CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గులాబీ పార్టీలో ఎస్సీ, ఎస్టీల స్థానం ఎక్కడ?

Share it:

  *సంస్థాగత కమిటీల్లో దక్కని చోటు


 *ఏకపక్షంగా కమిటీలు వేశారంటూ ఫిర్యాదుల వెల్లువ


 *ఉద్యమకారులకు దక్కని గౌరవం


 *మన్యంటీవి, అశ్వారావుపేట:* కార్యకర్తల అభీష్టానికి భిన్నంగా గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు ఏకపక్షంగా కమిటీలు వేశారంటూ గులాబీ వర్గాల్లో లకలుకలు ప్రారంభమయ్యాయి. అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కమిటీలను నియోజవర్గ ఇన్చార్జి నూకల నరేష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావులు ప్రకటించిన అనంతరం కమిటీలు ఏకపక్షంగా ఏర్పాటు చేశారని ఓసి, బీసీలు తప్ప ఎస్సీ, ఎస్టీల ఊసే లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉద్యమ నాయకులకు సైతం సరైన గౌరవం లభించలేదని పలువురు గులాబీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ నియోజకవర్గమని, అత్యధిక ఓటు బ్యాంకు గిరిజనుల తరువాత ఎస్సీ సామాజికవర్గందేనని, అనేక మంది నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ సర్వశక్తులు ఒడ్డారని, కానీ నియోజకవర్గ వ్యాప్తంగా ఎస్సీ,ఎస్టీల కు ప్రాతినిధ్యం ఇవ్వకపోవటం అన్యాయమని పలువురు నాయకులు ప్రత్యక్షంగానే విమర్శిస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవాలంటే ఎస్టీ, ఎస్సీ సామాజికవర్గం ఓట్లే ప్రధానమని, ఇటువంటి సామాజిక వర్గం నుండి ఒక్కరు కూడా ప్రధాన కమిటీ లో లేకపోవడం పట్ల ఆయా సామాజిక వర్గాలు పెదవి విరుస్తున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తల అభీష్టానికి భిన్నంగా ఏకపక్షంగా కమిటీలు వేశారని దీనితో నియోజకవర్గంలో వర్గ పోరు మరింత ఉద్ధృతం అయిందని పలువురు నేతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. చండ్రుగొండ, దమ్మపేట, ములకలపల్లి మండల కమిటీ ఎన్నిక మీటింగ్ లో కార్యకర్తల అభిప్రాయాలకు భిన్నంగా సీల్డ్ కవర్ కమిటీలు నియామకం చేసారని, ములకలపల్లి లో మెజార్టీ అభిప్రాయాలతో తీర్మానం చేసినా ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా కమిటీలు వేశారని గులాబీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. గులాబీ వర్గంలో కొనసాగుతున్న అత్యధిక మంది నాయకులు ఆనాటి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వారేనని, అటువంటి వారికి పదవులు కట్టబెట్టి, ఉద్యమ నాయకులకు ద్రోహం చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు గిరిజన ఎమ్మెల్యే అయి ఉండి సంస్థాగత కమిటీల్లో గిరిజనుల కానీ, షెడ్యూల్ కులాల వారికి కాని చోటు దక్కకపోవడం కొందరు నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలంటే రాష్ట్ర నాయకత్వం దృష్టిసారించి ఇటువంటి గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికి, పార్టీ కోసం కష్టపడే వారికి పదవులు అప్పగించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పలువురు కార్యకర్తలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన సంస్థాగత కమిటీల ఏర్పాటు విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారని, తగు చర్యలు తీసుకొని నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఈ కమిటీల నియామకం అంతా నియోజకవర్గ ఇన్చార్జి నూకల నరేష్ రెడ్డి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయన అనుచరులు చేసిన ఒత్తిడి మేరకు ఏకపక్షంగా వ్యవహరించారని, స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అభిప్రాయాలకు కూడా తావు లేకుండా పోయిందని, ప్రస్తుత సంస్థాగత కమిటీల్లో ఎంపిక చేసిన అధ్యక్షులు 2004 అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మల ఓటమికి, 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన సీపీఎం అభ్యర్థి పాయం వెంకయ్య ఓటమికి, 2014 సంవత్సరంలో మెచ్చా నాగేశ్వరరావు ఓటమికి, 2019లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన నాకు వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే చుట్టూ భజన బృందం గా చేరి రాబోయే ఎన్నికలలో నిండా ముంచుతారనే అనుమానాలు ఉన్నాయని తగు చర్యలు తీసుకొని నియోజకవర్గ వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీని అభివృద్ధి వైపు నడిపించాలని కేటీఆర్ కు తాటి వెంకటేశ్వర్లు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు అధికార పార్టీ నాయకత్వం గ్రూపులు గ్రూపులు గా విడిపోయి క్రింది స్థాయి కార్యకర్తలను గందరగోళానికి గురి చేయడమే కాకుండా పార్టీ బలోపేతానికి తిలోదకాలు ఇస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన ఎస్సీ,ఎస్టీ సామాజిక వర్గాలను కలుపుకొని నియోజకవర్గ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.

Share it:

Post A Comment: