CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గొబెల్స్‌ను మించి బీజేపీ అసత్య ప్రచారం : మంత్రి హరీశ్‌రావు

Share it:

 సిద్దిపేట : బీజేపీ గొబెల్స్‌ను మించి తీవ్రస్థాయిలో అసత్య ప్రచారం చేస్తుందని, అతను బతికుంటే ఆ పార్టీ ప్రచార తీరును చూసి ఉరేసుకునేవాడని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేటలో టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్ధపు ప్రచారాలతో ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని ఆరోపించారు. 2014లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాయన్నారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిపితే.. బీజేపీ పాలనలో దేశ జీడీపీ బంగ్లాదేశ్‌ కన్నా తక్కువకు పడిపోయిందన్నారు. హుజురాబాద్‌లో బీజేపీ వాళ్లు ఏం చెప్పి ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వనందుకా? పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచినందుకు ఓట్లు అడుగుతారా? అని మండిపడ్డారు. గతేడాది వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్‌ కిరాయి ఎకరానికి మూడువేలు ఉంటే నేడు.. ఐదువేలు అడుగుతున్నారని గుర్తు చేశారు. డీజిల్‌ ధర రూ.60 నుంచి రూ.106 పెంచి రైతుల నడ్డి విరిచిందని, కేసీఆర్‌ రైతుబంధు కింద రూ.5వేలు ఇస్తే.. కేంద్ర ప్రభుత్వం రైతుబంధు కింద రూ.2500 ఇచ్చి.. ఇంధన ధరలు పెంచి మరో చేతితో తీసుకుంటుందని ఆరోపించారు.గొబెల్స్‌ను మించి బీజేపీ అసత్య ప్రచారం : మంత్రి హరీశ్‌రావు

ప్రైవేటీకరణతో ఉద్యోగాలు ఊడగొడుతూ.. తప్పుడు ప్రచారం

ఓ వైపు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ ఉద్యోగాలు ఊడగొడుతూనే.. మళ్లీ సోషల్‌ మీడియాలో తాము ఉద్యోగాలు ఇవ్వడం లేదంటూ ఆరోపణలు చేస్తోందని మంత్రి విమర్శించారు. బీసీ సంక్షేమశాఖ ఏర్పాటు చేయమని కోరితే.. ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మేందుకు డిసిన్వెస్ట్‌మెంట్‌ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందన్నారు. దీంతో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లను ఎత్తివేసే ప్రక్రియ బీజేపీ ప్రభుత్వం చేపడుతోందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్టీసీ వంటి సంస్థలకు రూ.3వేల కోట్లు ఇచ్చి ఉద్యోగులను కాపాడుకుంటుందన్నారు. ఇప్పటికే 1.30లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని, త్వరలో మరో 50వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు హరీశ్‌రావు స్పష్టం చేశారు.


హుజూరాబాద్‌లో ఈటల గెలిస్తే ఆయనకే లాభం

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈటల రాజేందర్‌ గెలిస్తే లాభం ఏంటని, ఆయన విజయం సాధిస్తే ఆయనకు మాత్రమే లాభమన్నారు. అక్కడ అభివృద్ధి కుంటుపడుతుందని, వ్యక్తి ప్రయోజనమా.. హుజూరాబాద్‌ ప్రజల ప్రయోజనమా? అన్న చర్చపెట్టాలని డిమాండ్‌ చేశారు. దళితబంధు హుజూరాబాద్‌లో వద్దని ఈటల రాజేందర్‌ అంటున్నారని, కల్యాణ లక్ష్మి, రైతుబంధు పరిగ ఏరుకున్నట్లు అవసరం లేదని అన్నారని, దీనిపై బీజేపీ వైఖరేంటో బండి సంజయ్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఓట్లు అడిగే ముందు రైతుబంధు, కల్యాణ లక్ష్మి, దళితబంధుపై వైఖరి చెప్పాలన్నారు. రైతుబంధును హుజూరాబాద్‌లో ప్రారంభిస్తే ఈటల ఆనాడు చప్పట్లు కొట్టారని, అదే సెంటిమెంట్‌తో దళితబంధు ప్రారంభిస్తామని సీఎం ప్రకటిస్తే గుండెలు బాదుకుంటున్నాడన్నారు.


కొంత మంది బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని.. తొందరగా ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. దీంతో దళితబంధు పథకం ఆగిపోతుందని వారి ఆశ అని, రైతుబంధు, దళితబంధు దండగ అనే బీజేపీ నేతల ఈటల కావాలా? టీఆర్‌ఎస్‌ కావాలా? అన్న చర్చ పెట్టాలన్నారు. దళిత‌బంధు పెడితే ఎన్నికల‌ కోసం అంటున్నారని.. గత మార్చి నెలలో బడ్జెట్ లోనే దళితుల అభ్యున్నతికి రూ.1200 కోట్లతో దళిత్ ఎంపవర్‌మెంట్‌ స్కీమ్‌ను ఆర్థికమంత్రిగా తాను అసెంబ్లీలో ప్రకటించానని గుర్తు చేశారు.


దళితులు బాగుపడడం బీజేపీకి ఇష్టం లేదు

దళితులు బాగుపడడం బీజేపీకి ఇష్టం లేదని మంత్రి ఆరోపించారు. గడియారాలు, కుట్టు మిషన్లు, గొడుగులు, కుక్కర్లను పంచుతూ ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని.. అందుకే ప్రజలు సీఎం కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకొని.. ఆ గడియారాలను పగులగొడుతున్నారన్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు పక్కా అనీ… భారీ మెజారిటీతో గెలుపునకు కృషి చేయాలన్నారు. సోషల్‌ వారియర్లు నేటితరం కార్యకర్తలని, రానున్న రోజుల్లో పార్టీల్లో వారి భవిష్యత్‌ ఉజ్వలంగా ఉంటుందన్నారు. బీజేపీ సోషల్‌ మీడియా అసత్య ప్రచారాలను అడ్డుకొని.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో విప్‌ బాల్క సుమన్‌, ఎర్రొళ్ల శ్రీనివాస్‌, గొల్లు శ్రీనివాస్‌, కౌశిక్‌రెడ్డి, సతీశ్‌, దినేష్‌, జగన్మోహన్‌రావు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: