మన్యం టీవీ మణుగూరు:
సింగరేణి లో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ,ఫిబ్రవరి12 నుంచి జరగబోయే నిరవధిక సమ్మెకు సింగరేణి ఓబీ కార్మికులు సిద్ధంగా ఉండాలని,సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు లో భాగంగా సోమవారం దుర్గ ఓబి కార్మికులకు డిమాండ్ బ్యాడ్జీలు పెట్టి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.ఈ సందర్భంగా సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఆర్.మధుసూదన్ రెడ్డి,జి. శ్రీనివాస్,వెలగపల్లి.జాన్,ఎండీ. గౌస్,తోట.రమేష్,నల్ల.రమేష్, కనకయ్య,పాల్గొని మాట్లాడుతూ,రోజు రోజుకు నిత్యావసర సరుకుల ధరలు, ఇతర ధరలు ఆకాశాన్ని అంటుతుండగా,కార్మికుల వేతనాలు మాత్రం పాతాళంలో ఉన్నాయని అన్నారు.ఈ స్థితిలో వేతనాలు పెంచాలని సింగరేణి యాజమాన్యానికి అనేక సార్లు విన్నవించిన ప్పటికీ,అనేక ఆందోళనలు నిర్వహించినప్పటికీ,సింగరేణి యాజమాన్యం చెవిటి వాడి ముందు శంఖం ఊదిన చందంగా వ్యవహరిస్తుంది తప్ప,వేతనాలు మాత్రం పెంచడం లేదన్నారు.ఈ స్థితిలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు, సింగరేణి ఓబీ కార్మికులకు సమ్మె తప్ప మరోమార్గం లేదన్నారు.అందుకే ఫిబ్రవరి 12వ తారీకు నుంచి నిరవధిక సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు.ఈ సమ్మెలో సింగరేణి ఓబీ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేసి, సింగరేణి యాజమాన్యం కళ్లు తెరిపించి వేతనాలు పెంచుకోవాలన్నారు.సమ్మె సన్నాహకం లో భాగంగా ఫిబ్రవరి 5 వ తారీకు మణుగూరు జిఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుందని,ఈ ధర్నాలో ఓబీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశం లో జేఏసీ నాయకులు,ఐ.రాములు, ఉప్పుతల.నరసింహారావు,ఓబీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: