మన్యం మనుగడ డెస్క్:
కరోనా సెకండ్ వేవ్‌లో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం కర్ఫ్యూ, లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇటీవల రాష్ట్రంలో కేసుల సంఖ్య భారీగా తగ్గడంతో కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. అయితే, కర్ఫ్యూ, లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మే 12 నుంచి జూన్ 18 వరకు 38 రోజుల్లో హైదరాబాద్‌లోని 3 కమిషనరేట్ల పరిధుల్లో సుమారు 1.19 లక్షల వాహనాలను సీజ్ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 72,506, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 24,000, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 22,092 వాహనాలతో కలిపి మొత్తం 1,18,598 వాహనాలను సీజ్ చేశారు.
ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో అకారణంగా రోడ్లపైకి వచ్చిన వారి వాహనాల్ని సీజ్ చేసి జరిమానా విధించారు. అయితే, సీజ్ చేసిన వాహనాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో జరిమానా చెల్లించి పోలీస్‌స్టేషన్‌లో రశీదు చూపించి వాహనం తిరిగి తీసుకెళ్లాలని పోలీసులు సూచించారు. చాలా వాహనాలను వ్యవధిలోనే తిరిగి ఇచ్చేసినట్లు అధికారులు తెలిపారు. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాతే వాహనాలు తిరిగి ఇస్తామని అధికారులు ప్రకటించినప్పటికీ, పార్కింగ్ అసౌకర్యం, వాహనాలకు రక్షణ కల్పించలేక పోవడం లాంటి సమస్యలతో అదే రోజు లేదా మరుసటి రోజు 75 శాతం వాహనాలను పోలీసులు యజమానులకు తిరిగి ఇచ్చేశారు. మిగతా వాటిని కూడా రూ.1000 జరిమానాలు చెల్లించి క్రమంగా తీసుకెళ్లిపోతున్నారు. కేవలం లాక్‌డౌన్ ఉల్లంఘనలు మాత్రమే కాకుండా, లైసెన్సు, వాహన పత్రాలు, మైనర్ డ్రైవింగ్ లాంటి అంశాల్లో కూడా వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Post A Comment: