దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా కొవిడ్ బారిన పడిన జర్నలిస్టులను తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ మీడియా అకాడమి ఆదుకున్నదని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. తెలంగాణ జర్నలిస్టులకు అందించిన కొవిడ్ ఆర్థిక సహాయం మొత్తం రూ. 5 కోట్ల 15 లక్షలు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం – శిక్షణ కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి జర్నలిస్టులకు ఎదురైన కరోనా ఇబ్బందులను కొద్ది మేరకైనా తొలగించడానికి ప్రయత్నం చేసిందన్నారు.
తొలి విడత కరోనా సమయంలో దాదాపు 1,553 మంది కరోనా సోకిన జర్నలిస్టులకి రూ. 3 కోట్ల 10 లక్షల 60 వేలు అదే కరోనాతో హోంక్వారంటైన్ లో ఉన్న జర్నలిస్టులు 87 మందికి రూ. 8 లక్షల 70 వేల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. రెండవ విడత కరోనా తీవ్ర ఉధృతి కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే దాదాపు 1,958 మంది జర్నలిస్టులకి కరోనా సోకింది. మలి విడత ఆర్థిక సహాయం రూ. 10 వేల వంతున 1,958 మంది జర్నలిస్టులకి ఒక కోటి 95 లక్షల 80 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు చెప్పారు.
VDO.AI
ఈ కరోనా మహమ్మారితో ఎంతోమంది పేరుగాంచిన జర్నలిస్టులు ఆకాల మరణం పొందారు. కొవిడ్ తో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 2 లక్షలు ఆర్థిక సహాయం ఇవ్వాలని మీడియా అకాడమి నిర్ణయించింది. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఒక నెలలోపు ఆర్థిక సహాయం అందిస్తాము. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఇచ్చిన విధంగానే 5 ఏళ్ల పాటు నెలకు రూ. 3 వేల పెన్షన్ లభిస్తుంది. అంతేగాక మరణించిన జర్నలిస్టు కుటుంబంలో 10వ తరగతిలోపు చదువుకుంటున్నవారిలో గరిష్టంగా ఇద్దరికి ఒక వేయి రూపాయల చొప్పున ఉపకార వేతనం అందుతుంది.
కొవిడ్ సోకి మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులు పూర్తి చేసిన దరఖాస్తులను కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి, హైదరాబాద్ చిరునామా : ఇంటినెం.10-2-1, సమాచార భవన్, 2వ అంతస్తు, ఎ.సి. గార్డ్స్, మాసాబ్ ట్యాంక్, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ది సంస్థ కాంప్లెక్స్, హైదరాబాద్ కు పంపవలసిందిగా అల్లం నారాయణ తెలియజేశారు.
Post A Comment: