CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కాలుష్యపు కోరల్లో అశ్వారావుపేట

Share it:

 


విషాన్ని చిమ్ముతున్న పేపర్ బోర్డు

నెత్తీ నోరు మొత్తుకున్నా ప్రజల గోడు వినే వారే లేరు

 ప్రశ్నించిన వారిపైనే తిరిగి కేసులు నమోదు

ఇది అశ్వారావుపేట శ్రీ లక్ష్మీ తులసి పేపర్ బోర్డు పరిస్థితి


 మన్యంటీవీ, అశ్వారావుపేట: అర్ధబలం అంగబలం ఉంటే చాలు ఎంతటి దోపిడికైనా తెర తీయవచ్చు దానికి సంపూర్ణ ఉదాహరణే శ్రీ లక్ష్మీ తులసి ఆగ్రో పేపర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని అశ్వారావుపేట ప్రజలు ఉచ్చరించుకుంటున్నారు. లేదంటే ఆ కంపెనీలో జరుగుతున్న ఇన్ని ఆకృత్యాలను చూస్తూ కూడా ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పై ప్రజలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే పేపర్ బోర్డు తో ప్రజలు నానా కష్టాలు నష్టాలు పడుతున్న సంగతి ఈ రోజుది కాదు. 1995లో రాజమండ్రి వారు మూతబడిన ఈ పేపర్ బోర్డు ను లీజుకు తీసుకున్న నాటినుండి అశ్వారావుపేట ప్రజలు అనేక ఇబ్బందులకు లోనవుతూ ఆందోళనలు నిర్వహిస్తూనే వస్తున్నారు. పేపర్ బోర్డు యాజమాన్యం పేపరు తయారు చేయడమే కాకుండా, విద్యుత్ తయారీ ప్లాంట్ కూడా నెలకొల్పడం జరిగిందని. ఈ విద్యుత్ తయారీ ప్లాంటును నెలకొల్పిన నాటి నుండి కాలుష్యం మరింత పెరిగిపోయి చుట్టుప్రక్కల నివాసం ఉంటున్న ప్రజలు ఈ కాలుష్యం పై పోరాడుతూనే ఉన్నారని, ఈ పేపర్ బోర్డు నుండి వెలువడుతున్న బూడిద, వాసన, వెలువడుతున్న వ్యర్ధాలు, వలన ప్రజలు అనేక రోగాల బారిన పడుతూ బ్రతక లేని పరిస్థితి నెలకొందని అనేకమంది తమ సంపాదన ఈ పేపర్ బోర్డులో కాలుష్యం వల్ల వచ్చే వ్యాధుల వల్ల హాస్పిటల్ ఖర్చులకే సరిపోవడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. చుట్టుపక్కల గృహాలలో వంట పాత్రల పై, దుస్తులపై, గృహాలపై తెల్లని బూడిద పేరుకు పోవడమే కాకుండా, భరించలేని వాసన, పేపర్ బోర్డ్ నుండి వెలువడే శబ్దాలకు మా జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆ ప్రాంత ప్రజలు అనేక మార్లు ఆందోళనలు కూడా నిర్వహించినా మా గోడు పట్టించుకునే నాథుడే లేడని ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు. ఆ ప్రాంత ప్రజలు మరియు దగ్గరలో ఉన్న ప్రైవేటు డిగ్రీ కళాశాల విద్యార్థులు బూడిద, వాసన, శబ్దాలకు తట్టుకోలేక పేపర్ బోర్డు గేటు ముందు ఆందోళన నిర్వహిస్తే, పేపర్ బోర్డు యాజమాన్యం తిరిగి ప్రజలపైనే కేసులు పెట్టిందని ఆ ప్రాంత ప్రజలు దీనంగా తమ గోడు వెళ్లతీసుకుంటున్నారు. పేపర్ బోర్డు ముందు రోడ్డు పక్కన ఆర్ అండ్ బి రహదారి స్థలంలో కాటా ఏర్పాటు చేయడం, వందలాది లారీలు పేపర్ బోర్డుకు అటు ఇటు రోడ్డు వెంబడి నిలిపి వేయడం వల్ల హైవే రోడ్డు పై అనేక ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయని, ఏనాడు ప్రభుత్వ అధికారులు కానీ, లేబర్ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు అనేకం ఉన్నాయి. పేపర్ బోర్డు వల్ల రోడ్లపై విపరీతంగా దుమ్ము ఆ ప్రాంతాన్ని కమ్మేస్తున్న సందర్భంలో కూడా ఏనాడు వాటరింగ్ కూడా చేయలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పేపర్ బోర్డు లో విద్యుత్ తయారీ కేంద్రానికి నీళ్లు సరిపోవడం లేదని అశ్వారావుపేట పట్టణానికి అవసరమైనటువంటి గ్రౌండ్ వాటర్ ను మొత్తం లాగేసుకొనే కెపాసిటీ కలిగిన పెద్ద పెద్ద బోర్లు, హై కెపాసిటీ కలిగిన మోటార్లతో నీటి వినియోగం చేయడం వలన అశ్వారావుపేట ప్రజలు, రైతాంగం జలవనరుల శాఖ కు ఫిర్యాదు చేయటం కూడా జరిగిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పేపర్ బోర్డ్ నుండి విడుదల అవుతున్న వ్యర్ధాలు పేపర్ బోర్డు వెనుక భాగంలో ఉన్న చెరువులో కలవడం వలన పంటలు దెబ్బతింటున్నాయని, రైతులు అనేక ఆందోళనలు చేసినప్పటికీ ఏ స్థాయి అధికారులు కూడా పట్టించుకోలేదని, రైతులు ఆ చెరువులో నీళ్లు వాడటం మానేసి, ఎవరికివారుగా సొంతంగా బోర్లు వేయించుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని, ఆ ప్రాంత రైతాంగం నెత్తీనోరు మొత్తుకున్నా వినే నాథుడే కరువయ్యాడని ఆ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా ఈ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు చట్టాలు వర్తించవు, కనీస సౌకర్యాల కల్పన ఉండదు, ప్రమాదాల్లో మరణించిన వారి పట్ల సైతం జాలి, దయ, కరుణ, అనే పదాలకు చోటులేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాల ప్రకారం ఎనిమిది గంటలు పని చేయాల్సి ఉండగా, ఈ కంపెనీలో ఆ చట్టాన్ని ఉల్లంఘించి 12 గంటలు పని చేయించుకుంటున్నారని, స్థానికులు అయితే ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో, ఇతర రాష్ట్రాల నుండి కొందరు కాంట్రాక్టర్లను బ్రోకర్లుగా నియమించుకొని కార్మికులను తీసుకువచ్చి వెట్టి చాకిరి చేయించుకుంటున్న ఉదంతాలు అనేక సార్లు బయటపడ్డాయని, కంపెనీ యాజమాన్యం ఇంకో అడుగు ముందుకేసి ఈ మధ్యకాలంలో బాల కార్మికులతో పని చేయించడం ఆ దృశ్యాలు మీడియా కంటబడటం అనేక కథనాలు పుంఖానుపుంఖాలుగా వచ్చినా ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పేపరు తయారీ, విద్యుత్ తయారీ కేంద్రాలలో అనేక ప్రమాదకర ప్రదేశాలు ఉంటాయని, ఇటువంటి ప్రమాదకర ప్రదేశాల లో పనిచేసే కార్మికులకు కంపెనీ యాజమాన్యాలు శిక్షణనిచ్చి, సర్టిఫికెట్లు మంజూరు చేసి, గుర్తింపు కార్డులు ఇచ్చి పని చేయించుకోవాలనే నిబంధనలు ఉన్నప్పటికీ, ఈ కంపెనీ యాజమాన్యం అటువంటి వాటిని తుంగలో తొక్కి నిబంధనలకు విరుద్ధంగా పని చేయించుకుంటున్న ప్పటికీ ఎటువంటి చర్యలు కూడా తీసుకున్న దాఖలాలు లేవని  పలువురు విమర్శిస్తున్నారు. వందల కోట్లు టర్నోవర్ చేస్తూ ఫ్యాక్టరీని విస్తరించడంలో ఉన్న శ్రద్ధ కార్మికులపై గాని, నిబంధనలు అనుసరించడంలో కానీ, పరిసర ప్రాంత ప్రజలపై కానీ, రోగాల బారిన పడుతున్న ప్రజలను ఆదుకోవడంలో కానీ, అశ్వారావుపేట పట్టణ ప్రజల సంక్షేమం దృష్ట్యా కానీ ఎటువంటి శ్రద్ధ వహించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు, కార్మిక శాఖ అధికారులు దృష్టిసారించి పేపర్ బోర్డు యాజమాన్యం పై వస్తున్న ఆరోపణల దృష్ట్యా అజమాయిషీ వహిస్తూ తగు విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: