మన్యం మనుగడ,పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోవిందాపురం ఇసుక ర్యాంపుకు సంబంధించి ర్యాంపు పనులు ప్రారంభం కాకుండానే జీరో దొంగలు హడావిడి చేశారు. గ్రామస్తుల సహకారంతో ఏడూళ్ళ బయ్యారం పోలీస్ శాఖ మంగళవారం రాత్రి జీరో దందా కోసం పూనుకున్న దొంగ లారీలను పట్టుకున్నారు. ఇప్పటికే చాలా రోజులు నుండి దొంగ ఇసుకకు అలవాటు పడ్డ కేటుగాళ్లు, మంగళవారం రాత్రి కూడా మమ్మల్ని ఎవరూ గమనిస్తారులే అనుకొని ద్వాపర యుగంలో చిన్ని కృష్ణుడు వెన్నను దొంగలించినట్లుగా, నిఘా నేత్రాల యుగంలో ఇసుక దొంగతనాలకు పాల్పడ్డారు. వారి జీరో దొంగతనాలకు అలసిపోయిన గోవిందాపురం ప్రజలు ఎలాగైనా వారి దొంగతనాన్ని ఆపివేయాలని, గతంలోనే ప్రశ్నించగా ఇసుక ర్యాంపుకు అనుమతులు వచ్చాయని, అధికారుల అనుమతితోనే ఇసుక తరలిస్తున్నామని తెలియజేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఇసుకను తరలించాలని గోవిందాపురం ప్రజలకు తెలుసు, కానీ ఈ దొంగలేమో రాత్రికి రాత్రి ఇసుకను దొంగలిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన గోవిందాపురం ప్రజలు జీరో దొంగలను పట్టించారు. ఈ సందర్భంగా గోవిందాపురం ప్రజలు మాట్లాడుతూ, ఇసుక లారీల డ్రైవర్లు మాత్రమే దొరికారని, హీరోలమని చెప్పుకునే జీరోగాళ్లు దొరకలేదని, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా హీరో దొంగల భరతం పట్టాలని, గోవిందాపురం ప్రజలు పోలీసు శాఖను కోరుచున్నారు.
Post A Comment: