CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సర్వేనెంబర్ 117 విలువైన ప్రభుత్వ భూమి కబ్జా.. నిద్ర నటిస్తున్న రెవిన్యూ శాఖ..! దొంగలకు సద్దులు మోస్తున్నది ఎవరు..?

Share it:


జూలూరుపాడు ఆగస్టు 23, (మన్యం మనుగడ ప్రతినిధి) :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం గుండెపుడి రెవిన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 117, లో గల 26 ఎకరాల సీలింగ్ ప్రభుత్వ భూమిని గుట్టు చప్పుడు కాకుండా కొందరు "గిరిజనేతరులు" అధికారులు, రాజకీయ నేతల అండదండలతో చట్టాలకు విరుద్ధంగా అదును చూసి, భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో అడ్డదారిన 26 ఎకరాల ప్రభుత్వ భూమిని తమ పేర్ల మీద పట్టాలు పొందినట్లు తెలుస్తోంది. అనంతరం రెండేళ్ల పాటు తెర వెనక ఉండి, ఈ ఏడాది యంత్రాల సహాయంతో గుట్టను చదును చేసి, ఉద్యానవన పంటలు సాగు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తుండడంతో భూభాగోతం వెలుగులోకి వచ్చింది. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసి గిరిజనులకు అన్ని అర్హతలు ఉండి తాతల కాలం నుండి పోడు సాగు చేసుకుంటుంటే దౌర్జన్యంగా వారి వద్ద నుండి భూమిని లాక్కుంటూ, వారిపై కేసులు పెడుతూ, విచక్షణారహితంగా కొడుతూ, ఇవి ప్రభుత్వ భూములని, పేదల వద్ద నుండి లాగేసుకుంటున్న ప్రభుత్వ అధికారులు. మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని దర్జాగా ఆక్రమించుకొని సాగుకు ఉపక్రమిస్తుంటే, ప్రభుత్వ భూములను కాపాడవలసిన అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంతకాలం రెవిన్యూ రికార్డుల్లో ప్రభుత్వ సీలింగ్ భూమి గా ఉండి, ఈ మధ్య కాలంలోనే హఠాత్తుగా అనర్హులైన గరిజనేతరులు రికార్డుల్లోకి ఎక్కి పట్టాలు ఎలా పొందారు అన్నది అర్థం గాని ప్రశ్నగా మిగిలింది. ఈ తతంగం అంతా కబ్జాదారులు, సంబంధిత శాఖ అధికారుల సమన్వయంతో కాసులకు కక్కుర్తి పడి విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమణదారులకు కట్టబెడుతున్నారనే వార్తలు వినబడుతున్నాయి. ఇదేవిధంగా గతంలో సర్వే నెంబర్ 36 లో గల 40 ఎకరాల ప్రభుత్వ భూమిని అడ్డదారిలో పట్టాలు పొంది ప్రభుత్వ పథకాల సొమ్మును పందికొక్కుల మేస్తున్న విషయం వెలుగులోకి వచ్చి జిల్లాలో సంచల వార్తగా మిగిలింది. అప్పుడే వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఉన్నట్లయితే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి వీరి వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు..? ఈ దొంగలకు సద్దులు మోస్తున్నది ఎవరు..? ఇంత జరుగుతున్న సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనక ఆంతర్యమేమిటి అనే విషయాలు తెలియాల్సి ఉంది. రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించి దొరలకు ఇచ్చిన దొంగ పట్టాలను రద్దు  చేయాలని, లేనియెడల రాజకీయ పార్టీలు, గిరిజన సంఘాలు, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి భూకబ్జాదారులనుండి ప్రభుత్వ భూములను కాపాడి, ప్రభుత్వ, ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: