జనగామ : జనగామ జిల్లాలో కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనాన్ని కేసీఆర్ స్వీకరించారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ శిలాఫలకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు.
జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రశాంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నాయకులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.
ప్రజలకు సౌకర్యవంతమైన సేవలందిచేందుకు గాను కలెక్టరేట్ భవనాన్ని అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా నిర్మించారు. రూ. 32 కోట్ల వ్యయంతో 25 ఎకరాల్లో మూడంతస్తుల్లో.. 34 శాఖలు కొలువుతీరేలా సమీకృత భవనాన్ని నిర్మించారు.
కాగా, మధ్యాహ్నం యశ్వంతాపూర్ వద్ద నిర్మించిన టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. కొత్తగా నియమితులైన టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి బాధ్యతల స్వీకరణలో సీఎం పాల్గొంటారు. అక్కడే జిల్లా పార్టీ ముఖ్యులతో సమావేశమవుతారు. సాయంత్రం 3 గంటలకు బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు.
Post A Comment: