CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రామగుండం-3లో 15 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ అనుసంధానం

Share it:రామగుండం-3లో 15 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ అనుసంధానం

దీనితో 55 మెగావాట్లకు చేరిన సింగరేణి సోలార్‌ పవర్‌

డిసెంబర్‌ నాటికి మొదటిదశ 130 మెగావాట్లు పూర్తి

అభినందనలు తెలిపిన సి&ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌


సి&ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌ ప్రత్యేక చొరవతో సింగరేణి సంస్థ వివిధ ఏరియాల్లో సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణాలను పూర్తిచేస్తూ దశల వారీగా గ్రిడ్‌ కు అనుసంధానం చేస్తూ ముందుకుపోతోంది. తాజాగా రామగుండం-3 ఏరియాలో నిర్మిస్తున్న 50 మెగావాట్ల సోలార్‌ ప్లాంటులో 15 మెగావాట్ల విభాగం నుండి సోలార్‌ విద్యుత్‌ ఉత్పాదనను శుక్రవారం (నవంబర్‌ 27వ తేదీ) ప్రారంభించారు. సింగరేణి డైరెక్టర్‌ (ఇ&ఎం) శ్రీ డి.సత్యనారాయణరావు స్విచ్‌ ఆన్‌ చేసి 15 మెగావాట్ల విద్యుత్తును 132 కె.వి. సబ్‌ స్టేషన్‌ కు అనుసంధానం చేశారు. 15 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ అనుసంధానంపై సంస్థ ఛైర్మన్‌ & ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌ తన అభినందనలు తెలియజేశారు.


తొలిదశలో 129 మెగావాట్ల నిర్మాణాలను మణుగూరు, ఇల్లందు, రామగుండం-3, సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలలో చేపట్టడం జరిగింది. వీటిలో సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో గల 10 మెగావాట్ల ప్లాంటులను గత ఫిబ్రవరి నెల 10వ తేదీన ప్రారంభించారు. మణుగూరులోని 30 మెగావాట్ల ప్లాంటులను గత జూలై నెల 30వ తేదీన ప్రారంభించారు. రామగుండం-3లో 50 మెగావాట్ల ప్లాంటుల నిర్మాణం పూర్తవుతుండగా దీనిలో శుక్రవారం నాడు 15 మెగావాట్ల విభాగాన్ని గ్రిడ్‌ కు అనుసంధానం చేశారు. దీంతో ఇప్పటివరకూ 55 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ను సింగరేణి సంస్థ గ్రిడ్‌ కు అనుసంధానం చేయడం జరిగింది.


రామగుండం-3 సోలార్‌ విద్యుత్‌ కేంద్రంలోని మిగిలిన 35 మెగావాట్ల సోలార్‌ విభాగాన్ని, అలాగే ఇల్లందు లో దాదాపుగా నిర్మాణం చివరి దశకు చేరిన 39 మెగావాట్ల ప్లాంటులను ఈ డిసెంబర్‌ చివరినాటికి ప్రారంభించాలని, అలాగే రెండవ దశలోని 90 మెగావాట్ల ప్లాంటులు, మూడవ దశలోని 81 మెగావాట్ల ప్లాంటులకు కాంట్రాక్టులను ఇప్పటికే అప్పగించినందున ఈ సోలార్‌ ప్లాంటుల నిర్మాణం డిసెంబర్‌ 2021 నాటికి పూర్తి చేసి విద్యుత్‌ ఉత్పాదన ప్రారంభించాలని సి&ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌ ఈ సందర్భంగా సంబంధిత అధికారులను ఆదేశించారు.


రామగుండం-3 సోలార్‌ ప్లాంటులో 15 మెగావాట్ల అనుసంధానం సందర్భంగా డైరెక్టర్‌ (ఇ&ఎం) శ్రీ డి.సత్యనారాయణరావు మాట్లాడుతూ సి&ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌ తీసుకొన్న ప్రత్యేక చొరవతో సింగరేణిలో మూడు దశల్లో మొత్తం 300 మెగావాట్ల సోలార్‌ ప్లాంటుల నిర్మాణానికి ప్రణాళికలు వేగవంతంగా అమలవుతున్నాయని వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఏరియా జి.ఎం. శ్రీ కె.సూర్యనారాయణ, అడ్రియాల జి.ఎం. శ్రీ ఎన్‌.వి.కె.శ్రీనివాసరావు, సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఇ.డి. శ్రీ సంజయ్‌ కుమార్‌ సూర్‌, సోలార్‌ జి.ఎం. శ్రీ డి.వి.ఎస్‌.ఎన్‌.రాజు, సోలార్‌ కన్సల్టెంట్‌ శ్రీ మురళీధరన్‌, ఎస్‌.ఇ. శ్రీ సి.హెచ్‌.ప్రభాకర్‌, ఎస్‌.ఇ. ట్రాన్స్‌ కో కరీంనగర్‌ శ్రీ శ్రీనివాస్‌, బి.హెచ్‌.ఇ.ఎల్‌. ప్రతినిధి శ్రీ సుభాష్‌ ధన్వాల్కర్, టి.బి.జి.కె.ఎస్‌. జనరల్‌ సెక్రటరీ శ్రీ మిర్యాల రాజిరెడ్డి, ఏరియా ఇంజనీర్‌ శ్రీ రామలింగం, రీజనల్‌ సోలార్‌ ఇంజనీర్‌ శ్రీ శ్రీనివాస్‌ ఇంకా ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


రామగుండం-3 ప్లాంటుల వలన ఏటా 17 కోట్ల రూపాయల ఆదా


రామగుండం-3 ఏరియాలో నిర్మిస్తున్న 50 మెగావాట్ల ప్లాంటులు పూర్తయితే సింగరేణికి ఏటా 17 కోట్ల రూపాయాల విద్యుత్‌ ఖర్చులు ఆదా కానున్నాయి. రామగుండం-3 ఏరియా తన గనుల అవసరాలకు, అలాగే కాలనీ అవసరాలకు ఏటా 220 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును రాష్ట్ర ట్రాన్స్‌ కో ద్వారా కొనుగోలు చేస్తోంది. కాగా ఇక్కడ సింగరేణి నిర్మిస్తున్న 50 మెగావాట్ల సోలార్‌ ప్లాంటులు పూర్తిస్థాయిలో ప్రారంభమయితే 85 మిలియను యూనిట్ల సోలార్‌ విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. కనుక రాష్ట్ర ట్రాన్స్‌ కో నుండి ఈ మేరకు విద్యుత్‌ ను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. తద్వారా ఏటా 17 కోట్ల రూపాయాలను ఆదా చేయగులుగుతుంది. ట్రాన్స్‌ కో ద్వారా కొనుగోలు చేస్తున్న విద్యుత్‌ కు ఒక యూనిట్‌ కి 5.65 రూపాయలు కంపెనీ చెల్లిస్తుండగా, సింగరేణి ఉత్పత్తి చేస్తున్న సోలార్‌ విద్యుత్‌ కు ఒక యూనిట్‌ కు 3.54 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ విధంగా చూస్తే సింగరేణి సోలార్‌ పవర్‌ వ్యయం చాలా తక్కువ కనుక ఏటా 17 కోట్ల రూపాయల వరకూ కంపెనీకి ఆదా చేకూరనుంది.


ఇప్పటికే సింగరేణి సోలార్‌ ద్వారా ఏడాదికి 297 లక్షల రూపాయలు ఆదా


తొలిదశలో పూర్తయి, విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న ఎస్‌.టి.పి.పి. సోలార్‌ ప్లాంటు, మణుగూరు ప్లాంటు ద్వారా సింగరేణి సంస్థ ఇప్పటికే ఏడాదికి 297 లక్షల రూపాయలు ఆదా చేయగలిగింది. సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో గల 10 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంటు ద్వారా గత ఫిబ్రవరి నెల నుండి ఇప్పటివరకూ 8.24 మిలియను యూనిట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కాగా మణుగూరులోని 30 మెగావాట్ల సోలార్‌ ప్లాంటు ద్వారా గత జూలై నెల నుండి ఇప్పటి వరకూ 6.02 మిలియను యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడం జరిగింది. ఈ సోలార్‌ విద్యుత్తును సింగరేణి తన అవసరాలకు వాడుకున్నందున ఆ మేరకు రాష్ట్ర విద్యుత శాఖ నుండి విద్యుత్‌ కొనుగోలును తగ్గించుకుంది. తద్వారా 297 లక్షల రూపాయలను ఆదా చేయగలిగింది. ప్రస్తుతం సింగరేణి ఏడాదికి 700 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ను ట్రాన్స్‌ కో ద్వారా కొంటోంది. సింగరేణిలో మూడు దశలోని 300 మెగావాట్ల సోలార్‌ ప్లాంటులు పూర్తయితే ఏడాదికి 500 మిలియన్‌ యూనిట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. ఈ మేరకు సింగరేణి కేవలం 200 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ను మాత్రమే ట్రాన్స్‌ కో నుండి కొనుగోలు చేయాల్సి వస్తుంది. ప్రస్తుత విద్యుత్‌ చార్జీతో పోలిస్తే సింగరేణి ఏడాదికి దాదాపు 120 కోట్ల రూపాయల వరకూ ఆదా చేసుకోగలుగుతుందని అంచనా.


చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్


తేదీ : 27-11-2020

Share it:

TELANGANA

Post A Comment: