CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వనం నుండి జనంలోకి

Share it:

 


వనదేవతల రాకతో పూనకాలతో ఊగిపోయిన భక్తులు

గిరిజన ఆరాధ్య దైవాలను దర్శించుకున్న ప్రభుత్వ విప్ రేగా, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య 

గుండాల మన్యం టీవీ: ఆళ్లపల్లి మండల పరిధిలోని మర్కోడు- పెద్దూరు గ్రామ సమీపంలో జల్లేరు వాగు ఒడ్డున వెలసిన కొమరం వంశీయుల ఆరాధ్య దేవత రెక్కల రామక్క జాతర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం వనం నుండి దేవతల రాకతో జాతర ప్రాంగణం జనసంద్రమైంది. భక్తుల కోర్కెలు తీర్చేందుకు వన దేవతలు వనం నుండి జనంలోకి వచ్చినట్లుగా జాతర ప్రాంగణమంతా శివసత్తుల పూనకాలు, గిరిజన సంప్రదాయ నృత్యాలతో మార్మోగింది. ఆదిశక్తి అవతారమైన రెక్కల రామక్క తల్లిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు పోటెత్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తోపాటు  ఖమ్మం, వరంగల్, ములుగు, మహబూబాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి కొమరం వంశీయులు, భక్తులు ఆదిశక్తి అవతారంగా అవతరించిన రెక్కల రామక్కను దర్శించుకోవడానికి పెద్దూరుకు తరలివస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి గిరిజనులు పోటెత్తడంతో గద్దెల వద్ద సందడి వాతావరణం నెలకొంది. జాతర ప్రాంగణాన్ని ఆలయ కమిటీ సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు.  

గుట్ట నుండి గుడికి వచ్చిన రెక్కల రామక్క కొమరం వంశీయుల ఆరాధ్యదైవం రెక్కల రామక్క తల్లిని ఊర గుట్ట నుండి  మేళతాళాలతో గుడి కి తీసుకు వచ్చారు. గిరిజన సాంప్రదాయాలతో గుట్ట నుండి గుడికి తీసుకువచ్చే క్రమంలో పడగలతో ఎదురిల్లుట కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రెక్కల రామక్క దేవతను గర్భగుడికి తీసుకువచ్చి పూజారులు కొమరం లక్ష్మయ్య, రవి, కనకయ్య, సీతయ్య, లాలయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

 గజ్జల పైకి చేరిన వన దేవతలు  పాండవులగుట్ట నుండి గిరిజన ఆచార సంప్రదాయాలతో వనదేవతలను ఆలయ పూజారులు, వడ్డెలు డోలు వాయిద్యాలతో వెదురు కర్ర లకు పడగలను కట్టి వనదేవతల పూనకాలతో తల్లిని స్మరించుకుంటూ నృత్యాలు చేశారు. వనదేవతలను గద్దెలపైకి చేర్చి పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వనదేవతల రాకతో నిండు జాతర ప్రారంభమైంది. అనంతరం దేవతలకు గంగా స్నానం, కళ్యాణం వైభవంగా నిర్వహించారు.  రెక్కల రామక్క జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 

 రెక్కల రామక్క దేవత ను దర్శించుకున్న ప్రభుత్వ విప్ రేగా, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య  రెక్కల రామక్క జాతరను పురస్కరించుకొని పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా  వడ్డెలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక గిరిజనులతో కలిసి గిరిజన సంప్రదాయ నృత్యాలు చేశారు.  వారి వెంట జెడ్పిటిసి కొమరం హనుమంతరావు, ఎంపీపీ కొండ్రు మంజుభార్గవి, పీఏసీఎస్ చైర్మన్ గొగ్గల రామయ్య, సర్పంచులు శంకర్ బాబు, నరసింహారావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, కొమరం వెంకన్న, కొమరం రాంబాబు. కొమరం సురేందర్ తదితరులు ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: