CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రసంగ పాఠం.

Share it:

 


• నేడు 21 సంవత్సరాలు పూర్తి చేసుకొని 22వ సంవత్సరంలోకి టీఆర్ఎస్ పార్టీ అడుగిడుతున్న సందర్భంలో మీ అందరికీ పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు

• 80 శాతం మంది పరిపాలనలో భాగస్వాములుగా ఉన్న ప్రజాప్రతినిధులతో, 60 లక్షల మంది పార్టీ సభ్యులతో, సుమారు 1000 కోట్ల ఆస్తుల రూపంలో కలిగి ఉన్నటువంటి సంస్థగా అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి రాష్ట్ర సాధన జరిపి, సాధించుకున్న రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దుతున్నటువంటి సమర సైనికులు, కాపలాదారుల పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ.

• ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పెట్టని కోట. ఎవరు కూడా బద్దలు కొట్టలేని కంచు కోట

• టీఆర్ఎస్ పార్టీ ఏ వ్యక్తిదో, శక్తిదో కాదు యావత్ తెలంగాణ ప్రజల ఆస్తి

• నిండైనటువంటి, మెండైనటువంటి శక్తితో అనుక్షణం తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేటువంటి కాపలాదారు టిఆర్ఎస్ పార్టీ.

• రెండు దశాబ్దాల క్రితం ఏడుపు వస్తే కూడా ఎవరిని పట్టుకొని ఏడవాలో తెలియనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రానిది. దుఃఖం వస్తే ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి. 

• నాడు రాష్ట్రానికి ఒక సంస్థ లేదు. ఒక పార్టీ లేదు. ఒక నాయకత్వం లేదు.

• దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో ఉవ్వెత్తున తెలంగాణ ప్రజల గుండెల్లోంచి ఎగిసిపడిన ఈ తెలంగాణ పతాకం టిఆర్ఎస్ పార్టీ.

• రాష్ట్ర సాధనలో అనేక అవమానాలు, అనేక ఒడిదుడుకులు, ఛీత్కారాలు, అనేక విజయాలు, అపజయాలు

• అన్నింటి సమాహారంగా రాష్ట్రాన్ని సాధించిన విషయం మనందరికీ తెలుసు

• రాష్ట్ర సాధన తర్వాత ప్రజల దీవెనలతో, ఆశీర్వాదంతో అద్భుతమైన పరిపాలన అందిస్తూ దేశానికే ఒక రోల్ మోడల్ గా పరిపాలన కొనసాగుతున్న విషయం కూడా మనందరికీ తెలుసు.

• రాష్ట్రం సాధిస్తున్న విజయాలను మనకు మనం పొగుడుకోవాల్సిన అవసరం లేదు. 

• కేంద్రం వెలువరిస్తున్నటువంటి ఫలితాలు, అవార్డులు, రివార్డులే దానికి తార్కాణం అని నేను మనవి చేస్తున్నాను. 

• నిన్న కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిన ప్రకటనలో దేశంలో అతి ఉత్తమమైనటువంటి 10 గ్రామాలేవంటే, 10 గ్రామాలకు 10 గ్రామాలే తెలంగాణ నుండి నిలిచాయి. మరో 20 గ్రామాలు తీసుకొని పరిశీలన చేస్తే 20 లో 19 గ్రామాలు ఉత్తమమైన గ్రామాలుగా తెలంగాణ రాష్ట్రం నుండి నిలిచాయి.

• తెలంగాణ పనితీరుకు ఈ ఫలితాలు మచ్చుతునక వంటివి

• తెలంగాణలోని ప్రభుత్వ డిపార్ట్ మెంటుల్లో అవార్డులేనటువంటి, అవార్డు రానటువంటి డిపార్ట్ మెంటే లేకపోవడం రాష్ట్రానికి గర్వకారణం.

• నిబద్ధతో, అవినీతిరహితంగా, పట్టుదలతో, లక్ష్యశుద్ధితో, చిత్తశుద్ధితో, సందర్భశుద్ధితో కార్యాచరణ గావిస్తున్నాం.

• ఒకనాడు కరువు, కాటకాలకు ఆలవాలమైన తెలంగాణ నేను జలభాండాగారంగా రూపుదిద్దుకున్నది.

• కాళేశ్వరంలో మల్టీ లెవల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం అని చెప్పి అంతర్జాతీయ ఛానళ్ళు కథనాలు వెలువరిస్తూ ఉన్నాయి.

• పాలమూరు-రంగారెడ్డి, సీతారామ రెండు ప్రాజెక్టులు మనం పరిపూర్తి చేసుకుంటే నలుచెరుగులా అద్భుతమైనటువంటి పసిడిపంటలతో అలరారే తెలంగాణ త్వరలోనే సాకారం కాబోతున్నదని నేను మీకు మనవి చేస్తున్నాను. 

• కారుచీకట్ల నుండి వెలుగుజిలుగుల తెలంగాణను ఏర్పాటు చేసుకున్నాం.

• తాగునీటిరంగంలో, సాగునీటి రంగంలో, విద్యుత్తు రంగంలో, సంక్షేమరంగంలో ఇలా ఏ రంగం తీసుకున్నా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించాం. దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచాం.

• ఎందరో మహానుభావులు, పార్టీకి అంకితమై పనిచేసే నాయకులు, కార్యకర్తలు, అందరి సమిష్టి కృషి యొక్క సమాహారమే ఈ ఫలితం

• ఒక మంత్రి అవినీతికి పాల్పడి పదవి కోల్పోతే వికెట్ నెంబర్ 1 పోయిందని పేపర్ వాళ్ళు రాసేది. కానీ ఆ రకంగా పోయే వికెట్లు తెలంగాణ మంత్రవర్గంలో లేవని నేను మనవి చేస్తున్నాను.

• కర్నాటక రాష్ట్రంలో ఓ మంత్రి అవినీతికి పాల్పడి పదవి కోల్పోవడం మనం ఈ మధ్యకాలంలో చూశాం. అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో లేవు.

• ప్రజలే కేంద్ర బిందువుగా, ప్రజల సమస్యలే ఇతివృత్తంగా, వాటి పరిష్కారమే ధ్యేయంగా, తద్వారా అందరి యొక్క సమున్నత జీవితమే ఏకైక లక్ష్యంగా మనం పనిచేయడం వల్ల అద్భుతాలు సాధించాం.

• రెవెన్యూ రంగంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. ఇది తెలంగాణ ప్రభుత్వ కృషి.

• ఇంకా సాధించాల్సింది చాలా ఉంది.

• తెలంగాణ వచ్చే క్రమంలో చాలా సందర్భాలు, చాలా జ్ఞాపకాలు. ఢిల్లీలో తుగ్లక్ రోడ్డులో ఎన్నో రాత్రులు, ఎన్నో రోజులు నిద్ర లేకుండా గడిపిన సందర్భాలు.

• తెలంగాణ రాష్ట్రం వస్తే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఏం చేయాలి. మన ప్రయాణం ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి. ఏ రకమైన అవరోధాలున్నాయి. ఏ రకమైన అవకాశాలున్నాయనే అనేకమైనటువంటి మేధోమథనం ఆనాటి నుండి ఈ నాటి వరకు మనం చేసుకోగలిగాం.

• ఎన్నో రాష్ట్రాలను అధిగమించి తలసరి ఆదాయంలో మన ఆదాయాన్ని మనమే రెట్టింపు చేసుకొని 2 లక్షల 78 వేల రూపాయలకు చేరుకున్నాం.

• తలసరి విద్యుత్ వినియోగంలో, జీరో ఫ్లోరైడ్ కలిగిన రాష్ట్రంగా, ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి మంచినీరు అందించడంలో, ఇలా అనేక రంగాల్లో తెలంగాణ నెంబర్ పురోగమిస్తున్నది. 

• మనం పండించే ధాన్యాన్ని కేంద్రం కొనలేని అశక్తతను ప్రదర్శించే స్థాయికి మనం ఎదిగామంటే ఏ స్థాయికి తెలంగాణ వ్యవసాయం విస్తరించిందో, ఏ విధంగా తెలంగాణ పచ్చని పైర్లతో అలరారుతుందో అలవోకగా అర్థం చేసుకోవచ్చని మీకు మనవి చేస్తున్నాను. 

• రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపి), దేశ జిడిపి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ.

• తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు జీఎస్డీపి సుమారు 5 లక్షల కోట్లుగా ఉండేది. కానీ నేడు రెట్టింపు చేసుకొని 11 లక్షల 50 వేల కోట్లకు చేరుకున్నది. 

• అద్భుతమైన గ్రోత్ తో మనం ముందుకు పోతున్నాం.

• ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 33 గవర్నమెంట్ కాలేజీలు ఏర్పాటవుతున్నాయి.

• సుమారు 2.5 లక్షల పై చిలుకు ప్రభుత్వ ఉద్యాగాలు కల్పించిన రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే.

• ఇదే స్ఫూర్తితో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. 

• మన రాష్ట్రం దేశంలో ఒక భాగం. టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిన స్థాయిలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పనిచేసుంటే మన జీఎస్డీపి 11.5 లక్షల కోట్లు కాదు 14.5 లక్షల కోట్లుగా ఉండేది. ఇది నేను చెప్తున్న లెక్క కాదు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా చెప్తున్న లెక్క. ఆర్థిక నిపుణులు చెప్తున్న లెక్క.

• మనం చేసిన స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పనిచేయలేదు. పని చేయడం లేదని చెప్పడానికి ఇదొక ప్రబల తార్కాణం.

• ఈరోజు కేసీఆర్ దేశ రాజకీయ గురించి ప్రస్తావన చేస్తారని, జాతీయ రాజకీయాల గురించ ప్రస్తావన చేస్తారనే మాటలు మీడియాలు చెప్తున్నాయి.

• 75 ఏండ్ల స్వాతంత్ర్యంలో ఏం జరిగిందో ఈ దేశ వాసులందరికీ తెలుసు.

• ఏ పద్ధతిలో స్వాతంత్ర్య ఫలాలు ప్రజలకు లభించాలో ఆ పద్ధతిలో లభించలేదు.

• పెడధోరణులు మరింత ప్రబలిపోతున్నాయే తప్ప మంచిదారులువ కానరావడం లేదు

• ఇటీవల కాలంలో దేశం అవాంఛీనయమైన, అనారోగ్యకరమైన జాడ్యాలు, పెడధోరణులు దేశంలో ప్రబలుతున్నాయి.

• భారత సమాజం శాంతి, సహనాలకు ఆలవాలమైన సమాజం. 

• ఇంత అద్భుతమైన దేశంలో కొందరు దుర్మార్గమైన, సంకుచితమైన, ఇరుకైన విధానాలు దేశ ఉనికినే ప్రశ్నించే స్థాయికి, దేశ గరిమకు గొడ్డలి పెట్టులా, ఆశనిపాతంలో దాపురించే స్థాయికి మనం పోతున్నాం.

• మరి ఈ సమయంలో ఒక రాజకీయ పార్టీగా, ఒక రాష్ట్రంగా మనం ఏ చేయాలి. మన కర్తవ్యం ఏమిటి. ఏ రకమైన పద్ధతుల్లో మన ప్రవర్తన ఉండాలి. మన ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి. మన పాత్ర పోషణ ఏ విధంగా ఉండాలి అని చెప్పి, మనం కచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 

• తీసుకున్న నిర్ణయాన్ని దేశ అభ్యున్నతి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పదలుచుకున్నాను.

• ఈ రోజు దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి సామర్థ్యం 4,01,035 మెగావాట్ల విద్యుచ్ఛక్తి మనదేశంలో అందుబాటులో ఉంది.

• అభివృద్ధికి సంకేతాలుగా, ప్రగతికి నిదర్శనాలుగా భావించే పారా మీటర్స్ లో తలసరి విద్యుత్ వినియోగం ఏ దేశంలో ఎక్కువ, ఏ రాష్ట్రంలో ఎక్కువ అని ప్రప్రథమంగా కొలిచే కొలమానం విద్యుచ్ఛక్తి.

• దేశంలో 4,01,035 మెగావాట్ల విద్యుచ్ఛక్తి అందుబాటులో ఉన్న దాన్ని వినియోగించలేని అశక్తత కేంద్ర ప్రభుత్వానిది. 

• భారతదేశం ఏ ఒక్క రోజు 2 లక్షల మెగావాట్లకు మించి విద్యుచ్ఛక్తి వాడటం లేదు.

• ప్రధానమంత్రి గారి స్వరాష్ట్రమైన గుజరాత్ లో కూడా భయంకరమైన విద్యుత్ కోతలు. ఎండిపోతున్న పంట పొలాలు, రైతుల రాస్తారోకోలు.

• విద్యుత్ కోతలు లేని రాష్ట్రమే లేదు. అప్రకటిత, ప్రకటిత విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడని ప్రజలే లేరు.

• చుట్టూ అంధకారం ఉంటే ఓ మణిదీపంలా తెలంగాణ వెలుగుతున్నదని నేను గర్వంగా చెప్తున్నాను.

• ఏడేండ్ల క్రితం మనది కూడా అంధకారమే. మనవి కూడా భరించలేని కోతలే.

• నేడు వెలుగు జిలుగుల తెలంగాణ ఎట్లా తయారైంది. ఇదే పని భారతదేశంలో ఎందుకు జరగలేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను.

• తెలంగాణ పనిచేసిన స్థాయిలో దేశం పనిచేయడం లేదు.

• తెలంగాణ స్థాయిలో దేశం పనిచేసి ఉంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ముంబాయి నుంచి కలకత్తా వరకు లభించి ఉండేది.

• దేశం చీకట్లో ఎందుకు మగ్గాలి. ఇది భారతీయల ఖర్మనా, వారి ప్రాప్తా. దీనికి సమాధానం చెప్పే వారెవరు.

• ఇదే విషయాన్ని నేను అందరు ముఖ్యమంత్రలు సమక్షంలో, కేంద్రమంత్రివర్గం సమక్షంలో, కేంద్ర అధికారుల సమక్షంలో, ప్రధానమంత్రి సమక్షంలో నీతిఆయోగ్ సమావేశంలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన విషయాన్ని మనవి చేస్తున్నాను.

• మా మార్గంలో పయనించండని చెప్పాం. కానీ లాభం లేదు.

• ఈ దేశంలో సజీవంగా ప్రవహించే నదుల్లో నీటి లభ్యత 65 వేల టిఎంసీలు. ఇంకా 4, 5 వేల టిఎంసీల నీటి లెక్కలు తేలాల్సి ఉంది. టిబెట్ నుంచి వచ్చే నీటి లెక్కలు అంతర్జాతీయ వివాదంలో ఉన్నాయి.

• ఇప్పటివరకు కట్టిన ప్రాజెక్టులు, జరిగిన ప్రయత్నాలలో 25 వేల టిఎంసీలు లేదా 30 వేల టిఎంసీల లోపే దేశం వాడుకుంటున్నది.

• కానీ దేశంలో ఎక్కడ చూసినా నీటి యుద్ధాలు. దీనికి కారణం ఎవరు.

• ఈ విషయాన్న నేను ప్రధానమంత్రి గారితో, నీతి ఆయోగ్ మీటింగ్ లో కుండబద్దలు కొట్టినట్లు ప్రశ్నించాను.

• కావేరి జలాల కోసం కర్నాటక, తమిళనాడు యుద్ధం. సింధు జలాల కోసం రాజస్థాన్, పంజాబ్, హర్యానాలు ప్రతీరోజు యుద్ధం. 

• ఎందుకీ దౌర్భాగ్యం దేశానికి. దీని రహస్యం ఎక్కడుంది.

• కనీసం త్రాగునీళ్ళకు నోచుకోదా ఈ దేశం. త్రాగునీరు లేదు. సాగునీరు లేదు. కరెంటు లేదు. ఉపన్యాసాలు వింటే మాత్రం మైకులు పగిలిపోతాయి.

•వాగ్ధానాల హోరు. పనిలో జీరో.

• ఇది ఎవరి అసమర్థత. దేనికి గీటు రాయి.

• నీరు ఉండి కూడా ప్రజలకు అందించలేని దుస్థితి.

• ఇవి పరిష్కరించబడాల్సిన సమస్యలు. చర్చ జరగాల్సింది వీటి మీద. 

• ఇందుకోసం ఉజ్వలమైన, ఉద్విగ్నమైన పాత్ర మన తెలంగాణ పోషించాలి. తప్పకుండా పోషించాలి. మన పాత్ర నిర్వహించాలి. దాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం ముమ్మరంగా చేయాలి.

• ప్రపంచంలోనే అత్యధికంగా యువ జనాభా కలిగి ఉన్న దేశం భారతదేశం. మరేం దరిద్రం..

• 13 కోట్ల మంది భారతీయులు వారి ప్రతిభాపాటవాలను విదేశాల్లో వినియోగిస్తున్నారు. 

• విదేశాల్లో ఉంటున్న భారత పౌరులు తమకు గ్రీన్ కార్డు వచ్చిందని ఇక్కడి కుటుంబ సభ్యులకు చెప్తే వారు ఇరుగుపొరుగు వారిని పిలిచి పార్టీ చేసుకుంటున్నారు.

• ఏమిటీ దౌర్భాగ్యం. మనకు ఆస్తి లేకనా, భూమి లేకనా, ఖనిజ సంపద లేకనా, అటవీ సంపద లేకనా, మేధో శక్తి లేకనా, దేశం ఎందుకు ఇట్లా కునారిల్లుతున్నది.

• ఈ విషయం మీద అందరం కూడా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.

• సింగపూర్ వాళ్ళకు మట్టి కావాలంటే పొరుగు దేశం ఇండోనేషియా నుండి కొనుక్కుంటారు. మట్టిని షిప్పుల్లో తెచ్చుకుంటారు. మంచినీళ్ళు కూడా లేవు. మలేషియా నుండి కొనుక్కుంటారు. ట్రీట్మెంట్ చేసి మళ్ళీ మలేషియాకే అమ్ముతారు. వాళ్ళెత్తే అన్నం ముద్ద కూడా వారిది కాదు. వాళ్లెత్తే ఒక కూరగాయ ముక్క కూడా వారిది కాదు. కానీ సింగపూర్ పరిస్థితి ఏంటి. మన పరిస్థితి ఏంటి.

• సింగపూర్ లో ఏమీ లేదు. మరెందుకు అంత ఉజ్వలంగా ఆ దేశం ఉంది.

• వారి వద్ద ఏమీ లేదు. మేధస్సు ఉంది. మన దగ్గర అన్నీ ఉన్న మేధస్సు లేదు. అందుకే ఇలా కునారిల్లుతున్నాం. ఇది కఠోరమైన వాస్తవం. నిప్పు లాంటి నిజం. ఒకవేళ కాకపోతే నేను నీతి ఆయోగ్ లో చెప్తే అప్పుడు ఖండిస్తారు కదా..

• మైకులు పగిలిపోయే ఉపన్యాసాలతో 75 ఏళ్ళ జీవితం గడిచింది తప్ప ఆశలు నెరవేరలేదు.

• ఇండియాలో 10 గ్రామాలకు అవార్డులిస్తే 10 కి 10 తెలంగాణకు ఒట్టిగానే వస్తాయా.. దయాకర్ రావుగారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. కేసీఆర్ మాట్లాడితేనో, దయాకర్ రావు చేయి ఊపితేనో ఇది జరిగిందా..

• ప్రజల ఆశీర్వాదంతో రెండు టర్మ్ లు గెలిచాం.

• మొదటి టర్మల్ లో 50 కోట్ల మొక్కలు పెంచి, గ్రామ గ్రామానికి తీసుకుపోయి ఇచ్చాం. కానీ అనుకున్న రీతిలో పనులు జరగలేదు.

• రెండవసారి గెలిచిన తర్వాత పని జరగాలంటే ఏం చేయాలి అని ఆలోచించి చట్ట ప్రేరణ, శాసన ప్రేరణ ఉండాలి, విధులు నిర్లక్ష్యం చేసిన వారికి శిక్షలుండాలే అని కఠిన నిర్ణయం తీసుకొని నూతన పంచాయతీరరాజ్ చట్టం తీసుకొచ్చాం.

• 12,769 గ్రామపంచాయతీలుంటే 12,769 పంచాయతీ సెక్రటరీలను నియమించి వారికి బాధ్యతలు అప్పగించాం.

• పల్లె ప్రగతి అని పేరు పెట్టుకొని సంవత్సరానికి రెండు మూడు సార్లు డ్రైవ్ పెట్టి శాసనసభ్యులు, మంత్రులు, అందరం శ్రద్ధతో పనిచేస్తే ఈ రోజు 10 గ్రామాలకు 10 గ్రామాల్లో మనం ఫస్ట్ వచ్చాం. ఊరికే ఇది కాలేదు.

• ఒళ్ళు వంచాలి. మేధో మథనం చేయాలి. మెదడు కరగదీయాలి. జ్ఞానం ప్రాప్తిచేసుకోవాలి. జ్ఞానం అందరి దగ్గరుండదు. జ్ఞానం స్వీకరించే గుణం ఉండాలి. అన్నీ మనకు తెలుస్తయనే అహంకారం వదలిపెట్టాలి. తెలిసిన వారి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే పరిపుష్టగా ఫలితాలు వచ్చి ప్రజలు సంతోషకరమైన జీవితం గడుపుతారు.

• విద్య, వైద్యరంగంలో ప్రతీ రంగంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి అవార్డులు వచ్చాయి. అవార్డుల పంట పండుతున్నది. పార్లమెంటు వేదికగా, పార్లమెంటు సాక్షిగా వందలకొద్ది అవార్డులు వచ్చాయి.

• ఇప్పుడు దేశానికి ఏం కావాలి. 

• ఓ సందర్భంలో ఇక్కడేదో సమావేశముంటే హాజరయ్యేందుకు వచ్చిన కమ్యూనిస్టు పార్టీ మిత్రులు, జాతీయ నాయకులు నన్ను కలిసారు. 

• దేశంలో మనందరం ఇప్పుడు ఏకం కావాలని వాళ్ళంటే ఎందుకని వాళ్లను నేనడిగాను.

• బిజెపీ పార్టీని గద్దెదించాలని వారి నుండి సమాధానం వచ్చింది. అది అందరి లక్ష్యం కావాలన్నారు. ఇది చెత్త ఎజెండా నేను మీతో రానని చెప్పాను.

• ఎవరినో గద్దె దించడం కోసమో, గద్దె ఎక్కించడం కోసమో ప్రయత్నం జరగాలా. గద్దె ఎక్కించాల్సింది భారతదేశ ప్రజలను, పార్టీలను కాదు. రిలీఫ్ రావాల్సింది ప్రజలకు, పార్టీలకు కాదు. 

• ఎంతమంది ప్రధానులు రాలేదు. ఎన్ని కేంద్ర ప్రభుత్వాలు మారలేదు. 

• మారవల్సింది ప్రభుత్వాలు కాదు. మారవల్సింది ప్రజల జీవితం. మారవల్సింది జీవన స్థితిగతులు. దేశ పరిస్థితులు, అందరు తలెత్తుకుని గౌరవంగా బ్రతికే పరిస్థితులు రావాలి.

• ఒక రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మహిళా స్వయం సహాయక సంఘాల యాడ్ కళ్ళ వెంట నీరు తెప్పించింది. అద్భుతమైన సహజ వనరులన్న ఈ దేశంలో ఒక్క పూట తిండి తినాలా. ఒక్క పూట తిండి తినే బాధను తప్పించినట్లు ఆ ప్రభుత్వం యాడ్ ఇస్తది. ఆ రాష్ట్ర తలసరి ఆదాయం మన రాష్ట్రంలో చారణా కూడా లేదు. ఆయనచ్చి హైదరాబాద్ గడ్డ మీద మాట్లాడతాడు. మనకు నీతులు చెప్తాడు.

• ఆయన ఉపన్యాసంలో రేషన్ బియ్యం అందిస్తున్నందుకు ఓట్లు వేయాలని అడుతున్నాడు. రేషన్ బియ్యం ఇచ్చినందుకు ఓట్లేయాలనే దుస్థితికి దేశం చేరుకున్నది.

• ఇది భారతదేశమా.. దేశం ఇలాగే ఉండాలా..

• 75 వేల తలసరి ఆదాయమున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి, 2 లక్షల 78 వేల తలసరి ఆదాయమున్న తెలంగాణకు నీతి పాఠం చెప్పే దుస్థితి.

• ఈ రోజు మన మనసును మనం ప్రశ్నించుకుంటే, మన భారతదేశ లక్ష్యం ఏంది.

• ఏ లక్ష్యం దిశగా పోతున్నది భారతదేశం. మనం ఎవరమైనా చెప్పగలమా..

• దేశం తన లక్ష్యాన్ని కోల్పోయింది. దేశం లక్ష్యమంటే ఒక వ్యక్తి చెప్పే సిద్ధాంతం కాదు. ఒక పార్టీ ప్రవచించే నాలుగు మాటలు కాదు.

• సామూహిక లక్ష్యం, గమ్యం ఉండాలి. ఆ లక్ష్యం దిశగా సామూహిక ప్రయత్నం చేయాలి.

• 1980 వరకు భారతదేశ జిడిపి కంటే చైనా జిడిపి తక్కువ. భారతదేశంలో పండే పంటల కంటే తెలంగాణలో పండే పంటలు తక్కువ. 

• వ్యవసాయానుకూల భూమిని కలిగి ఉండటంలో భారత్ తర్వాతే చైనా.

• 20,30 సంవత్సరాల్లో చైనా దేశం ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది. ప్రపచంలో రెండవ ఆర్థికశక్తిగా ఎదిగింది.

• మరి మనమెక్కడ ఉన్నాం. మన లక్ష్యం ఏమిటి. ఏ దిశగా పోతున్నాం.

• మన రాష్ట్రంలో ఉండే ఒక జిల్లా అంత ఉండదు ఇజ్రాయిల్ దేశం. అక్కడి నుంచే ఆయుధాలు కొంటున్నాం.

• జిల్లా అంత ఉండని ఆస్ట్రియా దేశం నుంచి పంపులు తెచ్చుకుంటున్నాం.

• దీని మీద తీవ్రంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది.

• సామూహిక లక్ష్యాన్ని కోల్పోయి, యావన్మంది దేశ ప్రజలు ఒకే త్రాటి మీద నడలేని దుస్థితికి ఎందుకు దిగజారింది భారతదేశం. కారణమేంటి. బలహీనత ఏంటి.

• ఎందుకు కొరగాకుండా ఈ దేశం ఎందుకున్నది. దీనికి నివారణ ఏమిటి.

• మనకు రావాల్సింది కావాల్సింది ఫ్రంట్ లు కాదు. ఫస్ట్ ఫ్రంట్, మన్ను ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ అన్నీ వచ్చాయ్. ఏం సాధించినయ్. ఏం జరిగింది. 

• ఇవ్వాళ దేశానికి కావాల్సింది ప్రత్యామ్నయా ఎజెండా.

• అద్భుతంగా దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకుపోయే ఎజెండా కావాలె. 

• ఎక్కడో ఒక చోట ప్రారంభం కావాలె. చెప్తే కొంతమందికి తమాషా గా అనిపిస్తుంది.

• 2000 సంవత్సరంలో నేను తెలంగాణ అని మాట్లాడితే కోయి కామ్ దందా నహీ హై క్యా అని అన్నారు

• జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, భగవంతునికి సంకల్పం చేసుకొని బయలుదేరితే 20 ఏండ్లు గడిచేసరికి ఎక్కడున్నాం.

• తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు. అనేక రంగాల్లో దేశానికి తలమానికంగా నిలిచాం.

• మహబూబ్ నగర్ నుంచి సగం జనాభా 15, 16 లక్షల మంది అన్నమో రామచంద్రా అని చెప్పి వలసపోయేది.

• ఈ రోజు వలసలన్నీ రివర్స్ వచ్చేసాయి. ఏ వ్యక్తి కూడా తెలంగాణ నుంచి వలస పోవట్లేదు.

• ఇవ్వాళ బెంగాల్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, కర్నాటక మొదలైన 11 రాష్ట్రాల నుండి వలసలు మన దగ్గరున్నాయి. సుమారు 25 నుండి 30 లక్షల మంది అనేక రంగాల్లో పనిచేస్తూ పొట్ట నింపుకుంటున్నారు.

• నేను గర్వంగా చెప్తున్నా. ఇవాళ బీహార్ హమాలీ కార్మికులు లేకపోతే తెలంగాణ రైస్ మిల్లుల నడవయ్. బీహార్ కార్మికులు లేకపోతే తెలంగాణ డైరీ ఫార్మ్ లు నిలిచిపోతాయి. 

• నిర్మాణరంగంలో 95 శాతం మంది బెంగాల్, బీహార్ ,ఉత్తరప్రదేశ్ కు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రగతికాముకంగా, శాంతియుతంగా ఉంది. సాయంత్రానికో 1000 రూపాయలు జేబులో పెట్టుకోవచ్చని వారు భావిస్తారు.

• కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వేధించే సమయంలో నానాకష్టాలు పడుతున్న వలస కూలీలకు బియ్యం, రేషన్, మందులిచ్చి, 178 ప్రత్యేకమైన రైళ్ళు పెట్టి, టికెట్ ఛార్జీలు భరించి, వారి భోజన సదుపాయం కల్పించి, వారివారి ఊళ్ళకు పంపించాం. వారు పోయేటప్పుడు జై తెలంగాణ అనుకుంటూ పోయారు.

• చేతి నిండా పని దొరుకుతుంది. కడుపు నిండా అన్నం దొరుకుతుంది. రక్షణ ఉంది. మంచి చెడ్డలు చూసే ప్రభుత్వముందని చెప్పి అందరికందరు తిరిగి వచ్చారు. వీరితో పాటు మరికొందరు కూడా కలిసి వచ్చారు. 

• చేయగలిగే సామర్థ్యముంటే, సంకల్పముంటే, చిత్తశుద్ధి ఉంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం, వసతులు, వనరులు కలిగి ఉన్నది నా భారతదేశం

• కలిగి లేక బాధపడితే వేరు, కలిగి ఉండి బాధపడుతున్నాం.

• దీని కోసం కేసీఆర్ రాజకీయ ఫ్రంట్ ప్రకటిస్తాడా లేదా ఇంకోటి ప్రకటిస్తాడా అని ఆలోచిస్తున్నారు.

• తెలంగాణ కోసం ఎలాగైతే ప్రాసెస్ చేసినామో, ఏ ప్రాసెస్ ద్వారా తెలంగాణ వస్తుందని నమ్మామో, అట్లాగే అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి కూడా ప్రాసెస్ జరగాలి. 

• ఆ ప్రాసెస్ లో ఏం జరుగుతుందనేది భవిష్యత్ తేలుస్తుంది.

• ఈ మధ్య నేను జార్ఖండ్ వెళ్ళినప్పుడు యాంటి బిజెపి ఫ్రంట్ ఎప్పుడు పెడుతున్నారని విలేఖరులు అడిగారు.

• భారతదేశ ప్రజలకు అనుకూలమైన ఫ్రంట్ పెడతం తప్ప యాంటి, ఫర్ ఫ్రంట్ లు ఉండవని చెప్పాను.

• భారతదేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దే ఎజెండాకు శ్రీకారం చుడతామని చెప్పాను

• దేశం బాగుపడడానికి మన దేశం నుండి ఏదయినా జరిగితే అది మనందరికీ గర్వకారణమని విలేఖరులకు తెలియజేస్తున్నాను.

• దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి, దేశ గతిని మార్చడానికి, దేశం స్థితిని మార్చడానికి, దేశాన్ని సరైన పంథాలో నడిపించడానికి ఒకవేళ హైదరాబాద్ వేదికగా ఒక కొత్త ప్రతిపాదన, కొత్త సిద్ధాంతం, కొత్త ఎజెండా తయారై దేశం నలుమూలలా వ్యాపిస్తే అది మన రాష్ట్రానికి, దేశానికి గర్వకారణం.

• దేశానికి ఈ రోజు ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి కాదు, ప్రత్యామ్నాయ ఎజెండా కావాలి. ఆ దారులు వెతకాలి. వ్యవసాయానికి ఇంటిగ్రేటెడ్ పాలసీ ఆఫ్ ఇండియా రావాలి. నూతన ఆర్థిక విధానం రావాలి. నూతన పారిశ్రామిక విధానం రావాలి. ప్రతీవాడు పనిచేసే అవకాశం రావాలి. అందుకవసరమైన వేదికలు రావాలి.

• ఆ భారతదేశం లక్ష్యంగా పురోగమించాలి కానీ కేవలం సంకుచిత రాజకీయ లక్ష్యాల కోసం కాదు

• దేశానికా కావాల్సింది అభ్యదయ పథం. అందుకు కావాల్సిన సిద్ధాంత ప్రాతిపదిక. అందుకు అవలంబించాల్సిన ఎజెండా, ఆచరించాల్సిన మార్గం నేడు దేశానికి కావాలి.

• మా యువ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి చేయాలి అనే పేపర్లో వ్యాసం రాశాడు. ఇట్లా అనేక రకాల ఆలోచనలు చెలరేగుతున్నాయి.

• 20 ఏండ్ల క్రితం దిక్కు, దిశ, దశలేని తెలంగాణ.. అయోమయ పరిస్థితుల్లో ఉన్న తెలంగాణ.. ఒక పార్టీ, ఒక నాయకత్వం లేని తెలంగాణ ఇవ్వాళ అద్భుతంగా ఏ దశకు చేరుకున్నదో అందికీ తెలుసు.

• సుస్థిరమైన, సువ్యవస్థితమైన, సుసంపన్నమైన వనరులతోని సుమారు వేయి కోట్ల ఆస్తులు కలిగి ఉన్నటువంటి కంచుకోటగా, శ్రీరామ రక్షగా తెలంగాణ ప్రజలకు శాశ్వతంగా ఉండిపోయే రాజకీయ పార్టీగా టిఆర్ఎస్ ఏ విధంగా రూపుదిద్దుకున్నదో అందరికీ తెలుసు.

• స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసంలో పురుడుపోసుకున్నది తెలంగాణ రాష్ట్ర సమితి. నాడు కనీసం కార్యాలయం కూడా లేదు. నేడు సమున్నతంగా, సగౌరవంతో దేశ రాజధాని ఢిల్లీలో 8.5 కోట్ల ఖర్చు పెట్టి స్థలం కొని, మరో 8,10 కోట్ల రూపాయల ఖర్చుతో బిల్డింగ్ కడుతున్నాం.

• 6,7 నెలల కాలంలో దేశరాజధానిలో సగౌరవంగా తలెత్తుకొని రెపరెపలాడే మన గులాబీ జెండా రెపరెపలాడనుంది.

• తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో హైదరాబాద్, వరంగల్ తప్ప మిగతా 31 జిల్లాల్లో అద్భుతమైన కార్యాలయాలు కలిగి ఉన్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఇవన్నీ కూడా మన ఆస్తులు. తెలంగాణ ప్రజల ఆస్తులు.

• టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి. తెలంగాణ అస్థిత్వం కోసం, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ఉనికి కోసం, తెలంగాణ ప్రజల కోసం అనుక్షణం కాపలాదారుగా ఉండేటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ.

• అందరికీ సమాన అవకాశాలుండాలనే లక్ష్యంతో, స్థిరమైన నిర్ణయంతో, స్పష్టమైన వ్యూహంతోని, అవగాహనతో, ఈ దేశానికే పాఠం నేర్పేటువంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.

• అద్భుతమైన తెలంగాణ సమాజాన్ని సాధించే దిశగా మనం తెలపెట్టిన మరో బృహత్తర కార్యక్రమం తెలంగాణ దళితబంధు

• దళితబంధు కార్యక్రమం దేశానికే, ప్రపంచానికే ఆదర్శం కాబోతున్నది.

• దళితజాతిలో రత్నాలు, మణులు, మాణిక్యాలు, వజ్ర వైఢూర్యాలు, అద్భుతమైన ప్రతిభాసంపన్నులు కోకోల్లలుగా ఉన్నారు. దళితబంధు వారికి అవకాశాలను కలిగిస్తున్నది.

• దళితబంధులో మూడు కార్యక్రమాలున్నాయి. మూడు పార్శ్వాలున్నాయి.

• ఒకటి.. 17.5 లక్షల దళిత కుటుంబాలకు దశలవారీగా సంవత్సరానికి 2 లేదా 2.5 లక్షల చొప్పున ప్రతీ కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం చేయడం. కిస్తీలు లేవు. తిరిగి కట్టేది లేదు. బ్యాంకు లింకేజీ లేదు. వారికి నచ్చిన పని చేసుకునే వెసులుబాటు.

• రెండు.. ప్రభుత్వం లైసెన్స్ లు ఇచ్చే అన్ని రంగాల్లో వారికి రిజర్వేషన్లు. మెడికల్ షాపులు, ఫర్టిలైజర్ షాపుల్లో రిజర్వేషన్లు. హాస్టల్స్ సప్లైస్, హాస్పటల్ సప్లైస్ లో, వైన్ షాపుల్లో, బార్ షాపుల్లో రిజర్వేషన్లు కల్పించి అమలు చేశాం. 

• దళితబంధు పథకం ద్వారా ఇచ్చే 10 లక్షల రూపాయలతో దళితబిడ్డలు ఎన్ని పనులైనా చేసుకోవచ్చు.

• ఇద్దరు, ముగ్గురు కలిసి పనులు చేసుకోవచ్చు. ఎలాంటి ఆంక్షలు లేవు.

• మూడు.. దళిత రక్షణ నిధి. దీని ద్వారా తెలంగాణ దళితబంధు పథకం ద్వారా లబ్దిదారులకు ఇచ్చే 10 లక్షల రూపాయల్లో నుండి వారి రక్షణ కోసం 10 వేల రూపాయలు తీసి, ప్రభుత్వం మరో 10 వేల రూపాయలు కలిపి వారి రక్షణ కోసం జమ చేస్తున్నది. బిపిఎల్ పరిధి నుండి ఎపిఎల్ పరిధిలోకి పోయినవారు తిరిగి ఏదైనా కారణాలతో బిపిఎల్ పరిధిలోకి వస్తే వారి రక్షణ కోసం ఈ నిధి ఉపయోగపడుతుంది. 

• తెలంగాణ దళిత సమాజం భారతదేశ దళిత సమాజానికే పాఠాలు చెప్పే గొప్ప దళిత సమాజంగా తయారవుతుంది.

• ఈ పథకంలో అద్భుతాలు జరిగి తీరుతయ్.

• అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేర్చడంలో తెలంగాణ అద్భుతంగా పనిచేస్తుందని నేను మనవి చేస్తున్నాను

• దేశంలో జరుగుతున్న తీరు పై ప్రజాక్షేత్రంలో చర్చోపచర్చలు జరగాలి.

• జాతిపిత మహాత్మాగాంధీనే దూషణలు చేసే దేశమా భారతదేశం. ఇదేం పెడధోరణి, ఇదేం దుర్మార్గం.

• మహాత్మాగాంధీని చంపిన హంతకులను పూజించడమా.. ఇది పద్ధతా.. దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు. ఏ రకమైన మతపిచ్చి లేపుతున్నారు. 

• మధుసూదనాచారి గారి అధ్యక్షతన తయారుచేసిన తీర్మానాలు ఆషామాషీగా తయారుచేసినవి కావు. చాలా మనసు పెట్టి, సమకాలీన సమాజంలో ఏం జరుగుతున్నదో తెలియజెప్పే తీర్మానాలు.

• ఈ రోజు దేశంలో జరుగుతున్నటువంటి విద్వేషం మంచిదా.. ఏం వింటున్నాం. ఏం జరుగుతున్నది. ఎక్కడికి ఈ పరిస్థితులు దారితీస్తాయ్. విధ్వంసం చేయడం చాలా తేలికనే. కానీ నిర్మించాలంటే ఎంత శ్రమపడాలి. 

• మన పొరుగు రాష్ట్రం కర్నాటక రాజధాని బెంగుళూర్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. అక్కడ ప్రత్యక్షంగా 30 లక్షల మంది హై క్లాస్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరో 30 లక్షల మంది పరోక్షంగా పనిచేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు కృషి చేస్తే ఆ స్థాయికి చేరుకున్నది. వారికి ఎవరు ఉద్యోగాలివ్వాలి.

• నేడు కర్నాటక రాష్ట్రంలో ఏం జరుగుతున్నది. హిజాబ్, హలాల్, పూలు కొనద్దు. పండ్లు కొనద్దు. ఇదా జరిగేది.

• భారత రాజ్యాంగం ప్రకారం ఏ పని ఎవరైనా స్వీకరించవచ్చు. ఇదెక్కడి దుర్మార్గం. 

• విదేశాల్లో 13 కోట్ల మంది భారతీయులు పనిచేస్తున్నారు. ఒకవేళ ఆ దేశాల్లో మీరు మతస్తులు కాదు, కులస్తులు కాదు. గెటవుట్ అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఉద్యోగాలిస్తుందా..? 

• ఇప్పటికే కువైట్ దేశంలో 11 మంది ఎంపీలు భారతదేశంలో పిచ్చిపిచ్చి జరుగుతోంది, ఈ భారతీయులను ఇక్కడ కొనసాగించడమా.. వెళ్ళగొట్టడమే అనే చర్చ జరిగింది. ఇది మంచిదా..?

• ఏ ఆశించి దుర్మార్గాన్ని చేస్తున్నారు. 

• కేంద్రంలో పోయిన సర్కారే మంచిగుండే అని ప్రజలు ఆలోచిస్తున్నారు.

• ఎన్నో సమస్యలతో దేశం సతమతమవుతా ఉంటే ఏదో విద్వేషం, ద్వేషం చెలరేగే పనులు చేస్తున్నారు. 

• రాజకీయ సందర్భం వస్తే విద్వషాలు రగులుస్తారు. పుల్వామా, సర్జికల్ స్ట్రైక్స్, కశ్మీర్ ఫైల్స్ అంటారు. 

• మానిన గాయాలను ఎందకు తిరిగి రేపుతున్నారని కశ్మీరేలే ప్రశ్నిస్తున్నారు. 

• ఉజ్వలమైన భారత నిర్మాణం జరగాలా.. పిచ్చి కొట్లాటలు జరగాలా.. ఏం జరగాలి దేశంలో?

• బెంగుళూర్ తర్వాత హైదరాబాద్ ఐటిలో రెండో స్థానంలో ఉంది. సుమారు 2 లక్షల 30 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి.

• 20 వేల కొత్త పరిశ్రమలు ఈ 7 ఏండ్లలో వచ్చాయి. 14, 15 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు లభించాయి.

• హైదరాబాద్ లో శాంతిభద్రతలు బాగుంటాయంటే అందరూ వస్తారు కానీ, కర్ఫ్యూలు పెడతరంటే ఎవరైనా వస్తారా.

• పరిశ్రమలు వస్తాయా. పెట్టుబడులు వస్తాయా. ఉద్యోగాలు వస్తాయా.

• కత్తుల కొట్లాటలు ఎవరికి కావాలె. ఇదేం దిక్కుమాలిన దౌర్భాగ్యం

• కావాల్సింది ప్రాజెక్టులు, మంచినీళ్ళు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. 

• ఈ దేశం ఇలాగే నాశనం కావాలా.. లేదు.. టిఆర్ఎస్ గా మనం కూడా మన పాత్ర పోషించాలా.. దేశానికి ఒక మార్గం చూపెట్టే ప్రయత్నం జరగాలా.. ఇదీ మన ముందున్న ప్రశ్న.

• ఈ దౌర్భాగ్య పరిస్థితి దేశానికి మంచిది కాదు. ఇవ్వాళ ఎవరూ సేఫ్ గా ఉండరు. ఏదీ జరగదు.

• దేశంలో గలీజు రాజకీయాలు నడుస్తున్నాయి.

• ఈ దేశంలో అనేక మంది మంచి మంచి రాజకీయ నాయకులు ఆచరించి చూపెట్టారు. 

• మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్, కేరళలలో గవర్నర్లతో పంచాయితీ. 

• స్వర్గీయ ఎన్.టి.రామారావు గారు నిష్కల్మషంగా ప్రజలకు ఏదన్నా మంచి చేద్దామని పార్టీ పెట్టారు. ఆ రోజు యువకులుగా మేము ఆ పార్టీలో పని చేశాం. ఎటువంటి కిరికిరి లేకుండా 200 మంది ఎమ్మెల్యేలతో ఆయన అధికారంలోకి వచ్చారు. 

• ఇదే దుర్మార్గమైన గవర్నర్ల వ్యవస్థను వినియోగించి ఆయనను పదవి నుంచి తొలగించారు.

• తెలుగు ప్రజలు కాంగ్రెస్ మెడలు వంచి మళ్ళీ ఎన్.టి.రామారావును తిరిగి నియమించేదాకా పోరాడారు. 

• ఎన్.టి. రామారావు ను తొలగించిన గవర్నర్ అవమానపడి ఇక్కడి నుంచి తొలగించబడ్డాడు. దాన్నుంచి దేశం గుణపాఠం నేర్చుకోవాలి కదా.

• దీనికి ఉల్టాగా నేడు దేశంలో ఏ జరుగుతుంది.

• నేడు దేశంలో రాజ్యాంగ సంస్థల గతి ఏమవుతుంది. రాజ్యాంగ ప్రతిపత్తి ఏమవుతుంది. రాజ్యాంగ రక్షణలు ఏమవతున్నాయి.

• మృగాల్ల లాగా దేశ రాజధానిలో తుపాకులు, కత్తులు పట్టుకునే పరిస్థితా.. ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తా..

• ఈ దేశంలో అంబేద్కర్ కలలు గన్న రాజ్యాంగ స్ఫూర్తి నిజం కావాలంటే అవసరమైన మౌలికమైన మార్పులు, చేర్పులు చేసుకొని అద్భుతమైన ప్రత్యామ్నాయ ఎజెండాతోని, ప్రజల ఎజెండాతోని కొత్త రాజకీయ శక్తి ఈ దేశంలో ఆవిర్భవించాలి. తప్పకుండా ఆవిర్భవించాలే.

• సందర్భానుసారం స్పందించే గుణం భారతదేశ లక్ష్యం.  

• ఇండియా బుద్దుగాళ్ళ దేశం కాదు. ఇండియా బుద్ధిజీవుల దేశం

• తప్పకుండా శక్తులు వస్తాయి. మనం నిరాశపడాల్సిన అవసరం లేదు.

• తెలంగాణ కోసం అవసరమైన నాడు టిఆర్ఎస్ రూపంలో పెద్ద శక్తి పుట్టలేదా. గాలి దుమారం లేపలే. తెలంగాణ సాధించుకరాలే..

• అలాగే, దేశానికి అవసరమైన నాడు కూడా దేశంలో భూకంపం పుట్టిచ్చి, తుఫాను సృష్టించి ఈ దుర్మార్గాన్ని తరిమేసే రోజులు దగ్గర్లోనే ఉంటాయి.

• తప్పకుండా సముజ్వలంగా తెలంగాణ, తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ కూడా తప్పక అందులో ఉజ్వలమైన పాత్ర పోషిస్తుంది.

Share it:

TS

Post A Comment: