CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అధిక ధరలను నియంత్రించాలంటూ కాంగ్రెస్ భారీ ర్యాలీ.-పెట్రోలియం ఉత్పత్తులు, విద్యుత్, ఆర్టీసీ చార్జీలు తగ్గించాలి..

Share it:


  • పోడు భూములకు పట్టాలివ్వాలి
  •  కాంగ్రెస్ పార్టీ డిమాండ్


 మన్యం మనుగడ, అశ్వారావుపేట: పెంచిన పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని, విద్యుత్ చార్జీలు ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని, ఏజెన్సీలో పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అశ్వారావుపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జేష్ఠ సత్యనారాయణ చౌదరి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి సంబంధిత అధికారులకు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. పెంచిన పెట్రోలియం ఉత్పత్తులు, విద్యుత్ ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక వెంకట దుర్గా థియేటర్ నుండి గ్యాస్ సిలిండర్ ను రిక్షా మీద ఉంచి పువ్వులతో అలంకరించి వినూత్న రీతిలో భారీ ప్రదర్శన సంత మార్కెట్ మీదుగా రింగ్ రోడ్ సెంటర్ నుండి పేరాయి గూడెం మీదుగా స్థానిక తహశీల్దార్ కార్యాలయం చేరుకొని ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ నాయకులు జేష్ఠ సత్యనారాయణ చౌదరి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రజల నిత్యవసర సరుకులు, వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్ ఆర్టీసీ, చార్జీలు విద్యుత్ చార్జీలు, తమ ఇష్టా రీతిన పెంచి పేద మధ్య తరగతి వర్గాల పై అధిక భారాన్ని మోపడం చాలా దారుణం అని వారు విమర్శించారు. మూడు సంవత్సరాలుగా కరోనా కష్టకాలంలో అనేక కష్టనష్టాలకోర్చి ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న సమయంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మరొకసారి ధరలు విపరీతంగా పెంచటం వలన సామాన్య మధ్య తరగతి ప్రజలు బ్రతికే పరిస్థితి లేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరొక మాట మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అదే విధంగా విద్యుత్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు పెంచటం హేయమైన చర్య అని వారన్నారు. 40 ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటున్న పోడు సాగు దారులకు పట్టాలు ఇస్తానని నమ్మబలికి మరొకవైపు కందకాలు తవ్వుతూ ఏజెన్సీ ఏరియా గిరిజనులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వారు విమర్శించారు. 2005 అటవీ హక్కు చట్టం ప్రకారం గిరి నెలకు పట్టాలు ఇవ్వాల్సి ఉండగా అప్పుడు తప్పించుకొని ఇప్పుడు మాట మార్చి పోడు భూములను లాక్కోవడానికి చూస్తున్నారని, అందుకే ఒకవైపు దరఖాస్తులు పెట్ట మంటూ, మరొకవైపు ఫారెస్ట్ అధికారులు ఉసిగొల్పి గిరిజనులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని, ఆర్టీసీ విద్యుత్ చార్జీలను తగ్గించాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని లేనిచో ఉద్యమాన్ని ఉధృతం చేసి టిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. *ప్రభుత్వాలది ద్వంద వైఖరి : పేటేటి నరసింహారావు* కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ ప్రజలను మోసం చేయడానికి చూస్తున్నారని అధిక ధరలను నియంత్రించ లేక కెసిఆర్ ప్రభుత్వం కేంద్రంపై అబండాలు వేస్తుందని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సరిగా పని చేయట్లేదనే విమర్శలు గుప్పిస్తున్నారని ఇద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రభుత్వాలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. *అధికారులకు వినతి పత్రాలు* పెంచిన కరెంటు చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ ఏడి కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఏజెన్సీ ఏరియాలో దశాబ్దాలుగా సాగుతున్న పోడు భూములలో కందకాలు త్రవ్వడాన్ని ఆపేయాలని, ప్రభుత్వాలు స్వీకరించిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అబ్దుల్ రెహమాన్ కు వినతిపత్రం సమర్పించడం జరిగింది. పెంచిన అధిక ధరలు నియంత్రించాలంటూ పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్,ఆర్టీసీ, కరెంటు చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్థానిక తాసిల్దార్ చల్లా ప్రసాద్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసం శ్రీను, ఆరేపల్లి రాంబాబు మారబోయిన హరిబాబు ఉదయ్ కుమార్, దాసరి నాగేంద్ర, మాలోతు రాము, ఎస్కే అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: