మన్యం టీవీ అశ్వాపురం:
సీతమ్మ సాగర్ బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు వర్షాకాలంలో అంతరాయం లేకుండా మే నెలాఖరు వరకు పనులు పూర్తి చేయాలని,రాష్ట్ర ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్,సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ తెలిపారు.శనివారం అశ్వాపురం మండలం, అమ్మగారిపల్లి గ్రామం వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పరిశీలనకు హైదరాబాద్ నుండి హెలిక్యాప్టర్ లో ఇంజినీర్ మురళీధర్ రెడ్డి,ఎల్ అండ్ టి సీఈఓ సుబ్రహ్మణ్యంలతో కలిసి మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకున్నారు.ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ఇరిగేషన్,ఎల్ అండ్ టి అధికారులను అడిగి తెలుసుకున్నారు.ప్రాజెక్ట్ నిర్మాణానికి కావాల్సిన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని సూచించారు.
రూ.3480 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అశ్వాపురం,చర్ల,దుమ్ముగూడెం మండలంలో 63 గ్రామాల పరిధిలోని 3121.4 ఎకరాల భూమి అవసరం కాగా,ఇప్పటి వరకు 2640.39 ఎకరాల భూ సేకరణ ప్రక్రియ పూర్తయినట్లు చెప్పారు.ఇరిగేషన్ శాఖకు 2485.18 ఎకరాలు భూమి అప్పగించినట్లు చెప్పారు. పరిహారం కింద రూ.112.77 కోట్లు చెల్లింపు చేశామని, మిగతా 740 ఎకరాలు అప్పగించాల్సి ఉందని,దీనికి పరిహారం రూ.59.20 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు వివరించారు.వర్షాకాలం వరకు ప్రాజెక్ట్ పనులకు అంతరాయం కలగకుండా,తదుపరి నిర్మాణ పనులు జరిగేందుకు వీలుగా మే నెలాఖరు నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని చెప్పారు.ప్రాజెక్ట్ అవసరాలకు కావలసిన ఇసుక అందజేశామని చెప్పారు. నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన జరిగేందుకు కావాల్సిన యంత్రాలను, సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రాజెక్ట్ కు 40 కిలోమీటర్లు కుడి కాలువ,59 కిలోమీటర్లు ఎడమ కాలువ నిర్మించాల్సి ఉందని చెప్పారు.పరిసర ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రక్షణ బండ్స్ నిర్మించనున్నట్లు చెప్పారు.36.5 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యం తో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు 65 గేట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రాజెక్ట్ ద్వారా భద్రాద్రి,ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలోని 6.45 లక్షల ఎకరాలకు సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా నిరంతరాయంగా పంట పొలాలకు నీరందించనుట్లు తెలిపారు.ప్రాజెక్ట్ ప్రాధాన్యతను,అవసరాలను దృష్టిలో ఉంచుకొని వేగవంతం చేయాలన్నారు.ప్రాజెక్ట్ నిర్మానానికి 322 ఎకరాలు సీఏ ల్యాండు అప్పగించాల్సి ఉండగా,222 ఎకరాలు సేకరణ జరిగిందని,మిగిలిన 100 ఎకరాలు పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. నిర్మాణ పనుల్లో ఏమైనా సమస్యలుంటే తక్షణమే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని, పనుల్లో జాప్యం జరగడానికి వీల్లేదని చెప్పారు.అనంతరం ఎల్ అండ్ టి ప్రాజెక్ట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించి,ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ఇరిగేషన్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.అనంతరం 4.30 గంటలకు హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్,ఐటిడిఎ పి ఓ పోట్రు గౌతమ్,ఇరిగేషన్ సీఈ శ్రీనివాసరెడ్డి,ఎస్ ఈ వెంకటేశ్వరరెడ్డి,శ్రీనివాసరెడ్డి, ఎల్ అండ్ టి డిజిఎం రజనీష్ చౌహన్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: