CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు రైతులు వర్సెస్ అటవీ అధికారులు

Share it:


 - 3 సం||ల వయసు గల మొక్కలను నరుకుతున్నారు : డిఆర్ఓ

 - మా భూములు మాకు ఇయ్యాల్సిందే : పోడు రైతులు

 - 144 సెక్షన్ అమలు చేసిన జిల్లా కలెక్టర్


సారపాక/బూర్గంపాడు, మన్యం న్యూస్ : 

మండల పరిధిలోని సోంపల్లి పంచాయతీ బుడ్డగూడెం గ్రామ ప్రాంతంలో ఇటీవల నెలకొన్న పోడు భూముల సమస్య రోజురోజుకి ముదిరిపోతుంది. అటు అటవీశాఖ అధికారులు, ఇటు పోడు రైతులు పోడుభూమి విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం బుడ్డగూడెం గ్రామంలోని సదరు భూముల ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు ఎక్కువ సంఖ్యలో మోహరించడంతో పోడు రైతులు వర్సెస్ అటవీ అధికారులు అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.


మూడు సం||రాల వయస్సు గల మొక్కలను నరుకుతున్నారు : డిఆర్ఓ రమాదేవి.


ఘటనకు సంబంధించి డిఆర్ఓ రమాదేవి మాట్లాడుతూ... 2005 సంవత్సరం నాటికి ముందుగా నరికిన పోడు భూములకు మాత్రమే పట్టాలు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని డిఆర్ఓ రమాదేవి పేర్కొన్నారు. అయితే కొందరు 2005 సంవత్సరం తర్వాత పోడు భూములు నరుకుతుండగా వాటిని అటవీ శాఖ వారు స్వాధీనం చేసుకుని గత మూడు సంవత్సరాల నుండి వాటిల్లో నర్సరీ మొక్కల పెంపకం చేస్తున్నామని తెలిపారు. అటవీశాఖ అధికారులు గత మూడు సంవత్సరాలుగా సాగు చేస్తున్న మొక్కలను ప్రస్తుతం కొందరు నరికివేసి ఆ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. మొక్కలు నరుకుతున్న సమయంలోనే వారిని అడ్డుకోవడం జరిగిందని, మొక్కలు నరక వద్దని హెచ్చరిస్తున్నప్పటికీ మొక్కలు నరుకుతుండడంతో పై అధికారులకు విషయాన్ని తెలియజేశామని వెల్లడించారు. 


 - మా భూములు మాకు ఇయ్యాల్సిందే : పోడు రైతులు


పోడు రైతులు మాట్లాడుతూ... పోడు భూములకు పట్టాలొస్తాయని ప్రజాప్రతినిధులు చెబుతూ ఉండడంతో ఇన్నాళ్లుగా ఊరుకుంటూ వస్తున్నాం. కానీ ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు పోడు భూముల జోలికి రావద్దని మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక అధికారి హోదాలో ఉండి మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం అటవీశాఖ అధికారులు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన పోడు భూముల సంఘర్షణలో ఒక మహిళకి తీవ్రంగా గాయాలయ్యాయని, క్షతగాత్రురాలని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆమెను కాపాడుకుందామని వారు వాపోతున్నారు. మా భూములను లాక్కొని మమ్మల్ని ఆగం చేద్దామనుకుంటే ఊరుకునేది లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.


 - బుడ్డగూడెంలో 144 సెక్షన్ అమలు చేసిన జిల్లా కలెక్టర్


మండల పరిధిలోని బుడ్డగూడెం గ్రామంలో నెలకొన్న పోడు భూముల వివాదం రోజురోజుకి పెరిగిపోతుంది. శనివారం పోడు భూముల ప్రాంతంలో మొక్కలు నరక్కుండా చర్యలు తీసుకునేందుకు అటవీశాఖ అధికారులు భారీగా మోహరించారు. అదే సమయంలో గ్రామస్తులు సైతం అక్కడికి  చేరుకుని భూములు స్వాధీనం చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు బుడ్డగూడెం గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్న జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సింది.

Share it:

TELANGANA

Post A Comment: