CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వమే జప్తు చేసి, తక్షణమే ఆ డబ్బులను అగ్రిగోల్డ్ బాధితుందరికీ చెల్లించాలి - రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ .

Share it:

 


మన్యం వెబ్ డెస్క్:

రాష్ట్రంలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వమే జప్తు చేసి, తక్షణమే ఆ డబ్బులను అగ్రిగోల్డ్ బాధితుందరికీ చెల్లించి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి నెలాఖరు వరకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపికి వినతిపత్రం అందజేయాలని, జిల్లా కలెక్టరేట్, మండల కార్యాలయాల ఎదుట ధర్నా కార్యాక్రమాలను నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. అప్పటికీ ప్రభుత్వం స్పందిచకపోతే మార్చి మొదటి వారంలో ‘చలో హైదరాబాద్’ నిర్వహిస్తామని వెల్లడించింది. తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో హిమాయత్ మగ్ధుం భవన్ శుక్రవారం రౌండ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షుడు ఎన్.బాలమల్లేష్ అధ్యక్షత వహించగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు, టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లురవి, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ(ఎం.ఎల్-న్యూడెమోక్రసి) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.గోవర్ధన్, టిజెఎస్ రాష్ట్ర నాయకులు శ్రీధర్, సిపిఐ(ఎం.ఎల్-న్యూడెమోక్రసి) నాయకులు అన్వేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడున్న అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుని, బాధితులకు డబ్బులను చెల్లిస్తుందని ,అదే తరహా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.   

ఆత్మహత్యలొద్దు : చాడ వెంకట్ రెడ్డి 

అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, సమస్యను పోరాటం ద్వారా పరిష్కరించుకోవాలని చాడ వెంకట్ రెడ్డి సూచించారు. అందరూ కలిసికట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో కొన్ని చిట్ సంస్థలు కూడా ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఇలాంటి మోసాల పట్ల కఠినంగా వ్యవహారించేలా నూతన సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితుల సమస్యను తమకు సంబంధం లేదనే ప్రభుత్వ దోరణి మంచిది కాదన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటే సిఎం కెసిఆర్ ప్రభుత్వానికే మంచి పేరు వస్తుందని, సిఎం అంటే తండ్రిలాంటి వారని, అందరినీ ఆదుకుంటామని ప్రకటించాలని సూచించారు. రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు సుమారుగా రూ. 500 కోట్లు చెల్లించాల్సి ఉండగా, అగ్రిగోల్డ్ ఆస్తులే సుమారు వెయ్యి కోట్ల రూపాయల వరకు ఉన్నదని వివరించారు. ఇప్పటి వరకు 350 మంది అగ్రిగోల్డ్ ఏజెంట్లు, డిపాజిట్లరు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆత్మహత్యలను చూస్తే మానవత్వం ఉన్న ఏ ప్రభుత్వమైనా స్పందిస్తుందన్నారు.  

తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ : 

సమస్యను పరిష్కరించకపోతే అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాల ఓట్లు తమకు పడవనే భావన అధికార పార్టీకి రావాలని, అప్పుడే న్యాయం జరుగుతుందన్నారు. కేవలం వినతిపత్రాల ద్వారా సమస్యల పరిష్కారం కాదని, బాధితకుటుంబాలన్నీ వీధుల్లోకి రావాలని సూచించారు. ఏజెంట్ల ద్వారా మోసపోయామనే భావన నుంచి డిపాజిట్ దారులు బయటకు రావాలని, అందరూ ఐకమత్యంగా పోరాటం చేయాలన్నారు. వామపక్షాల విద్యుత్ పోరాట ఫలితంగా పదేళ్ల వరకు ఏ ప్రభుత్వం కూడా విద్యుత్ చార్జీలను పెంచలేకపోయిందని గుర్తు చేశారు.  

మల్లు రవి మాట్లాడతూ 

: ఓట్ల కోసం కాకుండా ప్రజా సమస్యలను పట్టించుకోని పరిస్థితులను చూసి రాజకీయ పార్టీలు సిగ్గుపడాలన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై గవర్నర్, సిఎం, సిఎస్ కలిసి వినతిపత్రం అందజేయాలని, ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేయాలని సూచించారు. బాధితుల పోరాటంలో కాంగ్రెస్ ప్రత్యేక్షంగా భాగస్వామ్యం అవుతుందన్నారు. 

 కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ మోసాలు జరగకుండా చూడాల్సిన ప్రభుత్వం, ఇడి, సిబిఐ, పోలీసు వ్యవస్థలు ఎక్కడ ఉన్నాయని, గాడిద పన్నులు తోముతున్నాయా అని దుయ్యబట్టారు. నియోజకవర్గాల వారీగా బాధితులు ఐకమత్యంగా స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకురావాలని, సమస్యను పరిష్కరించకుంటే బాధిత కుటుంబాల ఓట్లు పడవనే పరిస్థితులను తీసుకురావాలని సూచించారు. బాధితులు స్థానిక అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కూడా కదిలించాలన్నారు. ఏ రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించకుండా బాధితులను ఆదుకుంటామని సిఎం కెసిఆర్ ముందుకొచ్చినా తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదన్నారు. ఇక నుంచి ఎవరైనా బాధితులు ఆత్మహత్య చేసుకుంటే అందుకు బాధ్యత ప్రభుత్వానిదే నన్నారు.

 కె.గోవర్దన్ మాట్లాడుతూ 

: బాధితులను ఆదుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపైన ఒక్క రూపాయి భారం కూడా పడదన్నారు. 

 ఎన్.బాలమల్లేష్ మాట్లాడుతూ ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు ప్రతి మండలంలో అగ్రిగోల్డ్ బాధితుల కమిటీలను ఏర్పాటు చేస్తామని, 8వ తేదీ నుంచి ఆందోళన కార్యక్రమాలను చేపడుతామన్నారు.నెల రోజుల పాటు బాధితులు ఎక్కడికక్కడ మంత్రులను, ఎమ్మెల్యేలను తిరగనివ్వంకుడా సమస్యను పరిష్కరించేలా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు కె. కాంతయ్య, తెలంగాణ గిరిజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్. అంజయ్య నాయక్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ స్టాలిన్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలి ఉల్లాహ్ ఖాద్రి, తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ప్రధాన కార్యదర్శి గోగుల వెంకటేశ్వర్, ఉపాధ్యక్షురాలు గుడిమెట్ల రజిత, కోశాధికారి మద్దినేని రామారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నల్లబోలు సునీత, దమ్మాలపాటి రామనర్సయ్య, ఆనంద్, కట్ట సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: