మన్యంటీవి, అశ్వారావుపేట:ఓ మహిళను హత్యచేసి తప్పించుకు తిరిగాడు. కొన్నేళ్ళ తర్వాత పోలీసుల వలకు చిక్కాడు. నేరం రుజువు కావడంతో న్యాయ స్థానం జీవిత ఖైదు విధించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 2017 వ సంవత్సరంలో జరిగిన హత్య కేసులో శుక్రవారం సత్తుపల్లి కోర్టు తీర్పు వెలువడింది. స్థానిక పేపర్ బోర్డులో కూలీలుగా పని చేసే ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సవరం రమేష్, పినపాక మండలం చింతలపాడు గ్రామానికి చెందిన ముచ్చిక కొసమ్మ అనే మహిళ తన భర్త దేవయ్య కలిసి పక్క పక్క ఇళ్ళల్లోనే అద్దెకు ఉండేవారు. 18-11-2017న ముచ్చిక కొసమ్మ ఇంట్లో సవరం రమేష్, భర్త దేవయ్య ముగ్గురు కలిసి మద్యం సేవించారు. అధికంగా మద్యం తాగిన భర్త దేవయ్య నిద్రలోకి జారుకున్న తర్వాత ముచ్చిక కొసమ్మపై సవరం రమేష్ లైంగిక దాడికి యత్నించాడు. ఆమె నిరాకరించడంతో కొట్టి హత్య చేసి పేపర్ బోర్డు వెనుకనున్న నిర్మానుష్య ప్రాంతంలో శవాన్ని పడేసి పరారయ్యాడు. రెండు రోజుల తర్వాత మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. 20-11 2017 న అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 302, 201 ల కింద కేసు నమోదైంది. కానీ, పోలీసుల కన్నుగప్పి నిందితుడు తప్పించుకు తిరిగాడు. కొన్నేళ్లు గడిచిన తర్వాత అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బంధం ఉపేంద్రరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసుపై ప్రత్యేక శ్రద్ధ వహించి చేపట్టిన ఆపరేషన్ లో 2021వ సంవత్సరంలో పట్టుబడ్డాడు. దీంతో నిందితుడిని సత్తుపల్లి కోర్టులో హాజరు పరిచారు. సత్తుపల్లి ఏడీజే కోర్టులో జరిగిన న్యాయ విచారణలో నేరం నిరూపణ కావడంతో నిందితుడు సవరం రమేష్ కు జీవిత ఖైదు శిక్షను విధిస్తూ జిల్లా అదనపు జడ్జీ సాయి భూపతి తీర్పు ఇచ్చారు. నేరం చేసి తప్పించుకు తిరగొచ్చు అనుకునేవారికి ఈ కేసు ఓ గుణపాఠం లాంటిది. పోలీస్ వ్యవస్థ నేరస్థులను అంత తేలిగ్గా వదిలిపెట్టదని కూడా ఈ కేసుతో మరోమారు రుజువయింది. ఓ మహిళను దారుణంగా హత్య చేసి హాయిగా బయట తిరుగుతున్న నిందితుడిని పట్టుకొని న్యాయస్థానం ముందు నిలబెట్టడంలో చొరవ చూపి పోలీసులను ఎంతైనా అభినందించాల్సిందే.
Post A Comment: