్రకారం అసువులు బాసిన దాదాపు 1,150 మంది వైద్యులకూ (ఫ్రంట్ వారియర్స్) మనం జోహర్లు చెపుదాం. వారి సేవలు విస్మరణీయం. ఆదర్శం. అలాగే, ఈ రోజుతో దేశంలో అధికారిక లెక్కల ప్రకారం కొరోనా మరణాల సంఖ్య 4 లక్షలు దాటింది. (లెక్కల అవకతవకల గురించి, అనేక మరణాలు వెల్లడించడం లేదనీ పత్రికలు అనేక వార్తలు రాస్తున్నాయి). వారందరినీ సామ్రాజ్యవాదుల లాభాపేక్షే బలి తీసుకుంది.


ఆ సామ్రాజ్యవాదం బతికి ఉన్నంతవరకు ప్రకృతిని, పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ ఇలాంటి వైరస్లను పుట్టిస్తునే ఉంటారు. ఇపుడు వారి మధ్య లొల్లంతా ఆ వైరస్ చైనాలో పుట్టిందా, అమెరికాలో పుట్టిందా అనేదే తప్ప దానికి శాశ్వత నివారణోపాయాలే లేవమ్మా. అందుకే నేను లొంగిపోవడం కాదు, ఆ పోలీసాయనకు నిజంగానే కొరోనా నుండి ప్రజలను, మమ్మల్ని కాపాడాలనే చిత్తశుద్ధి ఉంటే మాతో కలిసి సామ్రాజ్యవాద నిర్మూలన పోరాటానికి నడుం బిగించాలని విజ్ఞప్తి చేస్తున్నానమ్మా. అయన కాసేపు ఖాకీ దుస్తులు తొలగించి అలోచించాలని మరీ అప్పీల్ చేస్తున్న.


అమ్మా, మొదటి విడుత కొరోనా సందర్భంగా నిరుడు మా ఉద్యమ ప్రాంతాల ఆదివాసీ ప్రజలంతా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఊళ్లన్నీ క‌రోనా ప్రవర్తనా నియమావళిని అక్షరాలా పాటించాయి. ఆ సందర్భంగా వారు తమ మధ్యకు గస్తీ పేరుతో వచ్చే పోలీసులు కొరోనా వాహకుల పాత్ర పోషించకూడదనీ, వారు గస్తీ ఆపుకోవాలని పదే పదే విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. అప్పటికి పోలీసులకు పెద్దేఎత్తున కొరోనా వ్యాపిస్తుండింది. కొరోనాతో పోలీసుల మరణాలలో మహారాష్ట్ర అగ్రభాగాన నిలిచిన విషయం జగమొగినదే.


ఇక ఈ సంవత్సరం విజృంభించిన రెండవ విడుత కొరోనాను ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వాలు లక్షలాది ప్రజల జీవితాలతో చెలగాటమాడాయి. మొదటి విడుత అనుభవం నుండి గుణపాఠం తీసుకున్న పోలీసులు పాలకుల వైఫల్యాలను విప్పిచెప్పడం పక్కన పెట్టి (వారి రక్షకులు వీరే కదా!) ʹఉల్టా చోర్ కొత్వాల్ కో డాఁటాʹ అన్నట్టు మా లొంగుబాటుపై పనికిమాలిన కసరత్తులు చేస్తున్నారు. సమస్యలను చూసి బెదిరిపోయి లొంగిపోయేవాళ్లు విప్లవకారులు కారమ్మా. వారు సమస్యల ముందు లొంగి పోకుండా, పారిపోకుండా ఓపికగా వాటికి సమాధానాలు శోధిస్తారు. వాటి నివారణకు దివారాత్రులు విరామమెరుగని కృషి చేస్తారు.


కానీ, ʹవేతన బానిసʹలైన ఖాకీలకు ఈ విషయం బోధపడదు. పిడుక్కీ బియ్యానికి ఒకే మంత్రం అన్నట్టు పోలీసులంతా ఈసారి ముందు జాగ్రత్తగా కొరోనా తీవ్రత అంటూ ఎంత సేపూ మమ్మల్ని లొంగి పొమ్మనడమే తప్ప కొరోనా వ్యాప్తికి పాలకుల విధానాలే కారణమనే సత్యాన్ని ప్రజలకు చెప్పే ధైర్యం చేయడం లేదమ్మా. ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఎవరితోనైనా కలిసి పనిచేద్దామనే వివేచనే వారికి తోచదు. ఎంతైనా వారు వేతన బానిసలే కదమ్మా. ఈ విషయంలో నిరుడు మా ఆంధ్ర-ఒడిశా సరిహద్దు కమిటీ కామ్రేడ్స్ ఏకపక్ష కాల్పుల విరమణకు కూడా పిలుపిచ్చారు. దానిపై పోలీసులు మౌనం వహించారు తప్ప జవాబు లేదు. పైగా ఈ సంవత్సరం జూన్లో అక్కడ కొరోనా వైద్యానికి వెళ్లిన మా డాక్టర్ కామ్రేడ్ సందే గంగన్న సహ అరుగురు గెరిల్లాలను పోలీసులు కాల్చి చంపారు. గంగన్న మన దగ్గరి వాడే, వాళ్లది ఓదెల. కొరోనా లేనపుడు వేరే ఏదో సాకుతో నిరంతరం పోలీసులు మిమ్మల్ని కౌన్సిలింగులు చేయడం, మమ్మల్ని లొంగిపోవాలనడం దశాబ్దాలుగా చూస్తున్నదే కదమ్మా. నిజమైన విప్లవకారులెవరినీ కొరోనాలు, ఖాకీలు, బెదరింపులు, ప్రలోభాలు లొంగతీసుకో లేవమ్మా. అలా చేస్తే దేశ ద్రోహము, ప్రజా ద్రోహమవుతుందమ్మా.


అమ్మా, ఈ రోజు కమిషనర్ గారు బాపు స్వాతంత్ర్య సమరయోధుడంటూ, నీకు అయన మరణానంతర పెన్షన్ దొరుకుతుందంటూ మర్యాదగానే మాట్లాడుతున్నాడు. కానీ, అర్ధరాత్రి మన ఇంటి తలుపులు బాది బాపును బయటకు తీసుకెళ్లి స్వాతంత్ర్య సమర యోధుడంటూ కాకపోయినా కనీసం ఒక సీనియర్ సిటిజన్‌గానైనా పరిగణించకుండా బాపును మా కోసం ఎన్ని బండ బూతులు తిట్టారమ్మా ఈయనకు ముందరి అధికారులు! చివరి వరకు బాపు ఆ మాటలను, అవమానాన్ని మరువలేకపోయాడు. మన ఇళ్లు కూల్చిన మహానుభావులు వీళ్లే కదమ్మా. ఈ రోజు ఎంత వినమ్రత!? ఆ ఖాకీ దుర్మార్గం గుర్తొస్తే నీ మనసు ఎంత బాధపడుతుందో నేనూహించుకోగలనమ్మా. బ్రాహ్మణవాదం అందితే జుట్టు లేకపోతే కాళ్లు పట్టుకునే కౌటిల్యం నిండినదమ్మా. దానితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి సుమా!


సత్యనారాయణ గారు, అన్ని రాష్ట్రాలలోని మీ పోలీసులు మమ్మల్ని పదే పదే లొంగిపోవాలనీ కోరుతున్నారు. మేము ఉండడం ద్వారా మీ పాలకుల దోపిడీ ఆటలు అనుకున్నట్టు సాగడం లేదు. వారి ఆర్థిక, రాజకీయ సంక్షోభం దినదినం తీవ్రమవుతోంది. అందుకే మేముండకూడదు. మీరు కొన్ని నిజాలు వెల్లడిస్తారా సార్! ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమైనా కొరోనా నివారణకు పూర్తి నమ్మకమైన చికిత్సను కనిపెట్టిందా, వైరల్ జబ్బులకు మీ వద్ద ఏం చికిత్స ఉంది? ఉంటే ఈ లక్షలాది మరణాలెందుకు చోటు చేసుకుంటున్నాయి.


మీ హిపోక్రట్ మోదీ మొదట వ్యాక్సిన్ వ్యాపారానికి, దౌత్యానికి దిగాడు. కార్పొరేటు వర్గాలను కుబేరులను చేయడానికి పూనుకున్నాడు. కానీ,డామిట్ కథ అడ్డం తిరిగింది. బెంగాల్, కేరళ విధానసభల ఎన్నికలలో యూపీ పంచాయతీ ఎన్నికలలో పొందిన ఘోర ఓటమితో ఆయన నాలుక కరుచుకొని ఉచిత టీకాలన్నాడు. 18 సంవత్సరాలు పైబడిన వారందరికి డిసెంబర్ లోగా టీకాలు వేయిస్తామంటున్నారు. ఇది సాధ్యమా! మన దేశంలో అందుకు కావలసిన 216 కోట్ల వ్యాక్సిన్

డోసులున్నాయా! దీనిపై భారత ఖాకీ భాయిల జవాబేంటో! లొంగుబాటు గీతం ఆపి ఇలాంటివి అలోచిస్తే బుద్ధిమంతులవుతారు. మన దేశంలోని సీరం ఇన్స్టిట్యూట్ వారి కోవ్యాక్సిన్ 55 కోట్ల డోస్ లు, కోవీషీల్డ్ వారు 75 కోట్ల డోస్ లు, బయో ఈ-సబ్ కమిటీ వారి వాక్సిన్ 30 కోట్ల డోలు, నోవ్యాక్సి 20 కోట్ల డోన్లు, భారత్ బయో టెక్ నాజల్ వ్యాక్సిన్ వారు 10 కోట్లు, జినోవా వాక్సిన్ 6 కోట్లు, జైడెస్డై కిలా వారు 5 కోట్లు, రష్యా వారి స్పుతినిక్ 15 కోట్లు కావాలంటూ ఆర్డర్ పెట్టారు. వీటిలో ఐదు రకాల వ్యాక్సిన్లు ఇంకా తయారీ దశలోనే ఉన్నాయి సార్.


సత్యనారాయణ గారు, ఒక వ్యాక్సిన్ తయారీకి కనీసం ఎంత కాలం పడుతుందో తెలుసా మీకు? ఈ ఫజిల్ మీకెందుకు లెండి. ప్రపంచంలో ఇప్పటికీ 3-4 రకాల వ్యాక్సిన్లో తయారు చేస్తున్నారు. దేని ఫార్ములా దానిదే. వ్యాక్సిన్లో ప్రధానమైనది అంటీజెన్ అనేది మాత్రం పోలీస్ కమిషనర్ గారికి తెలునుకుంటా! అది పరీక్షించబడి విడుదలయ్యే సరికి నెల నుండి మూడు

నెలల కాలం పడుతోందండి. ఇలాంటి పరిస్థితులలో లొంగుబాటు పాట కాసేపు వదిలి కొరోనా నిరోధానికి ఏం చేయాలో, మరీ భయంకరం అంటూ హడలెత్తిస్తున్న మూడవ వేవ్ ను అరికట్టడం ఎలా అనేది ఆలోచించండి సార్. లేకపోతే, మన తెలంగాణ పల్లెల్లో (మీది ఏ ప్రాంతమో మరి!) ʹఊరంతా ఊరు ముఖమైతే దాసరయ్య తాళ్ల ముఖం అన్నట్టుʹ జనాలు మిమ్మల్ని చూసి వెక్కిరిస్తారు.


మోదీ గారి అందరికి వ్యాక్సిన్ స్వప్నం నిజం కావాలంటే రోజుకు 50 లక్షల టీకా డోసులు వేయాల్సి ఉంటుంది. కానీ సారూ, మేలో మన దేశంలో సగటునా టీకా వేసిందెంతండి? 15.2 లక్షలే సార్, అది జూన్ నాటికి 27 లక్షలకు చేరింది. దాన్ని పెంచగలిగితే సంతోషిద్దాం . కానీ, ఈ నత్త నడకనే టీకా కార్యక్రమం నడిస్తే మాత్రం 140 కోట్ల భారతీయులకు రెండు విడుతల టీకా డోసు పూర్తయ్యేవరకు రెండున్నరేళ్లు పడుతుంది సార్. అప్పటికి డెల్టా ప్లస్ వేరియంట్ ఏ రూపం తీసుకుంటుందో ఎవరు చెప్పగలరు


సార్! ఇప్పటికే అది డెల్టా, కప్పా మొదలగు అనేక అవతారాలెత్తింది. విష్ణుమూర్తి దశవతారాలతో చాలించుకున్నాడు కానీ, మహమ్మారీ కొరోనా సామ్రాజ్యవాదం అంతం వరకు ఎన్ని అవతారాలెత్తుతుందో! కాబట్టి మాపై పారని మీ లొంగుబాటు మంత్రాలు వదిలి ఈ విషయాలు ఆలోచించండి. కనీసం మీ బంధు మితృలనైనా కాపాడుకోగలుగుతారు. మోదీ మంత్రాలకు చప్పట్లు కొట్టడం, కొవ్వొత్తులు వెలిగించడం లాంటి మంత్రాలు కొరోనాపై ఎంత పనిచేశాయి కమిషనర్ గారూ!


అమ్మా, మాకు కొరోనా ఏదో 500 మందితో మేం మీటింగ్ చేస్తే సోకిందనీ గోదీ మీడియా జోష్యం చెపుతుందమ్మా. 500 కాదు ఇక్కడ మే 12నుండి జూన్ 8నాటి వరకు లక్షకు చేరిన జన సంద్రంతో నూతన పోలీసు క్యాంపు వ్యతిరేక ప్రజా ధర్నా జరుగుతోంది. నిన్నగాక మొన్న జూన్ 28 నాడు 50 వేల మందికి పైగా జనంతో దక్షిణ బస్తర్ లోని సార్కెగూడాలో ప్రజా అమరుల 9వ సంస్మరణ సభ జరిగింది. ఇన్ని సభలలో ఏ ఒక్కరూ కొరోనా బారిన పడలేదమ్మా. కాకపోతే, సార్కె కూడా సభ వద్ద పాము కాటుకు గురై కుందేడ్ గ్రామ నివాసి ఉయిక పొదియా అనే ఒక అదివాసీ రైతు మరణించడం విచారకరం. ఈయన మరణాన్ని కూడ పోలీసు ʹప్రవక్తʹ (అధికార ప్రతినిధి) కొరోనా మరణంగానే ప్రకటించాడు. ఎక్కడ ఏ మావోయిస్టు పోలీసులకు చిక్కినా, లొంగిపోయినా, తుదకు ఎన్ కౌంటర్లో మరణించినా వారిలో పోలీసులు (డాక్టర్లు కాదు) కొరోనాను కనుగొంటున్నారు. గోదీ మీడియాకు వాస్తవాలతో నిమిత్తం ఉండదు.


అయితే, ప్రజలకు ప్రత్యామ్నాయ మీడియాకు చెందిన పాత్రికేయులు సహ చాలా మంది కొరోనా ప్రవర్తనా నియమావళి పాటించాలని చెపుతున్నారు. వారిలో ఆ స్పృహ ఉన్నవాళ్లు పాటిస్తున్నారు కూడా! వాళ్లకు ఈ రోజు కొరోనా కన్నా ఖాకీల బెదదే తీవ్ర ప్రమాదకరంగా మారిందమ్మా.


అమ్మా, నీవు నిశ్చింతగా ఉండమ్మా. మేం అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాం. మేమే కాదమ్మా, మా ప్రాంతాల ప్రజల ప్రాణాలను కాపాడడానికి మేం అన్ని చర్యలు చేపడుతున్నామమ్మా. మీరంతా పాటించాలమ్మా. ఈ జూలై మాసం మొత్తం మా పీఎల్ జీఏ, పార్టీ కార్యకర్తలు, విప్లవ ప్రజా సంఘాలు, జనతన సర్కార్లు కలసికట్టుగా ʹకొరోనా ప్రవర్తనా నియమావళి అమలు, టీకాకరణ చేసుకోవాలిʹ పై దండకారణ్యం లోని గ్రామ గ్రామాన ప్రచార కేంపెయిన్ చేపట్టాయమ్మా. కానీ, ఖాకీలు మాత్రం రోడ్లపై మనుషులు అగుపడితే పాపం, జనాలను చితకబాదారు. దండగలు వసూలు చేశారు. వారి సమస్య ఏంటో తెలుసుకునే కనీస ఇంగిత జ్ఞానం కూడ వారికి లేకుండా పోయింది. అలాంటి దుష్ట చర్యలు, దుర్మార్గ పనులు వదిలి ప్రజలను శిక్షితులను చేయడానికి మాతో వారు పోటీ పడితే మంచిది. కానీ, జీతం రాళ్ల కోసం పని చేసే వారికి నిస్వార్థ ప్రజాసేవ తలకెక్కదమ్మా.


అమ్మా, దండకారణ్యం మలేరియాలాంటి విష జ్వరాలకు కేంద్రం. దానికి తోడు దక్షిణ బస్తర్ లో వేసవిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుంది. మనుషులకు సంక్రమించే జబ్బులలో 90 శాతం కాలుష్యమయ నీటి నుండే అంటారు వైద్యులు. ఫలితంగా అక్కడ టైఫాయిడ్ ప్రమాదమూ ఎక్కువే. వాటితో ఈ వేసవిలో మా కామ్రేడ్ ఒకరు మరణించారు. మేం సాధారణంగా కాచి వడబోసిన నీళ్లే తాగుతాం. అందుబాటులో ఉన్న అన్ని జాగ్రత్తలు పాటిస్తాం. రోగం రాకముందే కట్టడి చేయడం మంచిదనే కదా పెద్దలు చెప్పేది.


అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన వైద్యం తీసుకోవడానికి ఖమ్మం, వరంగల్ పట్టణాలకు వెళ్లిన మా ప్లాటూన్ కమాండర్ గంగాలును, కమ్యూనికేషన్ బాధ్యుడు గడ్డం మధుకర్ ను పట్టుకొని వారికి లేని కొరోనాను వారికెక్కించి హత్య చేసిందెవరో మీరు చెప్పగలరా సత్యనారాయణ గారు! కనీసం గడ్డం మధూకర్ తండ్రి గడ్డం బాపుగారు కొడుకును చూడడానికి హైదరాబాదు ఆసుపత్రికి చేరుకుంటే ఆ ముసలి తండ్రికి తన కన్న కొడుకును కడసారి చూపుకైనా కరుణించని పాషాణ హృదయులు మీరు. మీరు మాకు చికిత్స చేయిస్తారా! మేం మీకు లొంగిపోవాలా! లోకం నవ్వుతుంది సార్. మరోసారి మీకు చెపుతున్నా సార్, Letus fight unitedly against Corona and its creators Imperialists. Are you ready Sir ?

Share it:

TELANGANA

Post A Comment: