CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఖమ్మం విజయాల గుమ్మం కావాలి

Share it:

 


కలిసి కట్టుగా పనిచేయండి

ఖమ్మం నేతలతో కేటీఆర్ 


హైదరాబాద్‌: దేశంలో జమిలి ఎన్నికలపై ప్రచారం జరుగుతోందని, అవి ఎప్పుడు జరిగినా ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సూచించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని పది స్థానాల గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఖమ్మం-వరంగల్‌-నల్గొండ పట్టభద్ర ఎమ్మెల్సీతో పాటు ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల్లో పార్టీ విజయఢంకా మోగించాలన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో గురువారం ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల సీజన్‌ నడుస్తోంది. ఎమ్మెల్సీ, నగరపాలక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలు తేవాలనుకుంటోంది. ఏ ఎన్నికలనైనా ఆషామాషీగా తీసుకోవద్దు. ప్రతీ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పనిచేయాలి. రాష్ట్రవ్యాప్తంగా 2014, 2018 ఎన్నికల్లో తెరాస అద్భుత ఫలితాలు సాధించినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిరాశజనకమైన పరిస్థితులు కనిపించాయి. వచ్చే శాసనసభ ఎన్నికల్లో అన్ని స్థానాలూ గెలవాలి. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఒక్క సంక్షేమ పథకమూ అమలు చేయకుండా హడావిడి చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పథకాలను అమలు చేస్తున్న పార్టీగా మనం చేసింది చెప్పాలి. పట్టభద్ర ఓటర్లందర్నీ కలిసి ప్రభుత్వం సాధించిన ప్రగతిని తెలియజేయాలి. తెలంగాణ ఏర్పడకముందు, ఏర్పడ్డాక జరిగిన ఉద్యోగ నియామకాలపైనా వివరించాలి. ప్రభుత్వ శాఖలతో పాటు సింగరేణి, విద్యుత్‌ సంస్థల్లో జరిగిన ఉద్యోగ నియామకాల గురించి చెప్పాలి. హోంగార్డులు, అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలు, ఇతర ఒప్పంద, వేతన ఉద్యోగులకు భారీఎత్తున వేతనాలను పెంచిన విషయాన్నీ వివరించాలి. ప్రచారంలో సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకోవాలి. కొందరు ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలని సూచించారు. నాయకుల మధ్య విభేదాలు తగవని హితవు పలికారు. పదవులు వస్తూపోతూ ఉంటాయి. పార్టీ ఎప్పుడూ ఉంటుంది. జిల్లా మంత్రి ఎమ్మెల్యేలందరినీ కలుపుకొనిపోతూ సమన్వయంతో పనిచేయాలి. కష్టపడిన నేతలను పార్టీ గుర్తిస్తుంది. ఓడిపోయిన వారు నిరాశచెందవద్దు. వారి బాధ్యత నేను తీసుకుంటా. ఈ నెల 30 వరకు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలి’’ అని కేటీఆర్‌ సూచించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా అభివృద్ధి, నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా జరిగిన పనులు, లబ్ధిదారుల జాబితాను ఆయన నేతలకు అందజేశారు. తెరాస ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఐటీ తదితర రంగాల్లో ఉద్యోగాల వివరాల నివేదికనూ వారికి ఇచ్చారు. సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, పార్టీ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీ కవిత, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. సమావేశానికి ముందు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేటీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయి కొద్దిసేపు మాట్లాడి వెళ్లిపోయారు.

Share it:

TELANGANA

Post A Comment: