న్యూఢిల్లీ: రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇప్పటికే రైతుల ఆందోళనలతో కేంద్రం నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నదని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశ ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతున్నదని విమర్శించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ దీక్ష ఏర్పాట్లను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీలు సురేశ్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాతో కలిసి ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం రైతు మద్దతు చర్యలతో తెలంగాణ హరిత ప్రదేశంగా మారిందని చెప్పారు. ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణ కేంద్ర పభ్రుత్వ బాధ్యత అని చెప్పారు.
రాష్ట్రంలో పంటల దిగుబడి రెండు రెట్లు పెరిగిందన్నారు. తెలంగాణలో పండిన ప్రతి ధాన్యపు గింజను కేంద్రం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులు ఢిల్లీ రోడ్లపై ఆందోళనకు సిద్ధమయ్యారని చెప్పారు. ధాన్యం సేకరణపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ డిమాండ్ చేస్తున్నారని వెల్లడించారు. జాతీయ స్థాయిలో సమగ్ర ధాన్యం సేకరణ విధానం కొనసాగాలన్నారు.
కేంద్రం విఫలం.. ఎంపీ సురేశ్ రెడ్డి
ధాన్యం కొనుగోలును డిమాండ్ చేస్తూ ఢిల్లీ కేంద్రంగా రేపు భారీ ధర్నా చేస్తామని ఎంపీ సురేశ్ రెడ్డి అన్నారు. జాతీయ స్థాయిలో ఒకే ధాన్యం సేకరణ పాలసీ ఉండాలన్నారు. సమాఖ్య స్ఫూర్తిని కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు. కేంద్రం తీరుకు నిరసనగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆందోళన చేస్తున్నామన్నారు.
ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం: వినోద్ కుమార్
కేంద్రంలోని మోదీ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వమని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ విమర్శించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ మాట తప్పారని విమర్శించారు. రాష్ట్రంలో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయాలని గత ఆరు నెలలుగా సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఎన్నిసార్లు చర్చించినా కేంద్ర వైఖరి మారడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధాన్యం సేకరణంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఢిల్లీ కేంద్రంగా రేపు భారీ ధర్నా చేస్తున్నామని వెల్లడించారు.
Post A Comment: