CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

‘తెలుగులోనే మాట్లాడాలి. తెలుగులోని రాయాలి. తెలుగులోనే పాలన చేయాలి.

Share it:

‘తెలుగులోనే మాట్లాడాలి. తెలుగులోని రాయాలి. తెలుగులోనే పాలన చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ మార్పు రావాలి’. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పలికిన పలుకులివి. మాతృభాష తల్లి పాల వంటిది. పరభాష పోతపాల వంటిదని కొమర్రాజు లక్ష్మణరావు అన్న మాట సత్యము. అందుకే ఒక్కసారి తెలుగును గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. చందమామ రావే. జాబిల్లి రావే. కొండెక్కిరావే. గోగుపూలు తేవే అని చంకలోని చంటిపిల్లకు గోరుముద్దలు తినిపిస్తూ తెలుగింటి అమ్మ కమ్మగా పాడుతోంది. తల్లి ఒడి మొదటి బడి అంటారు. మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష.“జననీ జన్మ భూమిశ్చ, స్వర్గాధపి గరీయసి” అనడంలోనే మాత, మాతృభూమి, స్వర్గం కంటే మిన్న అని తెలుస్తుంది. మాతృభాష సహజంగా అబ్బుతుంది. అప్రయత్నంగా వచ్చేదే మాతృభాష. ఆ తేనెలొలికే తెలుగు పాటలు కొండెక్కిపోయే రోజులు వచ్చాయి. అనగనగా ఓ రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు అంటూ నాన్న చిన్నాడికి చెప్పే తెలుగు కథలు కంచికి చేరే రోజులు కనిపిస్తున్నాయి. అమ్మ మమ్మీగా మారింది. నాన్న డాడీగా మారాడు. నాన్న పిలుపు వినడం కష్టమవుతోంది. ఆంటీ అంకుల్‌ కల్చర్‌ వచ్చేసింది. తాతయ్య అనే అచ్చ తెలుగు పదాన్ని గ్రాండ్ పా అని మార్చేశాం. ఆ ఏబీసీడీల వేడికి తెలుగు పలుకుబడి మాడిమసయిపోయే ప్రమాదముంది. ‘మేలుకోండి, మేలుకోండ’ని తెలుగు భాషా వేత్తలు ఎలుగెత్తి చాటుతున్న వైనం తెలుసుకోవాలి. దాదాపు రెండుతరాల విద్యార్థులు తెలుగు రాకుండానే చదువులు పూర్తి చేశారు. తెలుగుభాషను తూతూమంత్రంగా చదువుకునే కళాశాలల నుంచి బైటికొచ్చారు. వారిప్పుడు ఇంజినీర్లు, డాక్టర్లు, ప్రభుత్వశాఖల్లో పెద్దపెద్ద ఉద్యోగులయ్యారు. వారికి తెలుగంటే పడదు. ఇంట్లో తెలుగక్షరాలు పలకరు. వినపడనీయరు. వీరే అలా ఉంటే వీరి పిల్లలకు మాత్రం తెలుగంటే ఏం తెలుస్తుంది పాపం. ఇంకో రెండుతరాలు కొనసాగితే, తెలుగు వాచకాన్ని మ్యూజియంలో ఓ పురాతన వస్తువులా ప్రదర్శనకు పెట్టాల్సిందే. ఒకటో తరగతి బుడతడి భుజం మీదున్న బండెడు పుస్తకాల్లో తెలుగు పుస్తకం ఒక్కటంటే ఒక్కటన్నా ఉంటుందా అంటే లేదనే సమాధానం వస్తుంది. అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ, ఉడుత, ఊయల వంటి పదాలు ఉండవేమో. పలక, బలపం, అరక, గిలక, జనక, కనక వంటి పదాలు మర్చిపోవాల్సిందే. చరిత్రలోకి తొంగి చూస్తే… మన దేశంలో 1652 భాషలున్నాయి. వీటిలో పదిహేను నుండి పదహారు భాషలకు లిపి ఉంది. రెండువందల భాషలకు పదహారు వందలకుపైగా మాండలికాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 6,500 భాషలున్నాయి. అందులో తెలుగు మాట్లాడేవారు 9.2 కోట్ల మంది. ప్రపంచ భాషలో తెలుగు స్థానం 17. ప్రపంచంలో మాండరిన్ భాషను ఎక్కువ మంది మాట్లాడుతుండగా..ఆ తర్వాత స్థానం ఆంగ్లం. మూడో స్థానాన్ని ఆక్రమించింది మన జాతీయ భాష హిందీ. తెలుగు మాధ్యమంలో ప్రాధమిక విద్యను చదువుకుంటున్న వారి శాతం 27. అదే సమయంలో గూగుల్ సెర్స్ లో తెలుగు భాషకు బాగానే ప్రాధాన్యం ఉంది. గత పదేళ్ల నుండి చూస్తే గూగుల్ లో తెలుగుకు 3, 4వ స్థానముంది. గత మూడువందల సంవత్సరాల్లో ఒక్క అమెరికా, ఆస్ట్రేలియాలలోనే అనేక మాతృభాషలు కనుమరుగయ్యాయి. వివిధ తెగల భాషలు ఎలా ఉండేవో చెప్పుకోవడం తప్ప ఏం చేయలేం. ఈ ప్రమాదాన్ని నివారించేందుకు ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగమైన యునెస్కో ‘మాతృభాషల పరిరక్షణ’ ప్రజల జాతీయ, పౌర, రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులలో అంతర్భాగం’ అని చెప్పింది. ‘కనీసం ముప్ఫైశాతం పిల్లలు తమ మాతృభాషను నేర్చుకోవడం మానేస్తే, ఆ భాష ఉనికి ప్రమాదంలో పడినట్టేనని హెచ్చరించింది. ఆ లెక్కన తెలుగు భాషకూ ప్రమాదం పొంచి ఉంది. దేశ భాషలందు తెలుగు లెస్స. శ్రీకృష్ణదేవరాయలు అంతటి మహా చక్రవర్తి తన “ఆముక్తమాల్యద”లో ఆంధ్రమహావిష్ణువుతో ఆ మాటలు చెప్పించాడు. ప్రతి తెలుగు వారి గుండెలలో నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. బహుబాషా కోవిదుడైన రాయలు, ఆ భాష లోతుపాతులనెరిగి, మధించి భువన విజయ వికమాదిత్య న్యాయాధిపతిగా చెప్పిన తీర్పు దేశబాషలందు తెలుగులెస్స అన్న మాట. అందుకే తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్‌ ది ఈస్ట్ అన్నాడు వెనిస్ యాత్రికుడు నికోలో డి కాంటే. అంతటి చక్కటి భాషకు ప్రమాదం లేదని ఇటీవలే పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆ ప్రకటన చూసి చంకలెగరేసుకోవద్దు . ఇప్పుడు కాకపోయినా రాను రాను తెలుగు పదాలు కనమరుగవుతున్నాయన్నది వాస్తవం. చక్కని పలుకుబడులు, నుడికారాలకు తెలుగు భాషయే పుట్టినిల్లు. చక్కని కవితలల్లిక లో జిగిబిగిని ప్రదర్శించిన నేర్పు తెలుగులోనే వీలైంది. సీపీ బ్రౌను దొర కూడా ఈ భాషను గూర్చి పొగడటం మన తెలుగు వారి, తెలుగు బాష యెక్క గౌరవం. మనసులోని భావనను వ్యక్తం చేసే సాధనం భాష. మంచి ఉఛ్చారణతో ఎదుటి వ్యక్తికి అర్ధమయ్యేలా చెప్పడమే భాషకు నిర్వచనం. భాషకు మాటలు అవసరం లేదు. సైగల ద్వారా చెప్పినా భాషే అవుతుంది. మానవ జాతి పుట్టుక నుంచి నేటి వరకు వచ్చిన మార్పులు, అభిప్రాయ వ్యక్తీకరణలో చోటుచేసుకున్న ఉత్సాహం, ఉత్సుకత, భావోద్వేగాల సమ్మేళనం మాటల ఆవిర్భావానికి దారి తీసింది. భాష పుట్టకముందున్న మనిషి మనుగడకీ, భాషల ఏర్పాటు తర్వాత మనిషి మనుగడకీ చాలా తేడా ఉంది. ఉత్తర భారత దేశంలోని బాషలను ఆర్య బాషలనీ, దక్షిణ భారతదేశంలోని భాషలను ద్రావిడ భాషలనీ పిలుస్తారు. తెలుగు ద్రావిడ బాషల నుండి పుట్టింది. ద్రావిడ లక్షణముల ఉన్నాయి కాబట్టి సరళము, సుకుమారమైన తెలుగువాణి, సంస్కృత భాషా కైకర్యం, గాంభీర్య పటుత్వాలను అలవరుచుకుంది. తల్లికి, చెల్లికి లేని కొత్త అందాలను అలవరుచుకుంది. తెలుగు భాష సస్యశ్యామలమైంది. తెలుగు గడ్డ కవితా సస్యశ్యామలమైనది. “తరిపి వెన్నెల! ఆణిముత్యాల జిలుగు పునుగు జివ్వాజీ! ఆమని పూల వలపు మురళి రవళులు! కస్తూరి పరిమళములు కలిసి ఏర్పడే సుమ్ము మా తెలుగు భాష” అని నండూరి వారు చెప్పిన తీరు అద్భుతం. తెలుగు పదం ఎలా పుట్టిందనేది ఆసక్తికరం. త్రిలింగ, తిరిలింగ, తి అలింగ అనే పదాల నుండి తెలుగు వచ్చేందనే అభిప్రాయం ఉంది. తెనుగు శబ్దం నుండి తెలుగు వచ్చిందనే వాదనా లేకపోలేదు. “తలైంగు” జాతి వారి భాష కాబట్టి తెలుంగు అని కొందరి మాట. తలైంగు” అంటే తల స్థానాన్ని ఆక్రమించినవారని అర్థం. అంటే నాయకులు అని అర్థం. “తెలుంగు” అంటే తెల్లదనం. స్పష్టంగా ఉండే భాష అని మరో భావన లేకపోలేదు. “తెన్ను” అంటే దారి కాబట్టి తెనుంగు అంటే దారిలో ఉండే వారి భాష. దారి అంటే ఆర్యులు దక్షిణాపథం అని వ్యవహరించే ప్రాంతం. “తెన్” నుంచి తెనుగు వచ్చిందనేది మరికొందరి అభిప్రాయం. “తెన్” అంటే దక్షిణ దిక్కు. దక్షిణ ప్రాంతానికి చెందిన భాష కాబట్టి “తెనుగు” అయిందని ఎక్కువమంది అభిప్రాయం. ఐతే “త్రినగ” నుంచి తెనుగు ఏర్పడిందని మరికొందరంటారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం, మహేంద్రగిరి అనే మూడు కొండలు గల ప్రదేశంగా “త్రినగ” శబ్దం ఏర్పడిందనే ప్రచారం లేకపోలేదు. మన దేశానికి పూర్వ కాలంలో త్రిలింగమనే అనే పేరుండేది. శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం అనే మూడు పుణ్య క్షేత్రాల్లో గల మూడు శివ లింగాల ఆధారంగా త్రిలింగ-తి అలింగ-తెలింగ, తెలుగు అయిందంటారు. విద్యానాధుడు అనే సంస్కృత కవి మొదటిగా “త్రిలింగ” పదాన్ని వాడారు. త్రికళింగ నుంచి తెలుగు పదం వచ్చిందని చిలుకూరి నారాయణరావు గరు అనగా తేనె + అగు = తెనుగు అని గ్రియర్సన్, తలైంగ్ జాతినుంచి తెలుగు ఏర్పడిందని ఖండవల్లి లక్ష్మీరంజనం, తెలుగు శబ్దమే త్రిలింగగా సంస్కృతీకరణకు లోనైందని కొమర్రాజు లక్ష్మణరావు పేర్కొన్నారు. తెళ్+గు = తెలుగు అనే అభిప్రాయం కూడా ఉంది. నన్నెచోడుడు, పాల్కురికి సోమనలు తెనుగును భాషాపరంగా వాడారు. ఐతే తెలుగు శబ్దం తెనుగు శబ్దానికి రూపాంతరమే అనీ ఈ తెలుగు శబ్దం త్రిలింగ లేదా త్రికళింగ శబ్ద భాగం కాదని జి.ఎన్. రెడ్డి నిరూపించారు. తమిళ, కన్నడ పుస్తకాలు, శాసనాల్లోనూ “వడుగ”, “వడగ”, “తెలింగ”, తెలుంగు” అనే విధంగా పేర్లు కనిపిస్తాయి. ఐతే ఎక్కువగా వాడే పేర్లు మాత్రం ఆంధ్ర, తెలుగు, తెనుగు. తెలుగు చరిత్ర…. క్రీస్తు పూర్వం కాలంలోనే తెలుగు ఉండేది. ఐదో శతాబ్ది నాటి భట్టిప్రోలు శాసనంలో తెలుగు ఉనికి ఉంది. క్రీ.పూ 400-100 ఏళ్ల నాటివి ఆ శాసనాలు. క్రీ.శ. 1వ శతాబ్దం నాటి శాతవాహన రాజైన హాలుని గాధా సప్తశతిలో తెలుగు ఉంది. అప్పటికే తెలుగు ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే తెలుగు భాషకు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. నన్నయకు ముందు వెయ్యి సంవత్సరాలనాటికే తెలుగు ఒక స్వతంత్ర భాషగా విరాజిల్లింది. క్రీ.శ. 200 లోని అమరావతి శిలాశాసనంలోని “నాగబు” పదంలోని “బు” ప్రత్యయాన్ని మొట్టమొదటి తెలుగు అక్షరంగా భాషా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కడప జిల్లా కమలాపురం మండలంలోని ఎర్రగుడిపాడులో చెన్నకేశవస్వామి ఆలయంలో రేనాటి చోళుడైన ధనుంజయుడు వేయించిన శాసనం (క్రీ.శ.575-600) , కలమళ్ళ (క్రీ.శ.575-600) శాసనాలు మొట్టమొదటి శిలాశాసనాలుగా భావిస్తున్నారు. క్రీ.శ. 848లోని పాండురంగని అద్దంకి శాసనం, యుద్ధమల్లుని బెజవాడ శిలాశాసనాల్లో తెలుగు పద్యాలున్నాయి. ఆ తర్వాత రాజరాజ నరేంద్రుడు ఆస్థాన కవి నన్నయ్య భట్టారకుడు 11 శతాబ్దిలోనే తెలుగులో రచనలు చేశాడు. అంతకు ముందే తెలుగులో చంధస్సు, సాహిత్యం, వ్యాకరణం ఉండేవి. తెలుగుభాష ఎన్నో కొత్త పదాలను తనలో ఐక్యం చేసుకుంటోంది. తెలుగు బాష కోటి కిటికీల గాలి మేడ. అన్నీ వైపుల నుండి వీచే గాలులను ఆహ్వానించి, ఆతిధ్యమిచ్చి గౌరవిస్తోంది. మన తెలుగు కవులైన నన్నయ, తిక్కన, ఎఱ్ఱన తెలుగు పాండిత్యంతో మెప్పించిన ఉద్దండులు. మన తెలుగు కవులు అపార ప్రజ్ఞానులు. సంస్కృతాంధ్ర పదాల ప్రయోగంలో దిట్ట. పోతన సంస్కృతాంధ్ర పదాలతో ఆడుకున్నాడు. పెద్దన మనుచరిత్రలో ఇంతలు కన్నులుండ అనే పద్యంలో తేట తెనుగు నుడికారపు సొంపులు, వంపులు, తామర తంపరలు, అల్లసాని వారి ఆ అల్లికజిగిబిగి లో తెలుగు పదములు, సంస్కృత శబ్ధములు తెలుసుకోవాల్సిందే. తెలుగు కవులకు జరిగిన సత్కారాలు ప్రపంచములో ఏ దేశంలోని కవులకూ జరగలేదంటే అతిశయోక్తి కాదు. సాహితీ భోజుడైన కృష్ణదేవరాయులు కవులను ఎంతగా ఆదరించారో తెలియనిది కాదు. పెద్దన కవికి రాయులు గండపెండేరము తొడిగి గౌరవించాడు. తెలుగు భాష సంగీతానికి అనువైన అజంత భాష. తెలుగు ఆ జన్మ సంగీత కవచకుండలాలతో భాసించింది. సంగీత కళారాధనలో తెలుగు వారికి కలసి వచ్చిన గొప్ప అదృష్టం మన మాతృ భాష తెలుగు. తెలుగు భాషలో వెలసిన పాటలు, స్త్రీల పాటలు, గేయాలు, కీర్తనలు, మరి ఏ ఇతర బాషల్లోనూ లేవు. రామదాసు కీర్తనలు తెలుగు దేశమంతా వ్యాపించాయి. తాళ్ళపాక అన్నమాచార్యులు ముప్పై రెండు వేల కీర్తనలు విరచించాడు. తెలుగు వారి కళాభినివేశమునకు పరాకాష్ట త్యాగరాజు. వీరే కాదు… గురజాడ అప్పారావు, వీరేశలింగం పంతులు, శ్రీశ్రీ, సి.నా.రె మొదలైన కవులు ఎన్నో గొప్ప తెలుగు కావ్యాలు, కథలు రచించారు. తెలుగులో కవిత్వం మన ఆది కవి “నన్నయ” గారి మహాభారతం నుండి అంటే 11వ శతాబ్దం నుండి మొదలైంది. తెలుగు భాష తేనె వలె మధురం. “సంస్కృతంలోని చక్కెర పాకం, అరవభాష లోని అమృతరాశి, కన్నడ భాష లోని తేట, ఇవన్నీ తెలుగు నందు కలవు” అని శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. మన తెలుగు భాషకి “తెనుగు భాష”, ఆంధ్రభాష అను పర్యాయ పదాలున్నాయి. తెలుగు భాషలోని అక్షరాలు 56 ఉండేవి. 18 అచ్చులు మరియు 38 హల్లులు ఉండేవి. కానీ, ఇప్పటి పాఠ్య పుస్తకాల ప్రకారం 16 అచ్చులు, 36 హల్లులుగా మారిపోయాయి. తెలుగు భాషలో మాత్రమే “అష్టావదానం”, “శతావదనం” “సహస్రావదనం” “సమస్యాపూర్ణం” అనే అంశాలు ఉన్నాయి. వేరే ఏ భాషకు కూడా ఈ విధమైనా సౌకర్యం ఉండదు. తెలుగు భాష గురించి ఎంత చెప్పినా, రాసినా, చదివినా, విన్నా తనవి తీరదు. అంతటి మధురమైనది మన తెలుగు భాష. మహాత్మగాంధీ అంతటి వాడు 1938 లో తన హరిజన పత్రికలో మాతృబాష బోధన గురించి ప్రస్తావించారు. ఆంగ్ల విద్యాబోధనను తప్పు పట్టారు. నిజమైన భావ ప్రేరేపణ, ప్రగతి, మాతృబాష వల్లనే వస్తుందని చెప్పారు. స్వబాషలో విధ్య ఉంటే, మనకు సురాజ్యం ఎప్పుడో వచ్చేదని ‘గాంధీజీ’ చెప్పారు. మాతృబాషలో విద్యాబోధన వల్ల మనసులు చురుకుగా పనిచేస్తాయని కవీశ్వరుడు రవీంధ్రుడు అన్నాడు. తెలుగు సంగతేంటి… తెలుగును పరిపాలనా బాషగా చేయాలనే ప్రయత్నాలు చాలానే జరిగాయి. చివరకు 1966 లో తెలుగును అధికారభాషగా గుర్తించారు. ఆ బిల్లు చట్టం అయంది. ప్రభుత్వ శాఖలన్నీ తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు నడపాలని 1966 డిసెంబర్ లోనే ఉత్తర్వులు వచ్చాయి. పరిపాలనా బాషగా తెలుగు స్వరూపం ఎలా ఉండాలో నిర్ణయించటానికి పింగళి లక్ష్మీకాంతం, జి.ఆర్.పి గ్విన్ ల అధ్యక్షతన సంఘాలు వచ్చాయి. ప్రభుత్వంలో ఒక శాఖగా 1974 మార్చి 19 న “అధికార భాష సంఘం” ఏర్పడింది. ప్రజల భాషలో పరిపాలన సాగించాలి. పాలకుల భాష ఒకటి, పాలితుల భాష మరొకటి ఉండకూడదంది. ప్రజలకి తమ భాషలో సమస్యలని చెప్పుకొనే హక్కు ఉండాలి. అధికారులు తెలుగులో వివరించే బాధ్యతని కలిగి ఉండాలి. న్యాయస్థానాల్లో తెలుగులో కాకుండా ఆంగ్లంలో చెప్పడం వల్ల ప్రయోజనం సంగతి అటుంచి న్యాయం జరగదనేది వాస్తవం. తెలుగులో పుస్తకాలను విరివిగా ప్రచురించాలి. సమగ్రమైన పారిభాషిక పద కోశాల్ని రూపొందించాలి. ప్రభుత్వం, తెలుగు అకాడమీ, విశ్వవిద్యాలయాలు వంటి ద్వారా తెలుగు గ్రంథాలు రాయించాలి. ప్రజల్లో చైతన్యం కలిగించాలి, దీక్ష, పట్టుదలతో తెలుగును బోధనా భాషగా అమలు చేయాలి. ఇందుకు ప్రజలు సహకరించాలి. తెలుగు మాధ్యమంలో చదివిన వారికి సదుపాయాలు కల్పించాలి. తెలుగులో ఐ‌ఏ‌ఎస్, ఐ‌పి‌ఎస్ వంటి ఉన్నత పరీక్షలు రాసే పద్దతిని అమలు చేయాలి. ప్రభుత్వ ఉత్తర్వులు, న్యాయస్థానాల తీర్పులు పూర్తిగా తెలుగులోనే ఉండాలి. ఈ మధ్య అనంతపురం, గుంటూరు, కరీంనగర్ వంటిచోట్ల తెలుగులోనే న్యాయమూర్తులు తీర్పులు ఇచ్చిన సంగతిని తెలిసిందే. మిగతా వారు అదే పద్దతిని పాటించాలి. తెలుగు భాష పట్ల మమకారం పెరగాలి. ప్రభుత్వం తెలుగు పట్ల శ్రద్ద వహించాలి. అధికారులు, ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి. అప్పుడే తెలుగు నాలుగు దిక్కులా మరింతగా విస్తరించగలుగుతుంది. తెలుగుభాష తీయదనం. తెలుగుభాష గొప్పతనం. తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక తీయదనం.. ఓ సినీకవి కలం నుంచి జాలువారిన అక్షర సత్యం ఇది. అమ్మా అనే పిలుపుతోనే తెలుగు మాధుర్యాన్ని పంచుతుంది. ఏలికలు మేల్కొని తేనెలొలుకు తేట తెలుగును రక్షించుకోకపోతే కొవ్వొత్తిలా కరిగిపోతోంది. సమస్య ఎందుకు వస్తోంది… తెలుగు చదివి తెలుగులో రాస్తే కొన్ని సమస్యలు రావడం సహజమే. అనువాద సమస్యలు వస్తున్నాయి. విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలంటే ఆంగ్లం తప్పనిసరి అయింది. పోటీ పరీక్షలు మిగతా భాషల్లోనే రాయాల్సి వస్తోంది. ఆంగ్ల భాషలో ఉన్న గ్రంథాలను తెలుగులోకి అనువదించటం కష్టమని కొందరంటారు. పారిభాషిక పదాలకు సరైన పదాలను తెలుగులో రాయలేమని కొందరు భావిస్తారు. ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చెయ్యాలంటే తెలుగు మాధ్యమం పని చేయదు. ఆంగ్లమాధ్యమంలో చదివినవారే పనికివస్తారని ఒక అభిప్రాయం. అతనికి ఎంత జ్ఞానం, విజ్ఞానం ఉన్నా విద్యలోకి ప్రవేశించలేడన్నమాట. ఆంగ్లం వస్తేనే జ్ఞాని, విద్యావంతుడు. ఇంగ్లీషు రాకపోతే అజ్ఞాని, అనాగరికుడు అని మనమే నిర్ధారించుకుంటున్నాం. ఇంగ్లీషే అన్నింటికీ మూలం అనేలా మారింది పరిస్థితి. అందుకే అధికార భాషా సంఘం అధ్యక్షులుగా పనిచేసిన వావిలాల గోపాలకృష్ణయ్య ఏమన్నారంటే… ‘ఇంగ్లీష్ లో చదివిన అందరికీ ఉద్యోగాలిస్తే, నా ఉద్యమం మానుకుంటాను’ అమెరికా పోయే నలుగురి కోసం అంతా ఇంగ్లీష్ లోనే చదవాలా?. కానీ మనదేశంలో త్రి భాషా సూత్రం ప్రకారం మూడు భాషలు కొన్ని రాష్ట్రాల వారు విధిగా నేర్చుకున్నా, ఆంగ్ల భాషను తప్పకుండా నేర్చుకోవాలన్నారాయన. అఖిలభారత సర్వీసులకు, మెడికల్. ఇంజనీరింగ్ వంటి పోటీ పరీక్షలలో ఆంగ్ల మాధ్యమంలో చదివిన విద్యార్థులే రాణిస్తారనే ఆపోహ ఉంది. మాతృభాషలో చదివిన వారు రాణించలేరని అనుకోవడం పొరపాటు. ఈ మధ్యకాలంలో గ్రామీణ విద్యార్థులు, మాతృభాష మాధ్యమంగా చదివినవారు పోటీ పరీక్షలలో, ఉద్యోగాల అర్హత పరీక్షలలో ప్రతిభను చూపుతున్నారు. కేంద్ర సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఎంపిక అవుతున్న సంగతి తెలుసుకోవాలి. ప్రస్తుతం ప్రపంచంలో తెలుగు భాష పలుచోట్ల వాడుకలో ఉంది. ప్రపంచంలో 16వ స్థానంలో ఉంది. దేశంలో రెండవ స్థానంలో ఉంది. ఈ విధంగా తెలుగు ప్రపంచ భాషగా ఒక గొప్ప విశిష్టతను కలిగి ఉంది. అధికార భాషగా తెలుగు అమలుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్దితో వ్యవహరించాలి. ఇతర రాష్ట్రాల పాలకులు ఏం చేస్తున్నారంటే.. కర్నాటకలో కన్నడం లేకుండా హైస్కూలు విద్య పూర్తికాదు. పైగా 15 శాతం మార్కులు కన్నడం చదివితే ప్రోత్సాహకంగా ఇస్తారు. తమిళనాడులో ఎనిమిదవ తరగతిదాకా తమిళాన్ని ఒక భాషగా నిర్భందం చేశారు. అయిదో తరగతి వరకు తెలుగు తప్పనిసరని నిర్భందం చేస్తే మంచిది. ప్రైవేట్ స్కూళ్ళ మీద కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తున్నాయో మన ప్రభుత్వం అలా వ్యవహరించాలి. తమిళులు, కన్నడిగులు, మలయాళీల్లో ఉన్నంతగా అమ్మ భాషపై మనకు ప్రేమ ఉండాలి. కేరళ, కర్ణాటక పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఆంగ్ల విద్యా బోధన ఆప్షనల్‌గానే కొనసాగుతోంది. ఆయా రాష్ట్రాల్లో అమ్మ భాషకే తొలి ప్రాధాన్యం. ఇలానే తెలుగులోను రావాలని కోరుకుందాం. ఏం చేయాలి… తెలుగుభాషకు ప్రాచీన హోదా కల్పించినా అమలు తీరులో మూడు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అవుతున్నాం. అమ్మ ఇంటి నుంచే తెలుగు భాషను నేర్పాలి. అక్కడ నుంచే తెలుగు భాష అమలు కావాలి. తెలుగు రచనలను ప్రోత్సహించాలి. వారు రాసిన పుస్తకాలను ముద్రించాలి. సమాజానికి అందించాలి. వారిని ప్రొత్సహించాలి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాల్లో తెలుగులోనే మాట్లాడాలనే నిబంధనలు పెట్టాలి. తెలుగు ఔన్నత్యాన్ని పుస్తకాల్లో ప్రవేశపట్టాలి. విద్యార్థి దశ నుంచే మాతృభాష పట్ల మమకారం పెంచేలా చర్యలుండాలి. తెలుగు కావ్యాల ఘనతను సమాజానికి చాటాలి. పరభాషను గౌరవించు. మాతృభాషను ప్రపంచానికి చాటిచెప్పు అన్న నినాదం ఇంటింటికి చేరాలి. పల్లె సీమ నుంచి పట్టణం, నగరాల వరకు ప్రతి చోట తెలుగు గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలి. జానపదాలు, జానపద కళాకారులకు ఇందుకు వినియోగించాలి. తెలుగు సాహిత్యంలో మరింతగా పరిశోధనలు చేయాలి. తెలుగుభాష పరిరక్షణకు కృషి చేయాలి. . తెలుగు కవులను ప్రోత్సహించి, వారు రచించిన పుస్తకాలను ప్రభుత్వమే అచ్చు వేయించాలి. ప్రైవేటు పాఠశాలల విధానం మారాలి. ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు మాట్లాడితే నేరమన్నట్లుగా శిక్ష విధించడం మానుకోవాలి. ప్రైవేటు పాఠశాలల్లో సైతం 6వ తరగతి వరకు తెలుగు కచ్చితం చేయాలి. పరభాష వ్యామోహన్ని తగ్గించాలి. తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు నడుంబిగించాలి. ప్రతి ఒక్క విద్యార్థి ఒక సైనికుడి తరహాలో తెలుగు గొప్పదనాన్ని అందరికీ చాటాలి.
Share it:

ARTICLES

Post A Comment: