CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెలంగాణ సాయుధ పోరాటంలో కోయ బెబ్బులి (సోయం గంగులు దొర).

Share it:



ఆదివాసీ సమాజానికి ఆరాధ్యుడు. పెత్తందారులకు బెత్తందారుడు. రజాకార్లపై రంకెలు వేసి వారి పనిపట్టిన రౌద్రుడు.
పచ్చని అడవితల్లిని పరాయికరణ జరగకుండా రక్షణగా నిలిచిన యోధుడు.
 మన్యం ప్రజలకు ఆశాజ్యోతి.
 బానిస వ్యవస్థ సంకేళ్ళు తెంచిన ఘనుడు.
 ఆదివాసుల్లో చైతన్యం నింపి జాతి అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కృషి చేసిన ధీరుడు.
 అష్టవిద్యలు నేర్చిన నైపుణ్యుడు. ఆరడుగుల ఆజానుబావుడు. సాహసాల శూరుడు మన సోయం గంగులు దొర. ఆదివాసీ గూడేలలోని ప్రజలంతా సోయం గంగులు ను డువ్ అని పిలుచుకునేవారు (డువ్ అంటే కోయ బాషలో పులి అని అర్థం ).

 ప్రపంచ చరిత్రలో ఆదివాసీ పోరాటాలు అనన్యమైనవి. "భూమి కోసం, భుక్తి కోసం, దోపిడీదారుల పీడన శక్తుల నుండి విముక్తి కోసం, ఆదివాసీలు చేసిన స్వయంపాలన ఉద్యమాలు చరిత్రలో విస్మరించబడటం నేటి పాలకులు చరిత్రకారుల దౌర్భాగ్యస్థితిని గుర్తు చేస్తున్నాయి. ఇంకా చరిత్ర పుటల్లో చివరి మజిలీగా ఆదివాసీల త్యాగాలు మిగిలాయి. అనామకంగా మిగిలిన వారిలో రాంజీ గోండు, కొమురం సూరు, గుండాధర్, గంటందొర, మల్లు దొర వంటి యోధుల వరుసలో సోయం గంగులు దొర కూడా భవిష్యత్ తరాలకు గుర్తు లేకుండా పోయారు. ఫ్యూడల్ భూ సంబంధాల సమూల మార్పు కోసం తెలంగాణలో 1946 నుండి 1951 వరకు సాగిన సాయుధ పోరాటం ఒక సామాన్యుడిని సాహస యోధుడిగా మార్చింది. మట్టి నుండి మాణిక్యాలు వెలికి తీసినట్టు ఆదివాసీ గూడేం నుండి మహాయోధుడిగా ఎదిగిన ఆ భూమి పుత్రుడే ఉద్యమ ప్రస్థాన కోయబెబ్బులిగా ప్రసిద్ధి చెందాడు సోయం గంగులు దొర. నిజాం పరిపాలనలో ఉన్నటువంటి పాల్వంచ (పాత తాలూకా) ఫరిధిలో దట్టమైన అటవీప్రాంతంలో తిరుగులేని నాయకుడు సోయం గంగులు దొర. ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం జమేందారుబంజర అనే కోయగూడెంలో సోయం రాముడు, పాపమ్మ దంపతులకు (1919) జన్మించాడు. గంగులు వ్యక్తిత్వం గానీ, పోరాట నాయకత్వం గానీ, శౌర్య పరాక్రమాలు గానీ, కోయ, గిరిజనుల్లో ఆయనపై గల అపార ఆదరాభిమానాలు గానీ ఎవరు ఇప్పుటి వరకు చిత్రించలేకపోయారు. గంగులు ఉద్యమ జీవితం ముఖ్యంగా మూడు దశల్లో కోనసాగినట్లు తెలుస్తోంది. మొదటి దశలో గోదావరి తీరాన పేరాంటాలపల్లి వద్ద ఆశ్రమం నిర్మించుకున్న బాలానందస్వామి కనుసన్నల్లో పూరేం సింగరాజు నాయకత్వంలో నడిచిన నిజాం వ్యతిరేకపోరాటంలో సోయం గంగులు దళనాయకుడిగా కీలక బాధ్యతలు చేపట్టారు. రెండో దశలో కమ్యూనిస్టులతో (1947-48) కలిసి పాల్వంచ ఆటవీ ప్రాంతాన్ని కమ్యూనిస్టుల కంచుకోటగా మార్చడంలో కీలక భూమిక పోషించాడు. మలిదశలో జలియన్ వాలాబాగ్ దురంతంలాంటి పోలీసు చర్య ముసుగులోనూ మూడేండ్లపాటు కమ్యూనిస్టుల ఏరివేత, వందల మందిని ఊచకోత సాగించిన యూనియన్ సైన్యంపై పక్కా ప్రణాళికతో మెరుపు దాడులు చేశాడు సోయం గంగులు. రజాకార్లను ముప్పుతిప్పలు పెట్టి వారి యొక్క అకృత్యాలకు అడ్డుకట్ట వేయడం జరిగింది.


 సోయం గంగులు నిండు యవ్వనంలో తన యొక్క ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. గోదావరి తీరంలోని వేలేరుపాడు మండలం పేరంటాలపల్లిలో బాలానందస్వామి ఒక ఆశ్రమాన్ని నిర్మించి కూనవరం, కట్కూరు పరిసరాల్లోని కొండారెడ్డి, కోయ సమాజానికి విద్యాబుద్ధలు నేర్పుతూ, వారికి తిండి గింజలు పంచి పెడుతూ ఆదుకుంటున్నాడు. ఆ స్వామి అనుచరుడైన పూరేం సింగరాజు మాత్రం ఆదివాసీ యువకులను సమీకరించి రాజకార్లతో పోరాడుతున్నాడు. సాంప్రదాయక శిస్తులు (పుల్లరి), ఆక్రమలెవీ సేకరణ, వర్తక మోసాలను నిరసిస్తూ బాణం, కత్తి, వడిసెల వంటి ఆయుధాలతో నిజాం వ్యతిరేక పోరాటానికి పూనుకున్నాడు పూరేం. సింగరాజు. నిజాం నిరంకుశత్వాన్ని ప్రచారం చేస్తూ, మరోపక్క పేదల ఆస్తులు దోచుకోవడం, భూస్వాముల నుండి చందాలు, దొంగచాటు కలప వ్యాపారం వంటి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి చివరకు యూనియన్ సైన్యంలోకి పారిపోయాడు. ఇలా పూరేం సింగరాజు ప్రస్థానం ముగిసింది. అనతి కాలంలోనే కమాండర్ గా ఎదిగిన సోయం గంగులు 1948 మార్చిలో పాల్వంచ ఏరియాలోకి ప్రవేశించిన కమ్యూనిస్టు దళంలో చేరిపోయాడు. గంగులు పార్టీలో చేరిన తర్వాతే కాస్త చదువుకోవడంతో సీపీఐ కమిటీలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవాడు. చురుకైన యువతతో గ్రామ కమిటీలు నిర్మించాడు. కూలీరేట్ల పెంపు, పాలేర్ల జీతాల పెంపు, భూస్వాముల పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా, అక్రమ లెవీ సేకరణకు, అటవీ శాఖ కాజేసే పుల్లర్లకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నడిపాడు. పార్టీలో సెంట్రల్ కమాండర్ గా ఎదిగాడు. గెరిల్లా దళాల నిర్మాణంలో గంగులు కీలకపాత్ర పోషించంతో పాల్వంచ జంగల్ పూర్తిగా కమ్యూనిస్టుల సురక్షిత స్థావరంగా మారింది. సోయం గంగులు పోరాట ఫలితంగా సువిశాల పాల్వంచ రూపురేఖలు మారాయి. గంగులు దమ్మపేట కేంద్రంగా ఒక చెట్టు వద్ద ఉద్యమ జెండాను పాతాడు. రుద్రాక్షపల్లిలో ఒక ప్రజా కంటక భూస్వామిని అంతమొందించాడు. దీంతో భూస్వాములు గూడేలను వదిలి పారిపోయారు. ఆటవీ, రెవెన్యూ శాఖల జులుం నశించింది. అన్ని శిస్తులు రద్దయ్యాయి. భూమి, అడవిపై హక్కు లభించింది. స్వాతంత్ర్యానంతరం తెలంగాణ మాత్రం భారత యూనియన్ లో విలీనం కాలేదు. ఈ నేపథ్యం ఏర్పడినా లోనే 1948 సెప్టెంబర్ 13న యూనియన్ ప్రభుత్వం "జాయిన్ ఇండియా" పేరిట నిజాం ప్రభుత్వంపై సైనిక దాడికి దిగింది. ఆధునిక ఆయుధాలతో 50 వేల మంది సైనిక బలగాలు మేజర్ జె. ఎన్ చౌదరి నేతృత్వంలో నిజాం భూభాగాన్ని చుట్టుముట్టడంతో 1948 సెప్టెంబర్ 17న నిజాం సర్కార్ లొంగిపోయింది. తెలంగాణలో వెల్లోడి నేతృత్వంలో సైనిక పాలన విధించబడింది. ఆదివాసీ గూడేల నుండి భూస్వాములు పారిపోయి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రతీకారంగా 1948 నుండి 51 వరకు భారత యూనియన్ సైనికులు ఇల్లందు, పాల్వంచ, దమ్మపేట, బూర్గంపాడు, వేలేరుపాడు ప్రాంతాలలోని విప్లవకారులను, సానుభూతిపరులను సామాన్యులను చిత్రహింసలు పెట్టారు. తెలంగాణ ప్రజల పై ఆదివాసీ సమాజంపై భారత సైన్యం విశృంఖలంగా, వికృతంగా దాడులు చేసింది. ఆ క్రమంలోనే పాల్వంచ ఏరియాలో ఉద్యమాన్ని అణచివేయలంటే సోయం గంగులును మట్టుబెడితేనే తప్ప పైచేయి సాధించలేమని భూస్వాములు, రాజకీయ నాయకులు, పోలీసు, మిలిటరీ భావించింది. అందుకు ఆంధ్రా సరిహద్దులోని జీలుగుమిల్లి (ప.గో)ని ఆనుకొని ఉన్న పాలచర్లకు చెందిన గంగులు సమీప బంధువైన వగ్గేల చంద్రమ్మను పావుగా వాడుకున్నారు. 1951 మే 11న పాలచర్ల వెళ్లిన గంగులును చంద్రమ్మ మాటల్లో పెట్టి జీలుగుకల్లులో మత్తు మందు కలిపి అతని చేత తాగించింది గంగులు స్పృహ కోల్పోయిన తర్వాత అక్కడే గుంట నక్కల మాటు వేసిన సైన్యం గంగులును బంధించి పార్టీ రహస్యాలు చెప్పమని గంగులును చిత్రహింసలు పెట్టింది. అయినా ఏ విషయం బయటికి పొక్కలేదు. దమ్మపేటలో గంగులు కట్టిన జెండాను విప్పడానికే దమ్ముచాలని సైనికులు పిరికిగా బంధించి రుద్రాక్షపల్లిలోని రావిచెట్టుకు ఆ వీరున్ని కట్టివేసి1951 మే 12న కాల్చిచంపి నిస్సిగ్గుగా ఎదురు కాల్పులుగా చిత్రీకరించారు. సాహస వీరుడైన సోయం గంగులు రజాకార్లను ఎదిరించిన పోరాటం గురించి అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. నైజాం నవాబుతో, భూస్వామ్య పెత్తందార్లతో పోరాడుతూ 32 ఏండ్లలోనే అమరుడయ్యాడు. ప్రభుత్వం ఆ కుటుంబానికి ఇప్పటి వరకు స్వాతంత్ర్య సమర యోధులకు ఇస్తున్నటువంటి పింఛను కల్పించలేదు. 68 ఏండ్లు దాటినా గంగులు వారసులైన సోయం రాములు, వెంకటేశ్వర్లు, పోతురాజులు నేటికీ సాధారణ వ్యవసాయ కూలీలుగా బతుకుతున్నారు. రంపచోడవరం, మారేడుమిల్లి, బుట్టాయగూడెం ప్రాంతాల్లో అల్లూరి సీతారామరాజుతో కలిసి గంగులు మన్యం పోరాటంలో పాల్గొన్నట్టు చరిత్ర చెబుతోంది. గంగులు దొర జీవిత చరిత్రను వెలుగులోకి తేవాలి. నేడు అభివృద్ధి పేరిట పాలక ప్రభుత్వాలు అడవి బిడ్డలపై నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్నాయి పోలవరం, కంతనపల్లి ప్రాజెక్టులు, టైగర్ జోన్ లు, ఓపెన్ కాస్ట్ లు వల్ల కోయ గిరిజనులు నిర్వాసితులు కాకుండా, అలాగే యురేనియం తవ్వకాల వల్ల చెంచులు సంక్షోభంలో చిక్కుకోకుండా పచ్చని ప్రకృతితో కూడిన అడవి తల్లిని విద్వాంసం కాకుండా నేటి ఆదివాసీ సమాజం తమ మనుగడ కోసం ఉద్యమిస్తేనే మహాజ్యాల సమాజాన్ని స్వప్నించిన ఆ మహాయోధుడు సోయం గంగులు దొరకు ఘన నివాళి అర్పించినట్లవుతుంది.


 మే 12 మన్యం పులి సోయం గంగులు దొర (డువ్) 71వ వర్థంతి సందర్భంగా




వంకా వరాలబాబు, ఎం.ఫిల్
పరిశోధక విద్యార్థి,
మాద్రసు యూనివర్సిటీ
Share it:

TS

Post A Comment: