CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆసక్తికరంగా గ్రేటర్ ఫలితాలు

Share it:



  • \ ఆసక్తికరంగా గ్రేటర్ ఫలితాలు 
  • బల్దియా ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 56 సీట్లు
  • అతిపెద్ద పార్టీగా అవతరించిన గులాబీ దళం
  • దూసుకొచ్చిన కమలం
  • 4 నుండి 48కి పెరిగిన బలం

... 


     ప్రతిష్ఠాత్మకమైన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణరాష్ట్ర సమితి అతిపెద్ద పార్టీగా అవతరించింది. శుక్రవారం జరిగిన కౌంటింగ్‌లో టీఆర్‌ఎస్‌ 56 సీట్లు కైవసం చేసుకొన్నది. బీజేపీ 48, ఎంఐఎం 44 డివిజన్లను గెలుచుకొన్నాయి. కాంగ్రెస్‌ రెండు స్థానాలతోనే సంతృప్తి చెందాల్సివచ్చింది. ఇతర పార్టీలేవీ పత్తాలేకుండా పోయాయి. ఓటర్లు ఇండిపెండెంట్లవైపు కన్నెత్తి చూడలేదు. కోర్టు ఆదేశాల మేరకు నేరేడ్‌మెట్‌ ఫలితం వాయిదాపడింది. ఇక్కడ టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో ఉన్నది. 


ఆద్యంతం ఉత్కంఠ


150 డివిజన్లకు 30 సర్కిళ్లలో ఏర్పాటుచేసిన కౌంటింగ్‌ కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు సాయంత్రం వరకు ఉత్కంఠగా సాగింది. ప్రత్యర్థుల మధ్య పోల్‌ అయిన ఓట్ల తేడా చాలా స్వల్పంగా ఉండటంతో ఫలితాల సరళి క్షణక్షణం మారుతూ వచ్చింది. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించారు. 150 డివిజన్లలో పోలైన 1200 ఓట్లలో మెజార్టీ ఓట్లు బీజేపీకి వచ్చాయి. ఆ తర్వాత తొలి రౌండ్‌ ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు 85 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శించారు. దాదాపు 25 స్థానాల్లో బీజేపీ, నాలుగు స్థానాల్లో కాంగ్రెస్‌, 40 స్థానాల్లో ఎంఐఎం ఆధిక్యం చూపాయి. రెండో రౌండ్‌ కౌంటింగ్‌ మొదలయ్యేసరికి ఫలితాల సరళి అనూహ్యంగా మారుతూ వచ్చింది. టీఆర్‌ఎస్‌-బీజేపీ అభ్యర్థుల మధ్య చాలా డివిజన్లలో నువ్వానేనా అన్నట్లు హోరాహోరీ పోరు సాగింది. క్షణక్షణం ఆధిక్యాలు మారుతుండటంలో  ఉత్కంఠ పెరిగిపోయింది. సాయంత్రం 7.30 గంటలకు 149 డివిజన్లలో ఫలితాలు వెల్లడికాగా.. 55 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించి గ్రేటర్‌లో అతిపెద్ద పార్టీగా తన ఆధిక్యతను మరోసారి కొనసాగించింది. ఫలితం వాయిదాపడిన నేరేడ్‌మెట్‌లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. తుది ఫలితం వెలువడితే ఈ స్థానం కూడా గులాబీదళం ఖాతాలోకే వెళ్లే అవకాశాలు ఉన్నాయి. 17 సీట్లు స్వల్ప ఓట్ల తేడాతో టీఆర్‌ఎస్‌ చేజారిపోయాయి. పాతబస్తీలో ఎంఐఎం తన ఉనికిని కాపాడుకోగలిగింది ఎగ్జిట్‌పోల్స్‌లో 25-30 కి మించి రావడం గగనమనుకొన్న బీజేపీ.. తానే ఊహించని స్థాయిలో 48 డివిజన్లలో విజయం నమోదుచేసింది. ఈ ఎన్నికల్లో దారుణమైన పరాభవాన్ని చవిచూసింది మాత్రం కాంగ్రెస్‌ పార్టీనే. 149 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్‌ పార్టీ.. కేవలం రెండు స్థానాల్లోనే గెలిచింది. ఇక 106 స్థానాల్లో పోటీచేసిన టీడీపీ అభ్యర్థులు ఒక్కటంటే ఒక్క సీటులో కూడా కనీసం డిపాజిట్‌ దక్కించుకోలేకపోయారు. ఇక 4 సీట్ల నుండి బీజేపీ అనూహ్యంగా 48 సీట్లకు దూసుకురావడం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. 


టిఆర్ఎస్ కే ఛాన్స్ 


బల్దియా ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే గత ఎన్నికలు మినహా ఎప్పుడూ ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. 2016లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 99 స్థానాలు గెలుచుకున్నది. బల్దియా చరిత్రలో ఒక పార్టీ సొంతగా అధికారంలోకి రావడం అదే రికార్డు. ఈసారి ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా నిలిచిన టీఆర్‌ఎస్‌.. వరుసగా రెండోసారి బల్దియా పీఠంపై కూర్చునే అవకాశాలు ఉన్నాయని అంచనావేస్తున్నారు. ప్రస్తుత పాలక వర్గం ఫిబ్రవరి 10వ తేదీ వరకు కొనసాగుతుంది. అంటే కొత్త మేయర్‌ ఎన్నికకు ఇంకా రెండు నెలల సమయం ఉన్నది.


ఎక్స్‌ అఫీషియోలు కీలకం 


150 స్థానాలు ఉన్న జీహెచ్‌ఎంసీలో మేయర్‌పీఠం దక్కించుకోవడానికి కనీసం 76 స్థానాలు గెలుచుకోవాల్సి ఉంటుంది. జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకొంటారు. అప్పటికే వేరే స్థానిక సంస్థల పరిధిలో ఎక్స్‌ అఫీషియోగా నమోదుకాని.. ఓటు వేయనివారికి మాత్రమే నమోదు చేసుకొనే అవకాశముంటుంది. దీంతోపాటు జీహెచ్‌ఎంసీలో నివసిస్తూ ఓటరుగా నమోదైఉన్నవారికి అవకాశం ఉంటుంది. ఈ మేరకు మొత్తం 45 మందికి ఎక్స్‌ అఫీషియోగా నమోదుచేసుకోవడానికి అర్హత ఉన్నది. మేయర్‌ ఎన్నిక సమయంలో ఈ ఎక్స్‌ అఫీషియో ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకొంటారు.  ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు 31 మంది, ఎంఐఎంకు 10 మంది, బీజేపీకి ఇద్దరు ఎక్స్‌అఫీషియో సభ్యులు ఉన్నారు. ఈ లెక్కన టీఆర్‌ఎస్‌కు 87, బీజేపీకి 50, ఎంఐఎంకు 54 మంది సభ్యుల బలం ఉన్నట్టవుతుంది. 

Share it:

TELANGANA

Post A Comment: