మేడారం వనదేవతల మహాజాతర మండమెలిగె పండుగతో నిన్న ఘనంగా ప్రారంభమైంది. వనజనుల సంప్రదాయంలో భాగంగా సమ్మక్కకు చంద వంశీయులు పుట్టింటి చీరను సమర్పించారు. ఆచారం ప్రకారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం బయ్యక్కపేట నుంచి మేళతాళాల నడుమ సమ్మక్క చీరను ఆమె పుట్టింటి వారైన చంద వంశీయులు అంగరంగ వైభవంగా ఊరేగింపుగా వచ్చి వారి వంశ ఆడబిడ్డకు పుట్టింటి చీరను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీలు సైతం కొత్త దుస్తులు వేసుకొని ఉత్సాహంగా పాల్గొన్నారు. సమ్మక్క గుడిని శుద్ధి చేసి అలుకు పూతలు చేసి.. ధూప, దీప నైవేద్యాలను సమర్పించి మొక్కులు సమర్పించుకున్నారు. జాతర పునరుద్ధరణ కమిటీ చైర్మన్ కోర్నిబెల్లి శివయ్య ఆధ్వర్యంలో చంద వంశీయులు పుట్టింటి చీరను సమ్మక్క గద్దె వద్ద సమర్పించారు.
మేడారం సమ్మక్క, సారలమ్మ భక్తుల పుణ్యస్నానాల కోసం లక్నవరం సరస్సు నుంచి నీటిని విడుదల చేశారు. ఈ జలాలు శనివారం జంపన్న వాగు చేరనున్నాయి. ఈ నెల 21 వరకు నీటి విడుల కొనసాగుతుంది. కరోనా వ్యాప్తి, మేడారం రద్దీ నేపథ్యంలో లక్నవరం సరస్సు సందర్శనను నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు.రామప్ప దేవాలయ సందర్శనను కూడా తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. మేడారం మహా జాతరకు ప్రముఖులను ఆహ్వానించేందుకు గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన ప్రత్యేక ఆహ్వాన పత్రికర ఆకట్టుకుంది. గిరిజన కళలు, హస్తకళలు బహుమతులతో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆహ్వాన పత్రికను సిద్ధం చేసింది. ప్రత్యేక గిఫ్ట్ బాక్స్‌తో ఆహ్వాన పత్రికను ముస్తాబు చేశారు. ఇందులో కాఫీ టేబుల్ బుక్, కోయ/గోండు పెయింటింగ్స్, నాయకపు గిరిజన దారు శిల్పాలు, ఓజా గోండ్ క్రాఫ్ట్స్, బంజారా క్రాఫ్ట్స్, సమాచార స్టిక్కర్లు ఉన్నాయి. సీఎంలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, జాతీయ, రాష్ట్రస్థాయి ప్రముఖులకు గిరిజన సంక్షేమ శాఖ మేడారం ఆహ్వాన పత్రికను అందజేసింది.
Post A Comment: