CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సమీపిస్తున్న గుజరాత్ ఎన్నికలు

Share it: గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రెండు దశల్లో ఇక్కడ పోలింగ్ జరగనుంది. విజయమే లక్ష్యంగా అధికార బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది.    పంజాబ్ లో గెలిచిన ఉత్సాహంతో ఆమ్ ఆద్మీ పార్టీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. దశాబ్దాల పాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ ఈసారైనా గుజరాత్ లో పాగా వేయాలని పావులు కదుపుతున్నది. ఉత్తరాది అంటేనే కులాలు, రకరకాల సమీకరణాలు కాబట్టి.. ఈసారి కూడా అన్ని పార్టీలు ఆయా కులాలపై దృష్టి సారించాయి. అన్నిటికంటే ముఖ్యంగా మైనార్టీ ఓట్ల కోసం గట్టి పోటీ నెలకొంది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ, అసదుద్దీన్ ఓవైసీ సారధ్యంలోని ఎంఐఎం, కొన్ని చిన్నాచిత పార్టీలు ముస్లిం ఓట్ల పై దృష్టి సారించాయి. అయితే ఈ ఓట్లన్నీ తమకే గంపగుత్తగా పడతాయని బిజెపి భావిస్తుండగా.. మైనార్టీ ఓట్లు చీలితే మళ్ళీ బిజెపికి లబ్ధి చేకూరుతుందని కాంగ్రెస్ కలవరపడుతున్నది. 

గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కటి మాత్రమే బిజెపికి ప్రధాన పోటీదారుగా ఉండేది. ముస్లిం ఓట్లు కూడా కాంగ్రెస్ కే అధికంగా వచ్చేవి. కానీ ఈసారి ఆమ్ ఆద్మీ, ఎంఐఎం పోటీలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది.    ముస్లింలు ఎంత శాతం అంటే    గుజరాత్ జనాభా ఆరున్నర కోట్లు. ముస్లింల జనాభా 11%.. మొత్తం 182 నియోజకవర్గాలలో 25 చోట్ల పారి ప్రాబల్యం అధికంగా ఉంటుంది. వారి ఓట్లపై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మహమ్మద్ పిర్జాదాను నియమించింది. అయితే ఎంఐఎం కూడా 30 స్థానాల్లో పోటీ చేస్తుందని అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించడంతో ముస్లింలను ఆకట్టుకునేందుకు పిసిసి అధ్యక్షుడు జగదీష్ ఠాకూర్ దేశ వనరుల్లో ప్రథమ వాటా ముస్లింలకే చెందాలని ప్రకటించాడు. 2006లో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఇలాంటి ప్రకటన చేయడంతో కలకలం చెలరేగింది. దీనికి తోడు ఆమ్ ఆద్మీ పార్టీ చాప కింద నీరులా విస్తరించుకుంటూ పోతున్న నేపథ్యంలో ముస్లిం ఓట్లలో చీలిక వస్తుందని కాంగ్రెస్ కలవర పడుతోంది. ఇక ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ముస్లిం ప్రాబల్య ప్రాంతమైన దరియాపూర్ లో రోడ్ షో నిర్వహించారు. 

ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ముగ్గురు ముస్లింలను అభ్యర్థులుగా ప్రకటించింది. అక్కడితో ఆగకుండా పాటిదార్ రిజర్వేషన్ ఉద్యమాన్ని నడిపిన హార్దిక్ పటేల్ బిజెపిలో చేరారు. ఆయన సన్నిహితుడు, ఉద్యమ సమయంలో 'జబ్బర్ షేర్ ' గా పేరుపొందిన అల్పేష్ కతిరియాను ఆమ్ ఆద్మీ పార్టీ తన వైపు తిప్పుకుంది. అతడిని వరాచ రోడ్డు నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది. సూరత్, తదితర ప్రాంతాల్లో యువ పాటిదారులు ఆమ్ ఆద్మీ పార్టీకే మద్దతు ఇస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ అంటున్నారు. ఇక ముస్లింలు మొత్తం కాంగ్రెస్ తోనే ఉన్నారని దరియా పూర్ ఎమ్మెల్యే గియాసుద్దీన్ చెబుతున్నారు.    సౌరాష్ట్ర అత్యంత కీలకం    గుజరాత్ రాష్ట్రంలో అధికార పీఠాన్ని అధిష్టించాలంటే ముందు సౌరాష్ట్ర మొత్తాన్ని గెలవాలి. అప్పుడే సాధ్యమవుతుంది. ఈ ప్రాంతంలో 48 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 

ఒకరకంగా చెప్పాలంటే అసెంబ్లీలో నాలుగో వంతు సీట్లు ఇక్కడే ఉన్నాయి. పాటిదారులు, ఓబీసీలు అత్యధికంగా ఇక్కడే ఉంటారు. 2017 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అత్యధికంగా 28 స్థానాలు గెలుచుకుంది. అయితే మిగతా ప్రాంతాల్లో దెబ్బతినడంతో గద్దెనెక్కలేకపోయింది. బిజెపిని మాత్రం 99 స్థానాలకు పరిమితం చేయగలిగింది. అప్పట్లో పాటిదార్ ఉద్యమం ఉవ్వెత్తున సాగడం కాంగ్రెస్ పార్టీకి లాభించింది. ఆ పరిస్థితి ఈసారి లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం మొదలైంది. ఇప్పుడున్న సీట్లు కూడా కాంగ్రెస్ నిలబెట్టుకోలేకపోవచ్చని.. ఆమ్ ఆద్మీ పార్టీ దాని విజయవకాశాలను దెబ్బతీస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ ప్రాంతంలో 19 స్థానాలు మాత్రమే గెలిచిన బిజెపి.. ఈసారి మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. ఇక ఈ ప్రాంత పాటిదార్లలో యువతరం ఇప్పుడు ఆప్ కు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ కే ఎక్కువ నష్టం చేకూర్చుతుందని ఆ ప్రాంతవాసులు చెబుతున్నారు. ఎన్నికలకు ఇంకా రెండు వారాల సమయం నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ఎటైనా దారి తీయవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక గుజరాత్ ఎన్నికలు డిసెంబర్ 1 , 5 తేదీల్లో జరగనున్నాయి

Share it:

ARTICLES

NATIONAL

Post A Comment: