CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నవంబర్ 25వ తేదీ వర్ధంతి సందర్భంగా.విశ్వ విప్లవ వీరుడు

Share it:

 .




''క్యూబా విప్లవనేత ఫిడెల్‌ కాస్ట్రో 20వ శతాబ్దపు అసాధారణ యోధుడు. అత్యంత ప్రభావశీల ప్రపంచ నాయకుల్లో ఒకరు'' ఐక్యరాజ్యసమితి సాధారణసభ పూర్వ అధ్యక్షుడు పీటర్‌ థామ్సన్‌. అమెరికా సామ్రాజ్యవాదాన్ని, నీచ రాజకీయ హత్యాకుట్రలను ఎదిరించి గెలిచిన యోధుడు ఫిడెల్‌ కాస్ట్రో. సంపన్న భూస్వామి ఇంట ఆగస్టు 13, 1926న ఫిడెల్‌ అలెజాండ్రొ కాస్ట్రో రుజ్‌గా జన్మించిన కాస్ట్రో విశ్వ విప్లవవీరునిగా, సంపూర్ణ మానవునిగా నవంబర్‌ 25, 2016న మరణించారు.'' 


కాస్ట్రో రోమన్‌ క్యాథలిక్‌ పాఠశాలలో చదివారు. హవానా యూనివర్సిటీ నుండి లా, సోషల్‌ సైన్సెస్‌ డిగ్రీలు పొందారు. విద్యార్థిగా సామ్రాజ్యవాద వ్యతిరేకత, వామపక్ష రాజకీయాలు వంటబట్టి నాస్తికునిగా మారారు. 1948లో ధనిక విద్యార్థిని మిర్తా డయాజ్‌ బలార్ట్‌ను ప్రేమించి పెళ్ళాడారు. ఫిడేల్‌ పేదల అనుకూల కార్యక్రమాలు, నిరాడంబరత వారిని విడదీశాయి. 1980లో దలియా సోటొ వల్లెను వివాహమాడారు. 1953లో తనపై మోపబడిన తిరుగుబాటు అభియోగాన్ని కోర్టులో 4గంటలు వాదించారు. సామ్రాజ్యవాద దోపిడీ అంతానికి విప్లవమే కర్తవ్యమన్నారు. న్యాయమూర్తులతో.. ''ప్రియ శవాల్లారా, ఒకప్పుడు మీరు నా మాతృదేశ ఆశాకిరణాలు. ఇప్పుడు కుళ్ళిన మీ ఎముకుల ధూళి నా గుండెను తాకుతోంది. నా కన్నీళ్ళు నియంతలకు కన్నీళ్ళు తెప్పిస్తాయి. 70మంది సహచరులను కోల్పోయిన నాకు మీ శిక్షలు ఏపాటివి? చరిత్ర నన్ను నిందావిముక్తున్ని చేస్తుంది'' అన్నారు. వర్గరహితుడై పీడితజనం కోసం ప్రాణాలొడ్డి విప్లవబాట పట్టారు. చే గువేర, తమ్ముడు రావుల్‌, కామిలొ సీన్‌ ఫ్యుగోస్‌, జువాన్‌ అల్మీదాలు కాస్ట్రో విప్లవ సహచరులు. 1959లో సైనిక నియంత బాటిస్టాను గద్దెదింపి 49ఏండ్లు క్యూబాను పాలించారు. ఫిడెల్‌ కాస్ట్రో క్యూబా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక కార్యదర్శి. విప్లవ సాయుధ దళాల సర్వ సైన్యాధిపతి. క్యూబా విప్లవం సామ్రాజ్యవాద విరుద్ధ, ప్రభుత్వాధీన ఆర్థిక విధానాల సోషలిస్టు వ్యవస్థను నిర్మించింది. ''ప్రజలను చైతన్యపరచాలి. ఆలోచనలు, అవగాహన పెంచాలి. సంఘీభావతత్వం, అంతర్జాతీయత బోధించాలి. ఎదిరించే శక్తి కల్పించాలి. ఆలోచనలను ఎవరూ చంపలేరు'' అంటారు కాస్ట్రో.మార్క్సిజం, జాతీయవాది జోస్‌ మార్తి మానవతావాద తాత్వికతలు ఫిడేల్‌ను ప్రభావితం చేశాయి. 'సోషలిజమా? మరణమా?' అని ప్రోత్సాహ నినాదం ఇచ్చేవారు. మార్క్సిస్టులు, లెనినిస్టులు, జాతీయవాదులు, దేశభక్తులతో జాతీయ ప్రభుత్వం ఏర్పరిచారు. విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలు చేశారు. అమెరికా సంస్థలను జాతీయంచేశారు. అంటువ్యాధులు, మురికివాడలు నిర్మూలించారు. ప్రజాభాగస్వామ్య సంస్థలు నిర్మించారు. చిత్తడి నేలలను వ్యవసాయ భూములుగా మార్చారు. ఉచిత విద్య, వైద్య సౌకర్యాలు కల్పించారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించారు. మత సంస్థలపై పరిమితులు విధించారు. క్యూబా నాస్తిక దేశం అయ్యింది. బయోటెక్నాలజీ పరిశ్రమను అభివృద్ధిచేశారు. ఫిడేల్‌ కాస్ట్రో సమగ్ర మానవతావాది. వర్గభేదాలు ఖండించారు. తిండి, ఇల్లు, విద్య, ఆరోగ్యం వగైరా ప్రాథమికావసరాలు అందరికీ అందించే వ్యవస్థను స్థాపించారు. వ్యక్తిగత స్వేచ్ఛలను గౌరవించారు. 96 అంతర్జాతీయ పురస్కారాలు పొందారు. చావెజ్‌, మొరేల్స్‌, మండేలాలకు ఆదర్శ నాయకుడు. 


మార్క్స్‌, లెనిన్‌, జోసి మార్తి, కాంట్‌, షేక్సిపియర్‌, ముంతే, సోమర్సెట్‌ మామ్‌, దోస్తోవ్క్సిల రచనలను మార్క్సిస్టు చట్రంలో విశ్లేషిస్తూ క్యూబా సమాజానికి వాడుకున్నారు. కాస్ట్రో ఉత్తమ క్రీడాకారుడు. బేస్‌ బాల్‌ నిపుణుడు. క్రీడలను ప్రజలందరికీ అందించారు.అమెరికా క్యూబా పంచదార కొనుగోళ్ళు, తన ఎగుమతులు ఆపింది. వాణిజ్య ఆంక్షలు విధించింది. దౌత్య సంబంధాలు తెంచుకుంది. సాయుధ దాడులతో కాస్ట్రో ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నింది. 638సార్లు కాస్ట్రోపై హత్యాయత్నాలు చేసింది. అమెరికాకు క్యూబా 90మైళ్ళ దూరంలో ఉందన్న కెన్నెడి బెదిరింపునకు ధీటుగా క్యూబాకు అమెరికా కూడా అంతే దూరంలో ఉందని కాస్ట్రో ప్రతి హెచ్చరిక చేశారు. వంద కోట్ల డాలర్ల అమెరికా ఆస్తులు జప్తుచేశారు. అలీనోద్యమంలో క్యూబా ప్రధాన పాత్ర పోషించింది. 1979 నుండి 1983 వరకు కాస్ట్రో సెక్రెటరీ జనరల్‌ బాధ్యత నిర్వహించారు. 1979లో ఐక్యరాజ్యసమితి సాధారణసభలో 4 గంటల 29 ని.ల కాస్ట్రో ప్రసంగం ఓ సంచలనం. ''మానవ హక్కులతో పాటు మానవత్వహక్కులూ కావాలి. కొందరు ఖరీదైన కార్లలో తిరగడానికి అనేకులు వట్టికాళ్ళతో నడుస్తున్నారు. కొందరు 70ఏండ్లు జీవించడానికి చాలామంది 35 ఏండ్లకే చస్తున్నారు. కొందరు అత్యంత ధనికులు కావడానికి అసంఖ్యాకులు దయనీయ పేదరికంలో బతుకుతున్నారు. నేను కూటికి గతిలేని పిల్లల, మందులు కొనలేని రోగుల, గౌరవంగా జీవించే హక్కులేని దీనుల పక్షాన మాట్లాడుతున్నాను'' అని గర్జించారు. పేదరికం, భూస్వామ్యపీడన, అవినీతి, ధనస్వామ్య దోపిడీలతో సతమతమవుతున్న లాటిన్‌ అమెరికా దేశాలకు క్యూబా ఆదర్శమని న్యూస్‌ వీక్‌ పత్రిక ముఖ్యులు వాల్టర్‌ లిప్మన్‌ అన్నారు. వలసవాద ప్రపంచం నుండి విముక్తికి సాగే విప్లవ యుద్ధాలకు నా ప్రభుత్వ మద్దతు ఉంటుందని ఫిడెల్‌ ప్రకటించారు. అంగోలా వలసవాద వ్యతిరేక యుద్ధాలలో సైన్యాన్ని పంపారు. దాని ఫలితమే స్వతంత్ర నమీబియా. 1960లో ఫిడెల్‌ కాస్ట్రో లాటిన్‌ అమెరికా దేశాలకు విప్లవాన్ని ఎగుమతి చేశారు. పాశ్చాత్య దేశాల మద్దతుగల పాలకులతో పోరాడటానికి 1970లో ఆఫ్రికాకు సైనిక బృందాలను పంపారు. అమెరికా నుండి పారిపోయి వచ్చిన బ్లాక్‌ పాంథర్‌ నాయకులకు అభయమిచ్చారు. ''మూడవ ప్రపంచ దేశాల మేధావులు, సాంకేతిక నిపుణులు, వైద్యులు, శాస్త్రవేత్తలను ధనిక దేశాలు లాక్కుపోతాయి. ప్రపంచీకరణ వినిమయ మార్కెట్‌ను సృష్టిస్తుంది. ప్రజలు పిచ్చివాళ్ళుగా, ఆలోచనా రహితులుగా, శూన్యమనస్కులుగా తయారవుతారు'' అని కాస్ట్రో ఆగ్రహాన్ని, బాధను వ్యక్తపరిచారు. 1990లో 'ట్రంప్‌ హౌటల్స్‌ అండ్‌ కాసినో రిసార్ట్స్‌ ఇన్కార్పొరేషన్‌' ద్వారా క్యూబాలో జూదగృహం తెరవాలని ట్రంప్‌ ప్రయత్నించారు. జూదగృహానికి కాస్ట్రో అనుమతి ఇవ్వలేదు.సోవియట్‌ పతనంతో దాని సహాయ సహకారాలు ఆగాయి. ఫిడెల్‌ పెట్రోల్‌ రేషన్‌ తగ్గించారు. కార్ల బదులు చైనా సైకిళ్ళు వాడారు. అత్యవసర వస్తువులు ఉత్పత్తిచేయని ఫ్యాక్టరీలు మూసేశారు. ట్రాక్టర్ల బదులు ఎద్దులు, గుర్రాలను దింపారు. గ్యాస్‌ బదులు వంట చెరుకు వాడారు. విద్యుత్తు వినియోగంలో రోజుకు 16గంటల వరకు కోతవిధించారు. పొదుపు చర్యలను ప్రజలకు వివరించి విశ్వాసం కల్పించారు. మద్దతు సంపాదించారు. పర్యాటకరంగ అభివృద్ధితో నియంత్రణలు ఎత్తేశారు. 


2008లో ఐచ్ఛికంగా తప్పుకొని తోటి విప్లకారుడు, తమ్ముడు రావుల్‌కు పాలన అప్పజెప్పారు. ఫిడెల్‌ వ్యక్తి ఆరాధనకు వ్యతిరేకి. ఆయన చనిపోగానే సంస్థలు, వీధులు, పార్కులు, ప్రజా స్థలాలకు ఫిడెల్‌ పేరు పెట్టరాదని, విగ్రహాలు ప్రతిష్టించరాదని రావుల్‌ ప్రభుత్వం ఆదేశిచించింది.అమెరికా సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక, వాణిజ్య యుద్ధాలుగా మారింది. దాని కుట్రలు, కుతంత్రాలు క్యూబాలో కూడా గొడవలు సృష్టిస్తున్నాయి. విప్లవ జీవితపు తొలినాళ్ళలో ఫిడెల్‌ కాస్ట్రో కమ్యూనిస్టు కాదు. ఆచరణలో అత్యంత నిబద్దతగల కమ్యూనిస్టుగా మారారు. ఫిడెల్‌ ఆదర్శాలు, ఆశయాలు, విప్లవజీవితాన్ని కేవలం స్మరించి లాభంలేదు. అనునిత్యం ఆచరించాలి. అమెరికాకు అజేయ యోధుడు కాస్ట్రోలేని నేటి క్యూబాకు మద్దతుగా నిలబడాలి. అదే ఆయనకు అర్పించగల ఆచరణ సార్థక నివాళి.

Share it:

TS

Post A Comment: