CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు రైతుకోసం..

Share it:

పొడిచిన కొడవలి


మన్యంలో రేగా కాంతారావు విప్లవం


మన్యం మనుగడ కవర్ స్టోరీ 


రేగా కాంతారావు.. పోడురైతుకోసం.. పొడిచిన కొడవలి. గిరిజన రైతులకు అడుగడుగునా జరుగుతున్న వేధింపులు, అన్యాయాలు, అకృత్యాలపై.. యుద్దపిలుపునిచ్చిన మన్యం బిడ్డ. తన జాతికి మేలుచేయని పదవులు ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే అంటూ గర్జించిన నాయకుడు. ఆధునిక రాజకీయాల్లో విభిన్నుడు..విలక్షణుడు. ఖద్దరు తొడిగిన విప్లవం.. తరతరాల ఆదివాసీ అస్తిత్వపతాక వారసత్వం. ఇపుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్‌ టాపిక్‌.. తిరగబడ్డ.. ఆదివాసీ బిడ్డ.

అడవికి దగ్గరలో.. ఆదివాసీ పాఠశాలలో పనిచేసే ఓ ఉపాధ్యాయుడు.. తన సముద్రమంత లోతైన ఆలోచనతో రాజకీయ అరంగేంట్రం చేసి పదునైన వ్యూహాలతో తన ప్రత్యేకత చాటుకుంటున్నాడు. దశాబ్దాలుగా నలుగుతున్న పోడు సమస్య.. గత ఆరేండ్లలో తీవ్రమైంది. అటవీ అధికారుల దాడులు ఏజెన్సీలో పెరిగాయి. ప్రజాప్రతినిధులు తమను గెలిపించిన ప్రజలను కంటికిరెప్పలా కాపలాకాసే పరిస్థితి లేదు. ప్రజాప్రతినిధుల మాటకు గౌరవం లేని చోట.. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు పెడచెవిన పెడుతున్న వేళ.. ఇక తమకు దిక్కెవరు అంటూ ఆదివాసీలు ఆందోళనచెందుతున్న వేళ.. ప్రభుత్వపరంగా చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమైన వేళ.. ఓ ధిక్కారస్వరం యుద్దానికి సిద్దంకండి అంటూ పిలుపునిచ్చింది. ఆ ధిక్కార స్వరం పేరే రేగా. ఆ స్వరమే లక్షలాది ఆదివాసీలకు, పోడుపై జీవనం సాగించే కుటుంబాలకు ధైర్యమైంది. నోరుపెగలని అనేకమంది ఆదివాసీ ప్రజాప్రతినిధులకు బాటచూపింది.

ప్రభుత్వంలో ఉండి.. ప్రభుత్వ అధికారులపై యుద్దం ప్రకటిస్తావా? అంటూ అటవీ అధికారుల సంఘాలు దాడికి ప్రయత్నించినా, ధర్నాలకు, బెదిరింపులకు దిగినా.. మీరు ప్రభుత్వంలో లేరా? మీకు గిరిజనులపై దాడి చేసే హక్కు ఎవరిచ్చారు? అంటూ ధీటుగా ఎదుర్కొన్న ధీశాలి. చూస్కుందాం.. దేనికైనా రెడీ. కేసులు పెట్టుకుంటారా.. పెట్టుకోండి. పోడు రైతులకోసం జైలుకువెళ్ళేందుకైనా సిద్దం అంటూ ప్రకటించిన గుండెధైర్యం, దమ్మున్న నాయకుడు రేగాకాంతారావు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇలాంటి తెగువచూపిన నాయకుడు.. ప్రజల కోసం నిలబడ్డ నాయకుడు అరుదు.

తాను ఆర్ధికంగా ఉన్నతుడు కాదు. గాడ్‌ ఫాదర్లు లేరు. ప్రజలే.. తన బలం. తనకు తన ప్రజలంటే ప్రేమ. ప్రజల బాధలపై ఆర్తి, ఆవేదన. పోడురైతుల కష్టాలకు చలించే.. ఆయన గులాబీజెండా పట్టాడు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లిd సాక్షిగా అనేకసార్లు హామీనిచ్చాడు. లక్షలాది ప్రజలు దానిని వీక్షించారు. ప్రభుత్వాధినేత స్వయంగా తాను ఏజెన్సీలో పర్యటిస్తా.. పోడు సమస్య పరిష్కరిస్తా అని ప్రకటించాడు. ముఖ్యమంత్రి స్వయంగా హామీనిచ్చినా.. క్షేత్రస్థాయిలో అటవీ అధికారులు.. తమకు రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదు.. కేంద్రచట్టాలే అంటూ దాడులు చేస్తుంటే, దాడులకు సంబంధించిన సమాచారాన్ని పదవిలో కూర్చోబెట్టిన ప్రజలు కన్నీళ్ళు పెట్టుకుంటూ చెబుతుంటే బాధ్యతగల ప్రజాప్రతినిధి గా ఏం చేయాలి? అనేకమార్లు ప్రయత్నాలు చేసి..చేసి అన్ని వేదికలను ఆశ్రయించి.. చెప్పీచెప్పీ.. చివరకు ఓపికనశించిన వేళ ఏం జరుగుతుంది? యుద్దనివారణకు అన్ని ప్రయత్నాలు చేశాక.. ఓపికను, సహనాన్ని, మంచితనాన్ని చులకనగా భావిస్తే.. ఏం జరుగుతుందో రేగాకాంతారావు యుద్దగర్జన తర్వాత అధికారయంత్రాంగానికి అర్ధమైంది. ఆసిఫాబాద్‌ జిల్లాలోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. పేరుమోసిన నేతలున్నా.. రేగాకాంతారావులా వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయారు. రేగా తన హెచ్చరికలతో మొత్తం అటవీ శాఖ తమ పనితీరును సమీక్షించుకునేలా చేశారు. రేగా దెబ్బకు రాష్ట్ర అటవీశాఖ చీఫ్‌ నాలుగురోజుల మన్యం పర్యటనకు వచ్చింది. కానీ వెనకటి గుణమేల మాను.. అంటూ తూతూ మంత్రపు పర్యటన.. మరో తప్పుడు నివేదిక.ఎపుడూ గిరిజనులే ఓపిక పట్టాలా?


ఎపుడూ గిరిజనులే.. ఓపిక పట్టాలా? కేసులు ఎదుర్కోవాలా? దాడులు భరించాలా? అటవీ అధికారులు ఎందుకు ఓపికపట్టరు.. వారిది ఈ దేశంలో ప్రభుత్వాలను మించిన వ్యవస్థా? ప్రజాప్రతినిధులను మించిన అధికారమా? రేగా దూకుడు గిరిజనుల్లో ధైర్యం పెంచింది. బతుకుపై ఆశలు పెంచింది. ఆదిలాబాద్‌ నుండి అశ్వారావుపేట దాకా గిరిజప రిజర్వుడు నియోజకవర్గాలే కాకుండా కొత్తగూడెం, మంథని లాంటి జనరల్‌ నియోజకవర్గాల్లో కూడా ఈ సమస్య ఉంది. 15నియోజకవర్గాలను ప్రభావితం చేసే పోడు సమస్య.. ఇంటాబయట ప్రజాప్రతినిధుల అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్న వేళ ఆదివాసీ ముద్దుబిడ్డ రేగాబిడ్డ ఓ ధిక్కార స్వరం వినిపించాడు. ఆ ధిక్కార స్వరం మొత్తం ఏజెన్సీనే జలదరింపజేసింది. రాష్ట్ర యంత్రాంగంలోనూ చర్చగా మారింది. అన్నివర్గాలకు అండగా నిలిచే రేగా.. ఆదివాసీ గిరిజన తెగల అభ్యున్నతికి, చైతన్యానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాడు.


సామాజిక మాధ్యమాల్లోనూ దూకుడు


సామాజిక మాధ్యమాలను అద్భుతంగా వాడే ఐదారుగురు తెలంగాణ నేతల్లో రేగాకాంతారావు ఒకరు. ఆయన ఫేస్‌బుక్‌లో.. చేసిన పోస్ట్‌లే రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలయ్యాయి. బ్రేకింగ్‌ న్యూస్‌లుగా మారాయి. సమీక్షా సమావేశాలు పెట్టించాయి. అధికారులను పరుగులు పెట్టించాయి. టీవీ9, ఎన్టీవీ, ఎబిఎన్‌, వీ6, రాజ్‌న్యూస్‌, హెచ్‌ఎంటీవీ, టీవీ5 ఇలా అన్ని ఛానెల్స్‌లో రేగా వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఫేస్‌ బుక్‌ వాల్‌పై పెట్టిన పోస్ట్‌లు న్యూస్‌ స్టోరీలుగా మారాయి. రాజకీయంగా.. రేగాకు ముందుచూపు ఎక్కువ. తనకు ప్రజలపై ఉన్న ప్రేమ, ప్రజలకు తనపై ఉన్న నమ్మకం ఆయనను సాహసోపేతంగా ముందడుగు వేయిస్తున్నాయి. అందుకే తిరగబడ్డ ఆదివాసీ బిడ్డకు.. అశ్వారావుపేట నుండి ఆసిఫాబాద్‌ దాకా మద్దతు పలుకుతోంది. రేగాకు జై కొడుతోంది. మన్యం ముద్దుబిడ్డ.. దూకుడు కొనసాగాలని, పోడుగోడుకు పరిష్కారం లభించేదాకా కొనసాగాలని కోరుకుంటోంది. రాజకీయాలకు అతీతంగా రేగా కాంతారావు సాహసానికి ప్రశంసల జల్లు కురుస్తోంది.

.....................................................

Share it:

FEATURE

POLITICS

TELANGANA

Post A Comment: