మన్యం టీవి న్యూస్,మణుగూరు: ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి మరోపక్క ఫారెస్టు అధికారులను ఉసిగొలిపి భూముల ఆక్రమణకు పాల్పడుతూ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని , ఆదివాసులు సాగుచేసుకుంటున్న పోడు భూములను బలవంతంగా దురాక్రమణకు పాల్పడటాన్ని ఆపాలని, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి మోర రవి డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కృష్ణసాగర్, దేవయ్యగుంపు, ఊర్ల దోసపాడు, బత్తులనగర్, బట్టిగూడెం , రాజీవ్ నగర్ , ఎద్దుల చెరువు ఆదివాసులతో పోడు భూముల ఆక్రమణకు సర్వే నిర్వహించడానికి వస్తున్న ఫారెస్ట్ అధికారులను కృష్ణ సాగర్ హాస్టల్ బ్రిడ్జి వద్ద అడ్డుకునీ నిరసన వ్యక్తం చేశారు అనంతరం కృష్ణ సాగర్ గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మోర రవి మాట్లాడుతూ.. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ తో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తోపాటు, అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరిగిన ఉద్యమాన్ని చల్లార్చడానికి కేసీఆర్ ప్రభుత్వం, పోడు భూములకు పట్టాలు ఇస్తామని, దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించిందని, వెంటనే ఫారెస్టు అధికారులను ఉసిగొలిపి, సాగులో ఉన్న భూములను బలవంతంగా గుంజుకుని, ట్రoచి లు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసులు సాగుచేసుకుంటున్న పోడు భూములను ఆక్రమించుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని, జల్ జంగిల్ జమీన్ హమారా నినాదంతో కొమరం భీమ్ , రాంజీ గోండు, ఆదివాసి వీరుల పోరాటాల స్ఫూర్తితో పోడు భూములు కాపాడుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసుల జీవితాలతో ఆడుకోవాలని చూస్తే, ఉద్యమాలతో తిప్పికొట్టి చెత్త బుట్టలో పడ వేస్తారని హెచ్చరించారు. ఇప్పటికైనా టిఆర్ఎస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి, ఫారెస్ట్ వారి దాడులను ఆపివేసి, పట్టా కోసం దరఖాస్తు చేసుకున్న ఆదివాసుల పోడు భూములన్నింటికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు డి పున్నం చందర్, బర్ల రామకృష్ణ , భద్రయ్య, ఇడమయ్య , రాజు , సోమయ్య , రమేష్ , లక్ష్మయ్య, వీరమ్మ , దూలయ్య, కన్నయ్య, గంగరాజు, దేవయ్య , లక్ష్మయ్య, నందిని , భీమమ్మ, జ్యోతి, జోగమ్మ , భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: