CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

హక్కుల సాధనకై ఆదివాసీల పోరాటం

Share it:

 



దమ్మపేట ఆగస్టు 09 ( మన్యం మనుగడ ) : భూమి, అడవి, నీటి పై (జల్, జంగిల్, జమీన్) సంపూర్ణ హక్కులు కావాలని కొన్ని శతాబ్దాలుగా ఆదివాసులు పోరాటం చేస్తున్నారు. దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్నారు. విశాల భారత దేశంలో ఆదివాసులు మొదటి నుండి స్వయం పాలనకై పోరాడుతూనే ఉన్నారు. విశాల భారత దేశంలో అతి పెద్ద రాజ్యాంగంగా చెలామణి అయిన గోండ్వానా రాజ్యంను ఆదివాసులు పరిపాలించారు. ఉత్తర భారత దేశం నుండి దక్షిణ భారత దేశం సరిహద్దు భూబాగంలో మధ్యభారతదేశంలో అతిపెద్ద రాజ్యంగా గోండ్వానా రాజ్యం విస్తరణ అయి ఆదివాసుల పరిపాలనలో కొనసాగేది. మొగలు సామ్రాజ్యం ఉత్తర భారత దేశం మొత్తం విస్తరించిన దక్షిణ భారత దేశంలో విస్తరించకుండా మద్యభారతదేశంలో పోరాడిన యోధులు గోండ్వానా రాజ్యంను పరిపాలించిన ఆదివాసులు. ఆదివాసీయేతర సమాజం ముఖ్యంగా ఆర్యుల నుండి మొగలాయిలు, బ్రిటిషువారి నుండి నేటి పాలకుల వరకు వలస సామ్రాజ్యవాద చొరబాట్లు దోపిడీ, అణచివేతల కారణంగా నిరంతర ఆదివాసుల పోరాటాలు కొనసాగుతున్నాయి. మరాఠాలు, రాజు పుత్రులు, కాకతీయులుతో జరిగిన పోరాటంలో కొంత భూభాగాన్ని స్వయం ప్రతిపత్తులను ఆదివాసులు కోల్పోయారు. కాకతీయుల పరిపాలనలో ప్రసిద్ధుడు రుద్రదేవుడు (మొదటి ప్రతాపరుద్రుడు) (క్రీ.శ.1158-1195) కూడా వరంగల్లో ఉన్న మేడారం పరిసర ప్రాంతాలన్నీ పరిపాలిస్తున్న మేడరాజును ఓడించి తను ఎదుర్కొన్న ప్రథమ శత్రువు మేడరాజు పేరును హనుమకొండ వేయిస్థంబాల గుడి శాసనంలో రాయించాడు. నేడు "మేడారం"గా ప్రసిద్ధి చెందిన సమ్మక్క-సారలమ్మల పోరాటం కూడా ఆదివాసీలకు రాజ్యఅధికారం కొరకు అన్నది జగమెరిగిన సత్యం. క్రీ.శ.13వ శతాబ్దం చివరి వరకు సమ్మక్క- సారలమ్మ తరం వరకు ఆదివాసీలు గొండ్వానా రాజ్యాలు సెంట్రల్ ఇండియాలో కూడా కొనసాగాయి. ఎవరి పాలనలోను ఆదివాసులు తమ ప్రత్యేకతను కోల్పోకుండా సంరక్షించుకున్నారు. తమ ప్రాంతాలను తామే పాలించుకోవడానికి ఆదివాసులు ప్రయత్నం చేసి విజయం కూడా సాధించారు. దేశంలో దాదాపు 500 సంత్సరాలు ప్రస్తుతం భారత దేశంలో గల మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లో గల భూభాగాలలో "గోండ్వానా రాజ్యం"గా ఆదివాసీల పాలన కొనసాగింది. క్రీ.శ. 1240 నుండి 1750 వరకు వివిధ ఆదివాసి గోండు రాజులు పాలించారు. ఆదివాసీల స్వాతంత్రాన్ని కోరే ఆదివాసీ రాజ్ గోండులు రాజ్యస్థాపనకు కృషి చేశారు. "గోండ్వానా"ను ఆక్రమించదలచిన అక్బర్ 1564లో అసఫ్ ఖాన్ నాయకత్వంలో సైన్యాన్ని అక్కడకు తరలించాడు. అప్పటికి గోండ్వానాను కుమారుడు వీర నారాయణ తరుపున రాణి దుర్గావతి పరిపాలిస్తుంది. ఆమె గొప్ప ధైర్యశాలి, సమర్ధురాలు, దుర్గావతి మొగలుల సైన్యాన్ని వీరోచితంగా ప్రతిఘటించింది..


భారత దేశంలో స్వాతంత్య్ర్య ఉద్యమాలకు కొన్ని దశాబ్దాలకు పూర్వమే ఆదివాసులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. బ్రిటిష్ పాలనను భారత దేశంలో గల ఆదివాసీయేతర సమాజం ఆహ్వానించిన ఆదివాసులు మాత్రం ప్రతిఘటించారు. రవి అస్థమించని సామ్రాజ్యంలో ప్రపంచంలోని అన్ని ఖండాలను పరిపాలించారు. కాని ఎక్కడ ఎదురుకాని వ్యతిరేకత మన దేశంలోనే ఆదివాసీల పోరాటంతో వారికి అనుభవంలోకి వచ్చింది. క్రీ.శ.1874లోనే బ్రిటీషు ప్రభుత్వం ఆదివాసుల పోరాటాన్ని నిరోదించేందుకు కొన్ని సంస్కరణలు తీసుకువచ్చింది. ఆదివాసులు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాలను ప్రత్యేక ప్రాంతాలుగా ప్రకటిచింది.


ఉమ్మడి ఖమ్మం జిల్లా వరరామచంద్రపురం నందు అంబుల్ రెడ్డి నాయకత్వంలో గొడ్డలిపై పన్ను విధించిన బ్రిటిష్ ప్రభుత్వం పై తిరుగుబాటు చేశారు. ఇప్పటి విశాఖ, గంజాం జిల్లాల్లో గల ఆదివాసీలు తమ ప్రాంతంలోకి బ్రిటిష్ పాలన ప్రవేశించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి తిరుగుబాటు చేశారు. బ్రిటిష్ పాలకులు ఆదివాసీ పోడు వ్యవసాయంపై నిషేదం విధిస్తూ మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ 1882 తీసుకువచ్చి ఆదివాసీలపై ఆంక్షలు విధించారు. 1917 ఆగస్టు 14న బ్రిటీషు ప్రభుత్వం ఇప్పటి షెడ్యుల్డ్ ప్రాంతాలుగా పిలువబడుతున్న ఏజన్సీ ఏరియాలో భూ నిభంధన క్రమబద్ధీకరణ చట్టం (ల్యాండ్ రెగ్యులైజేషన్ యాక్ట్) 1917 ను తీసుకు రావడం జరిగింది. ఆదివాసీయేతరుల నుండి రక్షణగా ఈ చట్టం ఆదివాసులకు ఉంటుందని భావించింది. ఈ చట్టం ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాలో ప్రత్యేక కోర్టులను స్థాపించి ఆదివాసి, ఆదివాసీయేతరులకు మధ్య భూ బదలాయింపు జరగాలంటే ఏజెంట్ టు గవర్నమెంట్ (ప్రస్తుతం ప్రాజెక్ట్ ఆఫీసర్ గా పిలుస్తున్నాము) అనుమతి తప్పనిసరి అని అలా లేని బదలాయింపులు చెల్లవని స్పష్టం చేస్తుంది. ఇది ఏమాత్రం ఆదివాసులను ప్రభావితం చేయలేదు. వీరు సంపూర్ణంగా ఆదివాసులకు రాజ్యాధికారం కావాలని అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో "రంప తిరుగుబాటు" చేశారు. తమ ప్రాంతంలో బ్రిటీష్ వారు ఆకాంక్షలు విదించడాన్ని సహించలేదు. విరోచితంగా బ్రిటిష్ పాలకులను ఎదుర్కొన్నారు. ఇప్పటి తూర్పు గోదావరి పరిధిలో గల రంపచోడవరం పరిసర ప్రాంతంలో 1922-1924 వరకు ఆదివాసుల నుండి తీవ్ర ప్రతిఘటన బ్రిటిష్ సైన్యం ఎదుర్కొన్నది. నిజాం ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రాంతంలో గల ఆదివాసులపై ఆకాంక్షలు నిర్భంధాన్ని ఆదివాసులు తీవ్రంగా వ్యతిరేకించారు. కొమరం భీమ్ నాయకత్వంలో ఆదివాసులు రాజ్యాధికారం కొరకు ఉద్యమించారు. నిజాం ప్రభుత్వం ఆదివాసుల స్వాధీనంలో ఉన్న భూములకు వారికే హక్కు కల్పిస్తామని అన్నప్పటకి తమకు సంపూర్ణ రాజ్యాధికారం కవాలని నిజాం ప్రభుత్వంపై "లడాయి" చేయటానికే సంసిద్ధులు అయ్యారు. కొమరం భీమ్ అమరుడు అయినపుడు నిజాం ప్రభువు వారి పోరాటాన్ని గుర్తించి ఇంగ్లాండ్ దేశస్తుడు ప్రముఖ ఆంత్రోపాలజిస్ట్ హేమండార్ప్ ను ఆహ్వానించి ఆయా ప్రాంతాలలో పర్యటించి తనకు నివేదిక సమర్పించమని ఆదేశించాడు. హేమండార్ప్ సిఫారసులను అనుసరించి నిజాం ప్రభుత్వం "హైద్రాబాద్ ట్రైబల్ యాక్ట్ 1949 ని తీసుకువచ్చింది. ఇది బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన "భూ నిబంధన చట్టం 1917" లాంటిది. హేమండార్ప్ అప్పటి తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా ఇప్పటి ఆంధ్ర ప్రాంతాలలో గల ఆదివాసుల నివసిస్తున్న షెడ్యూల్డ్ ప్రాంతాల్లో పర్యటించి ఆదివాసులు ప్రాంతాలుగా వేరైనా, భావాలు ఒక్కటిగానే ఉన్నాయి, వారిపోరాటం ఎక్కడైన మనుగడ, రాజ్యాధికారం కొరకని వ్యాఖ్యానించారు. 


భారతదేశానికి స్వాతంత్ర్య అనంతరం ఆదివాసీల జీవితాలు పెనం మీదనుండి పొయ్యిలో పడ్డట్టు తయారైంది. దీనికి నేటి వరకు పాలకులు వారు అవలంభిస్తున్న విధానాలే కారణం. పాలకవర్గాలు ఆదివాసీ ప్రాంతాల్లో నిక్షిప్తమై ఉన్న ఖనిజ సంపదను, సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసి ఆదివాసులను నిర్వాసితులను చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు అలాగే సరిహద్దున గల మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా ఆదివాసీలు ఉన్న ప్రాంతంలో అటవీ, ఖనిజ సంపద పుష్కలంగా ఉంది. డొలమైట్, బాక్సైట్ తదితర ఖనిజాలు, భారీ నీటి ప్రాజెక్టులకోసం కావల్సిన గోదావరి, శబరి, మున్నేరు, ప్రాణహిత, కిన్నెరసాని, లాంటి నదులున్నాయి. వీటిని నమ్ముకొని తరతరాలుగా అదివానులు జీవనం సాగిస్తున్నారు. పాలకుల ఆవలంబిస్తున విధానాలతో ఆదివాసులు నిర్వాసితులవుతున్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల వందలాది ఆదివాసీ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. లక్షలాది మంది ఆదివాసులు నిర్వాసితులవుతున్నారు. జాతీయ అవసరాల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు నిక్షేపాలను వెలికితీసే కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని కొత్తగా ఓపెన్ కాస్ట్లు రానున్నాయి. అభయారణ్యం, టైగర్ జోన్, మైనింగ్ పేర్లతో ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ ఉమ్మడి రాష్ట్రంలో వరరామచంద్రపురం, చింతూరు, వరంగల్ జిల్లాలో తాడ్వాయి, ఏటూరినాగారం, విశాఖ జిల్లాలో, పాడేరు, ఉభయ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో వేలాది గ్రామాల ఆదివాసులు నిర్వాసితులవుతున్నారు.


 భారత రాజ్యాంగంలో 5వ, 6వ షెడ్యూళ్ళు ఆదివాసులకు రక్షణగా రూపొందించబడినవి. ఆదివాసీలకు స్వయం పరిపాలన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం "పెసా" చట్టాన్ని 1996లో రూపోందించిన దీన్ని రాష్ట్ర ప్రభుత్వం 1998లో చట్టబద్ధత చేసి గ్రామ సభలకే సర్వాధికారం కల్పించాయి. రాజ్యాంగ అధికరణ 244 కింద ఉదహరించబడిన ఆదివాసుల పరిరక్షణ నియమాల వంటి చట్టాలు, ఆదివాసుల పరిరక్షణ కోసం చేసిన చట్టాలను పాలకులు ఉల్లంగిస్తూ ఆదివాసులను బలిచేస్తున్నారు. అటవీ హక్కుల చట్టం- 2006ను సక్రమంగా అమలు చేయక పోవడం, నెహ్రూ పంచశీల సూత్రాలు, హేమండార్ప్ సిఫార్సులు, గిర్ గ్లాని నివేదిక, కొనేరు రంగరావు కమీషన్ సిఫారసులు ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. ఇప్పటి పాలకుల పరిపాలనలో ఆదివాసులు రక్షణ, భద్రత కరువై విభజనలతో విచ్చిన్నాలు కొనసాగుతూ అల్ప సంఖ్యాకులుగా మారుతూ తమ అస్థిత్వాన్ని, సంస్కృతిని, భాషని, జాతులను, సహజ సంపదను, భూభాగాన్ని గణనీయంగా కోల్పోయారు. చివరికి మనుగడకోసం పోరాడుతున్నారు. అంతరించిపోయే ప్రమాదపు అంచుల్లో ఉన్న ఆదివాసులు చారిత్రకంగా జరిగిన వంచన, దోపిడీ, అణచివేతను పునరావృతం కానీయకుండా ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు మరియు సరిహద్దున గల మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఒడిశాలోని ఆదివాసుల ప్రాంతాలనుకలుపుకొని ఆదివాసులకు "గోండ్వాన రాష్ట్రం" కావాలని డిమాండ్ చేస్తున్నారు. వారికి కేటాయించిన షెడ్యూల్డ్ ప్రాంతాలల్లో రాజ్యాధికారం కలిగి ఉండటం ద్వారా మాత్రమే వారి సమస్యలు పరిష్కారమవుతాయి, భారత రాజ్యాంగంలోని అధికరణ 29 (1) (ఆర్టికల్ 29 (1)ని అనుసరించి భారత భూభాగంలో ఏదో ఒక ప్రదేశంలో నివసిస్తున్న కొందరు ప్రజలు ఒక విలక్షణమైన భాషను గాని, లిపిని గాని లేక సంస్కృతిని గానీ కలిగి ఉన్నట్లయితే వారు ఆ భాష, లిపి, సంస్కృతిని పరిరక్షించుకునే హక్కును కలిగి ఉంటారు. ఆదివాసులు ప్రత్యేకమైన భాషను కలిగి యున్నారు. వీరి సంస్కృతి సంప్రదాయాలు ఆదివాసీయేతర సమాజంతో పోల్చితే ప్రత్యేకమైనది, వీరి జీవన శైలి విభిన్నమైనది. వాటిని కాపాడుకోవడం భారతరాజ్యాంగం ఆదివాసులకు కల్పించిన హక్కు ఆదివాసీ ప్రజల కొరకు భూమి కోసం, భుక్తి కోసం, నాటి నిరంకుశ బ్రిటిష్, నైజాం పాలన నుండి ఆదివాసుల విముక్తి కోసం పోరాడిన సమ్మక్క-సారక్క, కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో ఘంటం దొర, మల్లు దొర, కోయ బెబ్బులి సోయం గంగులు దొర పోరాటాలను, త్యాగాలను గుర్తు చేసుకుంటూ రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధనకై పోరాడుతూ నేడు ఆదివాసీలకు స్వయంపాలన రాజ్యాధికారం కలిగిన ప్రత్యేక "గోండ్వానా రాష్ట్రం" సాధించేందుకు సంసిద్ధులు అవ్వాలి....


*ఆగస్టు9 ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా*




వంకా వరాలబాబు ఎం.ఫిల్

పరిశోధక విద్యార్థి 

మద్రాస్ యూనివర్సిటీ

9948898639

Share it:

TS

Post A Comment: